ఆరోగ్య సిబ్బంది సేవలకు స్వస్తి

ABN , First Publish Date - 2021-09-15T05:38:34+05:30 IST

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఆరోగ్య సిబ్బంది సేవలకు ప్రభుత్వం స్వస్తి చెప్పింది. కరోనా వ్యాప్తి సమయంలోనూ విశేష సేవలు అందజేసిన వారిని.. ఒక్కసారిగా విధుల నుంచి తొలగించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 63 మంది రోడ్డున పడ్డారు. వీరితో పాటు 9 సీహెచ్‌సీల పరిధిలో 18 మంది వాచ్‌మెన్లను కూడా తొలగించడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు.

ఆరోగ్య సిబ్బంది సేవలకు స్వస్తి
ఇచ్ఛాపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది




- జిల్లావ్యాప్తంగా యూపీహెచ్‌సీల్లో 63 మంది తొలగింపు

- విధుల్లో కొనసాగించాలని బాధితుల విజ్ఞప్తి

(ఇచ్ఛాపురం)

అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఆరోగ్య సిబ్బంది సేవలకు ప్రభుత్వం  స్వస్తి చెప్పింది. కరోనా వ్యాప్తి సమయంలోనూ విశేష సేవలు అందజేసిన వారిని.. ఒక్కసారిగా విధుల నుంచి తొలగించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 63 మంది రోడ్డున పడ్డారు. వీరితో పాటు 9 సీహెచ్‌సీల పరిధిలో 18 మంది వాచ్‌మెన్లను కూడా తొలగించడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో తొమ్మిది అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. పట్టణ ప్రజలకు ఇవి ఎంతగానో ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అర్బన్‌ హెల్త్‌సెంటర్ల నిర్వహణను అపోలో, ధనుష్‌ ఇన్‌ఫోటెక్నో యాజమాన్యానికి అప్పగించింది. 2000 సంవత్సరం నుంచి ఈ యాజమాన్యం ఆధ్వర్యంలోనే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్యసేవలు అందుతున్నాయి. 20 ఏళ్లుగా ఏఎన్‌ఎంలతో పాటు మెడికల్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, వాచ్‌మెన్లు, స్వీపర్లు  పని చేస్తున్నారు. ఒక్కో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఏడుగురు వంతున ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఉద్యోగులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు గడువు ముగిసిందని ఉద్యోగులందరిపై అపోలో యాజమాన్యం  వేటు వేసింది. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సిబ్బందిని తొలగించి.. వారి స్థానంలో 104 సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ 104లో ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటారు. ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సుల వంటివారు అందుబాటులో లేరు. ఆరోగ్యశాఖలోని అనేక విభాగాల్లో సిబ్బందిని కొనసాగించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోడ్డున పడిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. తమను విధుల్లో కొనసాగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఉద్యోగమే ఆధారం

15 ఏళ్లుగా సీహెచ్‌సీలో పనిచేస్తున్నాను. మా కుటుంబానికి నా ఉద్యోగమే ఆధారం. ఇప్పుడు ఒక్కసారిగా తొలగిస్తే మా కుటుంబాల పరిస్థితి ఏమవుతుందో అర్ధం కావడంలేదు. దయచేసి ప్రభుత్వం మా బాధలను గుర్తించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.  

- ఖగుపతి, ఇచ్ఛాపురం 


ఆత్మహత్యే శరణ్యం

15 ఏళ్లుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తే.. మా పరిస్థితి అగమ్యగోచరమే. ప్రభుత్వం పునరాలోచించి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలి.

- దేవరాజ్‌, కమ్యూనిటీ ఆర్గనైజర్‌, ఇచ్ఛాపురం,




111111111111111111111111111111111111

Updated Date - 2021-09-15T05:38:34+05:30 IST