విదేశీయులను అడ్డుకోవడం వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం: ప్రముఖ టెక్ కంపెనీలు

ABN , First Publish Date - 2020-08-12T00:33:09+05:30 IST

విదేశీయులు దేశంలోకి రాకుండా వాళ్లకు జారీ చేసే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అధ్యక్షుడు

విదేశీయులను అడ్డుకోవడం వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం: ప్రముఖ టెక్ కంపెనీలు

వాషింగ్టన్: విదేశీయులు దేశంలోకి రాకుండా వాళ్లకు జారీ చేసే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించడం అమెరికాకు నష్టం కలగజేస్తుందని ప్రముఖ టెక్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. వీసాల సస్పెన్షన్‌పై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టెక్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. అమెజాన్, ఫేస్‌బుక్, యాపిల్‌తో కలిపి 50కు పైగా ప్రముఖ కంపెనీలు కోర్టు ఫైలింగ్‌పై సంతకాలు చేశాయి. అమెరికన్ ఉద్యోగులను రక్షించేందుకు ట్రంప్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై సస్పెన్షన్ విధించారని.. నిజానికి ఈ ఆంక్షలు అమెరికన్ ఉద్యోగులకు, అమెరికన్ కంపెనీలకు, ఆర్థిక రంగానికి ఎక్కువ నష్టం కలగజేస్తాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల విదేశీయులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయని అన్నారు. మరోపక్క నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై సస్పెన్షన్‌ విధించడంతో.. దీని ద్వారా లబ్ది పొందాలని ఇతర దేశాలు చూస్తున్నాయని కోర్టుకు కంపెనీలు చెప్పుకొచ్చాయి. అమెరికాకు రావాల్సిన నైపుణ్యం కలిగిన విదేశీయులు తమ దేశాలకు వచ్చేలా ఇతర దేశాలు తమ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు చేస్తున్నాయన్నారు. కాగా.. ట్రంప్ ఈ సంవత్సరం చివరి వరకు విదేశీయులకు జారీ చేసే హెచ్1బీ వీసాలపై ఆంక్షలు విధించారు. విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల ఈ ఏడాది విదేశీయులు అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం లేదు. విదేశీయులు ఎక్కువగా టెక్ కంపెనీలలోనే ఉద్యోగాలు చేస్తుండటంతో.. హెచ్1బీ నిలుపుదల ప్రభావం టెక్ కంపెనీలపైనే పడింది. దీంతో మిగతా దేశాలు దీన్ని ఒక అవకాశంగా చూస్తున్నాయి. అమెరికాకు వెళ్లాలనుకున్న నైపుణ్యం కలిగిన వారు తమ దేశాలకు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.

Updated Date - 2020-08-12T00:33:09+05:30 IST