Abn logo
Feb 24 2021 @ 01:26AM

చిట్టా దొరికింది.. పాపం పండింది

ఇంద్రకీలాద్రిపై అక్రమాల పుట్టను తవ్విన ఏసీబీ

ఏ విభాగంలో చూసినా కొండంత అవినీతి 

ప్రక్షాళనకు ఎండోమెంట్‌ కమిషనర్‌ శ్రీకారం 

15 మంది దుర్గగుడి ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

ఈవోకు కమిషనర్‌ అర్జునరావు ఆదేశాలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఇంద్రకీలాద్రిపై అవినీతి తీగ కదిలింది. కోట్లాది మంది భక్తుల పూజలందుకునే కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై అక్రమాల పుట్ట బద్ధలయింది. ఏళ్ల తరబడి అమ్మవారి సొమ్మును అందినంత దోచుకుతిన్న అవినీతిపరుల పాపం ఇన్నాళ్లకు పండింది... ఇందుకలదందు లేదనేందుకు లేకుండా దుర్గగుడిలోని అన్ని విభాగాల్లోనూ చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఏసీబీ వెలికితీసింది.. కథలు కథలుగా రాసినా తరగని పాపాల భైరవుల కథలు దుర్గమ్మ సన్నిధిలో ఎన్నో ఉన్నాయని పత్రికల్లో కథనాలు వస్తున్నా కదలని అధికారులు చివరికి ఏసీబీ నివేదికలతో కదిలారు. అక్రమాలకు పాల్పడిన 15 మందిపై సస్పెన్షన్‌ వేటు వేయడం ద్వారా అమ్మవారి ఆలయంలో అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.. అక్రమాలకు పాల్పడిన 15 మందిపై సస్పెన్షన్‌ వేటు పడింది.


ఇంద్రకీలాద్రిపై అవినీతి పుట్ట కదిలింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులపాటు దుర్గగుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందాలు కీలక విభాగాల్లో కొండలా పేరుకుపోయిన అవినీతిని గుర్తించారు. సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అమ్మవారి చెంత అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ పి.అర్జునరావు దుర్గగుడి ఈవో ఎం.వి.సురేశ్‌బాబును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుర్గగుడిలో ఆయా విభాగాలను పర్యవేక్షిస్తున్న ఏడుగురు సూపరింటెండెంటపైన, మరో ఎనిమిది మంది కిందిస్థాయి ఉద్యోగులపైన సస్పెన్షన్‌ వేటు పడింది. ఆలయ సూపరింటెండెంట్లు కె.శ్రీనివాసరావు (ప్రసాదాల తయారీ), కె.శ్రీనివాసమూర్తి (అన్నదానం), ఎ.అమృతరావు (మెయిన్‌ స్టోర్స్‌), కె.హరికృష్ణ (మెయిన్‌ స్టోర్స్‌), పి.భాగ్యజ్యోతి (శానిటేషన్‌), కూరెళ్ల శ్రీనివాసరావు (లీజులు), రవి ప్రసాద్‌ (పరిపాలన), సీనియర్‌ అసిస్టెంట్లు జి.యశ్వంత్‌ (లీజులు), బి.నాగేశ్వరరావు (చీరలు), జూనియర్‌ అసిస్టెంట్లు సీహెచ్‌ చెన్నకేశవరావు (చీరల విభాగం), ఎం.ఎస్‌.ప్రకాశరావు (శానిటేషన్‌), రికార్డు అసిస్టెంట్లు పి.రవికుమార్‌ (దర్శనం టిక్కెట్ల కౌంటర్‌), కె.రమేష్‌ (ఆర్జిత సేవల కౌంటర్‌), పి.రాంబాబు (ఫొటోల సేల్స్‌ కౌంటర్‌), అటెండర్‌ జె.ఏడుకొండలు (ప్రసాదం టిక్కెట్ల కౌంటర్‌) సస్పెండ్‌ అయినవారిలో ఉన్నారు. 


వెలుగు చూసిన అక్రమాలివీ.. 

