చేపల వేలం నిలిపివేత

ABN , First Publish Date - 2021-10-22T06:30:01+05:30 IST

మండలంలోని ఈదర, కొమ్మారం చెరువుల్లో చేపల వేలం రాజకీయ గ్రహణంతో నిలిచిపోయింది.

చేపల వేలం నిలిపివేత
అధికారులను నిలదీస్తున్న సర్పంచ్‌ వర్గీయులు

ముండ్లమూరు, అక్టోబరు 21 : మండలంలోని ఈదర, కొమ్మారం చెరువుల్లో చేపల వేలం రాజకీయ గ్రహణంతో నిలిచిపోయింది. గురువారం గ్రామ సచివాలయంలో సర్పంచ్‌ వంగల పద్మావతి ఆధ్వర్యంలో పాట నిర్వహించేందుకు ఎంపీడీవో బీ.చంద్రశేఖరరావు, ఈవోఆర్‌డీ ఓబులేసు, పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావులు సచివాలయానికి చేరుకున్నారు. గ్రామంలోని వైసీపీలోని సర్పంచ్‌ వ్యతిరేక వర్గీయులు పాట జరపడానికి వీల్లేదని పట్టుబట్టారు. గత సంవత్సరం కొమ్మవరం చెరువులో పాటదారుడు చేపలు పెంచారని, అవి ఇంకా కొంత మిగిలాయని పేర్కొన్నారు.  నెల రోజులు వేలం నిలపాలని కోరారు. దీంతో సర్పంచ్‌ వర్గీయులు, ఆమె వ్యతిరేక వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్‌ వంగల పద్మావతి మాత్రం పాట నిర్వహించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మహిళా సర్పంచైన తనను అవమానిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా పాట నిలిపివేయాలని చూస్తున్నారన్నారు. పాటపడేందుకు వచ్చిన డిపాజిట్‌దారులను కూడా ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారన్నారు.  మరోవైపు సర్పంచ్‌ వ్యతిరేక వర్గీయులు పాట నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో వేలం విషయాన్ని సాయంత్రం వరకు నాన్చి మరోమారు వేలం నిర్వహిస్తామంటూ వెనుతిరిగారు.

విధులు మరిచి ఒత్తిళ్లకు తలొగ్గి...

వేలం నిర్వహించేందుకు గురువారం ఈదర వచ్చిన అధికారులు అక్కడ జరుగుతున్న రాజకీయ డ్రామాకు ప్రేక్షకులుగా మాత్రమే మిగిలారు. పారదర్శంగా విధులు నిర్వహించాల్సి ఉండగా, ఓ వైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు జడ్పీ చైర్మన్‌ వర్గం ఉండడంతో ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహించడంతో అలసత్వం వహించారు. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా అధికారులు వ్యవహరించారు.  గ్రామ సర్పంచ్‌, పాటపాడేందుకు వచ్చిన ఆశావాహులు, ఉన్నప్పటికీ, ఇరువర్గాల నేతల మాట కోసం ఎదురు చూశారు. సాయంత్రం వరకు కూడా వారికి వేలం నిర్వహించేందుకు అనుమతి రాకపోవడంతో అధికారుల విచక్షణాధికారంతో వెనుతిరిగారు. మరోమారు వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆ గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైసీపీలో వర్గపోరు టీడీపీ గెలుపు సునాయాసమైంది. ఈ క్రమంలోనే వర్గపోరు మరింత పెరిగి ప్రస్తుతం చేపల వేలంపై ప్రభావం చూపింది..!

డిపాజిట్‌దారులు రాకపోవడంతో పాట వాయిదా

ఈదర, కొమ్మారం చేపల చెరువులకు మూడు సంవత్సరాల పాటు చేపలు వేసి పెంచి పట్టుకొనుటకు గురువారం వేలం పాట నిర్వహించాల్సి ఉండగా పాట పాడేందుకు డిపాజిట్‌ కట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాక పోవటం వలనే వాయిదా వేయటం జరిగిందని ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు, ఈవోఆర్‌డీ ఓబులేసు తెలిపారు.            ఎంపీడీవో, చంద్రశేఖరరావు 

Updated Date - 2021-10-22T06:30:01+05:30 IST