Jun 15 2021 @ 00:41AM

బాలీవుడ్‌ ధోనీ అనిపించుకున్నాడు!

వెండితెర ధోని సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి సోమవారానికి ఏడాది పూర్తయింది. ‘చిచ్చోరే’ చిత్రంలో ‘సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు’ అని తన కొడుకుకు సందేశమిచ్చిన ఆయన ఆత్మహత్య చేసుకోవడం షాక్‌కి గురి చేసింది. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రథమ వర్థంతి సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన్ను గుర్తు చేసుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా.. నివాళులు అర్పించారు. 


బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా సుశాంత్‌కి అవకాశాలు రాకుండా చేసి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే! సుశాంత్‌ మరణంపై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు మొదలుపెట్టారు. తర్వాత ముంబై పోలీసులు ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేయసి రియా చక్రవర్తి సహా అనుమానితుల్ని అరెస్ట్‌ చేయడం, వారు బెయిల్‌ మీద బయటకు రావడం జరిగింది. సుశాంత్‌ మరణించి ఏడాది పూర్తయినా ఈ కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌’ అని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేశారు. ఆయన వ్యక్తిగత, సినీ వివరాలతో ఓ వెబ్‌సైట్‌ను అభిమానులు ప్రారంభించారు.


సుశాంత్‌ గురించి ఆసక్తికర విషయాలు..

బీహార్‌లో జన్మించిన సుశాంత్‌ చిన్నప్పటి నుంచి మంచి చదవరి. 2003 ‘ఏఐఈఈఈ’లో ఆల్‌ ఇండియా ఏడవ ర్యాంక్‌ సాధించి ఢిల్లీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో చేరారు. నటుడు కావాలనే ఆసక్తితో ఇంజనీరింగ్‌కు స్వస్తి చెప్పి యాక్టింగ్‌ వైపు అడుగులేశారు. బాలాజీ టెలీఫిలిమ్స్‌లో ‘కీసీ దేశ్‌ మే హై మేరా దిల్‌’ సీరియల్‌తో కీలక పాత్ర పోషించి మెప్పించారు. 2009లో ‘పవిత్ర రిశ్తా’తో ఉత్తమ నటుడిగా బుల్లితెర అవార్డు అందుకున్నారు. నటన, డాన్స్‌లో మెరుగుపడాలని శిక్షణ కోసం 2011లొ విదేశాలకు వెళ్లారు. హీరో కావాలనే ఆయన కల ‘కై పో చే’(2013) చిత్రంతో నెరవేరింది. రెండో చిత్రం ‘శుద్ధ దేశీ రొమాన్స్‌’ అంతగా ఆకట్టుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అమిర్‌ఖాన్‌ ‘పీకే’లో చేసింది చిన్న పాత్రే అయినా మంచి పేరొచ్చింది. ఆయన అత్యంత కీలక పాత్ర పోషించిన ‘డిటెక్టివ్‌ బ్యోమ్‌కేశ్‌ బక్షి’తో నటనలో నిలకడ లేదని విమర్శించిన అందరికీ ఉత్తమ నటన కనబర్చి సమాధానమిచ్చారు. అదే మలుపు...

మాజీ కెప్టెన్‌ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్‌.ధోనీ’ సినిమాకు హీరోగా ఎంచుకోవడం సుశాంత్‌ కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పింది. రెండు విభిన్న పాత్రల కోసం సుశాంత్‌ ఏడాదిన్నర ట్రైన్‌ అయ్యారు. ధోనీ పాత్రకు సుశాంత్‌ సరిపోతాడా అన్న వారందరినీ తన నటనతో మెప్పించి ‘బాలీవుడ్‌ ధోనీ’ అనిపించుకున్నాడు. రూ.216 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం సుశాంత్‌ కెరీర్‌ మొదటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత  వచ్చిన ‘రబ్తా’, ‘కేధార్‌నాథ్‌’, సోన్‌ చిడియా’ సినిమాలూ అలరించాయి. 


నా సర్వస్వం నువ్వే: రియా చక్రవర్తి

సుశాంత్‌ సోదరి తన తమ్ముణ్ణి తలచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రేయసి రియా చక్రవర్తి ఆయన్ను తలచుకోని క్షణం లేదంటూ సోషల్‌ మీడియాలో భావోద్వేగంగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘నువ్వు మా మధ్య లేవనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సమయం అన్నింటిని నయం చేస్తుందంటారు. నువ్వే నా టైమ్‌, నా సర్వస్వం. నువ్వు ఎక్కడున్న నన్ను అనుక్షణం రక్షిస్తుంటావు. నన్ను నీతోపాటే తీసుకెళ్తావని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను’’ అని రియా చక్రవర్తి పేర్కొన్నారు.