దుర్గమ్మ దర్శనం టికెట్ల కౌంటర్లో రికార్డు అసిస్టెంట్‌ పి.రవికుమార్‌, ఆర్జిత సేవా కౌంటర్‌, అమ్మవారి ఫొటోల సేల్స్‌ కౌంటర్‌ రికార్డు అసిస్టెంట్లు కె.రమేష్‌, పి.రాంబాబు ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. సూపరింటెండెంట్‌ సక్రమంగా విధులు నిర్వహించకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగాయని అభిప్రాయపడడంతో ఆయనతో పాటు ఆ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశించారు. 


అన్నదానం స్టోర్స్‌లో అన్నీ అక్రమాలే.. 

అమ్మవారి అన్నదానం స్టోర్స్‌లోనూ అనేక అక్రమాలను ఏసీబీ బృందాలు గుర్తించాయి. అన్నదానానికి రోజువారీ సేకరిస్తున్న పాలు, కాయగూరల కొనుగోళ్లలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడు తున్నారని తేలింది. అన్నదానం విభాగంలో క్లీనింగ్‌ అండ్‌ సర్వింగ్‌ కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్లలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ విభాగంలోనే గ్యాస్‌ సిలిండర్ల వినియోగానికి సంబంధించి లెక్కలు సరిగా లేవని, అయినా ఈవో క్యాష్‌ రిజిష్టర్‌లో కౌంటర్‌ సంతకం చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అన్నదానానికి భక్తులు విరాళాలుగా ఇచ్చిన సొమ్మును బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలి. కానీ అధికారులు రూ.54,31,382 మొత్తాన్ని డిపాజిట్‌ చేయకుండా ఉంచేసినట్లు గుర్తించారు. అన్నదానం విభాగంలో విధులు నిర్వహిస్తున్న సందీప్‌కుమార్‌రెడ్డి అనే ఉద్యోగి రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్నట్టు సోదాల్లో వెలుగు చూసింది. అతనితో సహా అన్నదానం విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఆర్‌లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులనూ, ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలని కమిషనర్‌ సిఫార్సు చేశారు. 


ప్రసాదం కౌంటర్లలో ప్రైవేటు వ్యక్తులు 

ప్రసాదాల కౌంటర్లలో ముగ్గురు దేవస్థానం ఉద్యోగులకు బదులు ప్రైవేటు వ్యక్తులు విధులు నిర్వహిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. వెంటనే సదరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. 


శానిటేషన్‌ కాంట్రాక్టర్స్‌ ఎంపికలో ఉల్లంఘనలు 

దేవస్థానంలో శానిటేషన్‌కు కాంట్రాక్టర్స్‌ ఎంపిక టెండర్ల ప్రక్రియను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని, దీనికి బాధ్యులైన సంబంధిత సెక్షన్‌ సూపరింటెండెంట్‌ను, ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. 


కమిషనర్‌ సూచనలు బేఖాతరు 

సెక్యూరిటీ కాంట్రాక్టును సైతం నిబంధనలకు విరుద్ధంగానే మ్యాక్స్‌ డిటెక్టివ్‌ అండ్‌ గార్డింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కట్టబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. సింహాల ప్రతిమలు మాయమైన ఘటనకు సెక్యూరిటీ లోపమే కారణమని, అదే సంస్థకు మళ్లీ టెండరు కట్టబెట్టడం సరికాదంటూ దేవదాయశాఖ కమిషనర్‌ చేసిన సూచనలను కూడా ఈవో బేఖాతరు చేస్తూ మ్యాక్స్‌ సంస్థనే కొనసాగిస్తున్నారని ఏసీబీ పేర్కొంది. 2019, ఏప్రిల్‌ 1 నుంచి సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ను మ్యాక్స్‌ సంస్థకు కట్టబెడుతూ దుర్గగుడి కార్యాలయం నుంచి వెళ్లి ఫైల్‌ను కమిషనర్‌ ఆమోదించలేదు. అయినా సెక్యూరిటీ బిల్లులను ఆ సంస్థకే చెల్లిస్తుండడాన్ని ఏసీబీ తప్పుబట్టింది. 


