వివాహిత బలవన్మరణం

ABN , First Publish Date - 2021-04-21T04:25:57+05:30 IST

అత్తింటి వేధింపులు వివాహిత ఉసురుతీశాయి. బలవన్మరణానికి పురిగొల్పాయి. ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాయి. భర్త, అత్తమామలే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు

వివాహిత బలవన్మరణం
కన్నీరుమున్నీరవుతున్న మృతురాలి కుటుంబసభ్యులు




అత్తింటి వేధింపులే కారణం

అనాథలైన ఇద్దరు చిన్నారులు

భోగాపురం, ఏప్రిల్‌ 20: అత్తింటి వేధింపులు వివాహిత ఉసురుతీశాయి. బలవన్మరణానికి పురిగొల్పాయి. ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాయి. భర్త, అత్తమామలే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమటంరాయవలసలో మంగళవారం వెంపాడ రమాదేవి (21) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. దల్లిపేటకు చెందిన రమాదేవికి నాలుగేళ్ల కిందట వెంపాడ రాములబంగారి అలియాస్‌ శ్యామ్‌తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె కౌశిక, తొమ్మిది నెలల వయసున్న కుమారుడు వాకేత్‌ ఉన్నారు. గత రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దల వద్ద పంచాయితీ సైతం నడిచింది. ఈ నేపథ్యంలో 15 రోజుల కిందట భర్త వేరే వివాహం చేసుకుంటానని రమాదేవితో ఖాళీ పేపరుపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఇందుకు అత్తమామలు అప్పలనరసమ్మ, రమణలు కూడా ఒత్తిడి చేసినట్టు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రమాదేవి చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో కుటుంబసభ్యులు స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీంతో  రమాదేవి తల్లి రమణ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టారు. రమాదేవి సంతకం పెట్టిన కాగితాన్ని చించివేశారు. పెద్దలు ఇద్దరినీ సముదాయించి పంపించేశారు. కానీ రమాదేవిపై వేధింపులు మాత్రం తగ్గలేదు. భర్తతో పాటు అత్తమామలు మానసికంగా వేధింపులకు గురిచేసేవారు. సోమవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన రమాదేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున అమటంరాయవలసకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. అత్తింటి వారే హత్య చేశారని ఆరోపించారు. అత్తమామలు చిత్రహింసలు పెట్టేవారని..అయినా పిల్లలు ముఖం చూసి సర్దుకుపోవాలని చెప్పేవారమని మృతురాలి చెల్లెళ్లు రోదిస్తూ చెప్పారు. భర్తకు మరో పెళ్లి చేయడానికి ప్రయత్నించడంతో రమాదేవి కృంగిపోయిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇద్దరు చిన్నారులు అమ్మా అంటూ రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. మృతురాలి తండ్రి రమణ ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. బాధిత కుటుంబాన్ని తహసీల్దారు రాజేశ్వరరావు, సర్పంచ్‌ ఉప్పాడ శివారెడ్డి పరామర్శించారు. 


Updated Date - 2021-04-21T04:25:57+05:30 IST