సస్పెన్షన్‌ ఎత్తేసే ప్రసక్తే లేదు

ABN , First Publish Date - 2021-12-01T08:14:24+05:30 IST

పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. శీతాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా నిరసనల హోరు కొనసాగింది...

సస్పెన్షన్‌ ఎత్తేసే ప్రసక్తే లేదు

వారిపై చర్యలు తీసుకునే హక్కు నాకుంది: వెంకయ్య 

ఉభయ సభల్లో గందరగోళం.. విపక్ష సభ్యుల వాకౌట్‌


న్యూఢిల్లీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. శీతాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా నిరసనల హోరు కొనసాగింది. 12 మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న తమ డిమాండ్‌ను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తిరస్కరించడంతో కాంగ్రెస్‌, డీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేశాయి. వర్షాకాల సమావేశాల్లో జరిగిన సంఘటనకు శీతాకాల సమావేశాల్లో చర్య తీసుకోవడం సరి కాదని, సస్పెన్షన్‌ ఉపసంహరణను పరిశీలించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష సభ్యులు చైర్మన్‌ను కోరారు. సస్పెండైన ఎంపీలు పశ్చాత్తాపం ప్రకటించకపోగా తమ చర్యలను సమర్థించుకున్నారని వెంకయ్య చెప్పారు. సస్పెన్షన్‌ విషయంలో ప్రతిపక్ష సభ్యుల విజ్ఞప్తిని తాను పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయం అంతిమం అన్నారు. హద్దులు దాటిన సభ్యులపై చర్య తీసుకునే హక్కు సభాధ్యక్షుడికి ఉందని తేల్చిచెప్పారు. దీంతో ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేసిన ఎంపీలు ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. 12 మంది ఎంపీలు అనుచిత ప్రవర్తనతో రాజ్యసభ గౌరవాన్ని మంటగలిపారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. క్షమాపణలు చెప్పేవరకు వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వెంకయ్య ప్రకటనపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. పార్లమెంట్‌లో ప్రజల సమస్యలను లేవనెత్తినందుకు ప్రతిపక్ష సభ్యులు క్షమాపణలు చెప్పాలా? అని ప్రశ్నించారు. వారు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేసే ముందు ప్రతిపక్ష సభ్యులు సాగు చట్టాలపై చర్చ జరపాలని, కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, డీఎంకే నేత టీఆర్‌ బాలు నేతృత్వంలో విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. రాజ్యసభలో తమ సభ్యుల సస్పెన్షన్‌పై  మౌనంగా ఉండబోమని లోక్‌సభలో కాంగ్రె్‌సపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి విమర్శించారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. గందరగోళం మధ్య పలుసార్లు సభ వాయిదా పడింది. సభ్యులు పదేపదే అడ్డుపడటంతో ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. కాగా, ప్రధాని మోదీ మంగళవారం పార్లమెంటులోని తన చాంబర్‌లో మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. 

Updated Date - 2021-12-01T08:14:24+05:30 IST