కీ రిజిస్టర్ల నిర్వహణ నిల్‌ 

చట్టబద్ధంగా నిర్వహించాల్సిన కీ రిజిస్టర్లు (43, 8ఎ) దుర్గగుడి పరిపాలన కార్యాలయంలో లేకపోవడాన్ని, పెద్దసంఖ్యలో ఆడిట్‌ అభ్యంతరాలను ఏసీబీ బృందాలు గుర్తించాయి. దీంతో సంబంధిత సూపరింటెండెంట్‌ను, సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని దేవదాయశాఖ కమిషనర్‌ పి.అర్జునరావు ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఆలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరిపై తక్షణ చర్యలు తీసుకుని తమకు నివేదిక ఇవ్వాలని, ఈ ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషనర్‌ సోమవారం రాత్రి దుర్గగుడి ఈవోకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


టెండర్లు లేకుండానే ఆవునెయ్యి సేకరణ 

దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలోనూ అవినీతి, అవకతవకలను ఏసీబీ బృందాలు వెలికితీశాయి. అమ్మవారి ఆలయంలో పూజలకు, ప్రసాదాల తయారీకి పెద్దఎత్తున ఆవు నెయ్యిని సేకరిస్తున్నారు. దీనిని గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ నుంచి టెండర్లు పిలవకుండానే సేకరిస్తుండటంపై ఆడిట్‌ అభ్యంతరాలున్నట్టు ఏసీబీ గుర్తించింది. 


చీరల గోడౌన్‌, కౌంటర్లలో అక్రమాలు 

దేవస్థానంలోని అమ్మవారి చీరల గొడౌన్‌లోను, చీరలను విక్రయించే కౌంటర్లలో కూడా ఆర్థికపరమైన అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విభాగంలో గతంలో జరిగిన చీరల కుంభకోణానికి సంబంధించి రూ.40 లక్షల సొత్తును రికవరీ చేయకపోవడాన్ని ఏసీబీ గుర్తించింది. చీరల గొడౌన్‌ ఇన్‌చార్జ్‌ సహా ఈ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అందరినీ సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేశారు. 


ప్రొవిజన్‌ స్టోర్స్‌లో అవకతవకలు

ప్రధానమైన ప్రొవిజన్స్‌ స్టోర్స్‌లో లెక్కలకనుగుణంగా సరుకులు లేకపోవడాన్ని ఏసీబీ గుర్తించింది. దుర్గగుడికి నాన్‌-ఓవెన్‌ క్యారీ బ్యాగులు, ప్రసాదం కవర్లను సరఫరా చేస్తున్న ‘నేచర్‌ పాలీ ప్యాక్‌’ సంస్థ టెండర్‌ పత్రాలు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో మెయిన్‌ స్టోర్స్‌ను పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్‌ను, సిబ్బందిని కూడా సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. 


ఈవో బదిలీకి రంగం సిద్ధం? 

ఏసీబీ తనిఖీల ఎఫెక్ట్‌ దుర్గగుడి ఈవోనూ తాకింది. ఆయన బదిలీకి రంగం సిద్ధమయినట్టు తెలుస్తోంది. దుర్గగుడిలోని అన్ని విభాగాల్లోనూ అవినీతి చోటు చేసుకుందని, ఈ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌పై ఈవో కౌంటర్‌ సంతకాలు చేశారని ఏసీబీ నివేదికలో పేర్కొనడంతో ఈవో సురేశ్‌బాబుకు స్థానచలనం తప్పదనే వాదన వినిపిస్తోంది. కొండపై శానిటేషన్‌, సెక్యూరిటీ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని, ఇందుకు సంబంధించి దేవదాయశాఖ కమిషనర్‌ సూచనలను సైతం ఈవో బేఖాతరు చేశారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో 15 మందిని సస్పెండ్‌ చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఈవో బదిలీకి కూడా రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement