ఏడాది కాలానికి సస్పెన్షనా?

ABN , First Publish Date - 2022-01-29T08:26:12+05:30 IST

: ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది కాలానికి సభ నుంచి సస్పెండ్‌ చేసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది...

ఏడాది కాలానికి   సస్పెన్షనా?

బహిష్కరణ కంటే ఘోర చర్య

సభాకాలానికి మించి ఎమ్మెల్యేలపై 

ఎలా చర్య తీసుకుంటారు?

‘సంకీర్ణం’లో ఇలాంటి ఆదేశాలు

ప్రజాస్వామ్య స్వరూపానికే విఘాతం

12 మందిపై మహారాష్ట్ర అసెంబ్లీ వేటు

వేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు 

 

న్యూఢిల్లీ, జనవరి 28: ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది కాలానికి సభ నుంచి సస్పెండ్‌ చేసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సభ జరుగుతున్న కాలానికి మించి సభ్యులను సస్పెండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించిం ది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్వరూపానికి విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించింది. అందులోనూ స్వల్ప మెజారిటీ కలిగిన ప్రభుత్వం లేదా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులను అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రలోభపెట్టడానికి ఇలాంటివి వీలు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాది పాటు సస్పెండ్‌ చేయడాన్ని బహిష్కరణను మించిన ఘోర చర్యగా జస్టిస్‌ ఏఎమ్‌ ఖన్వీల్కర్‌ అభివర్ణించారు. ప్రిసైడింగ్‌ అధికారి భాస్కర్‌ జాదవ్‌ పట్ల అమర్యాదగా నడుచుకున్నారనే కారణంగా 2021 జూలై ఐదో తేదీన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్‌ కుటే, ఆశీశ్‌ షెలార్‌, అభిమన్యు పవార్‌, గిరీశ్‌ మహాజన్‌, అతుల్‌ భత్కల్కర్‌, పరాగ్‌ అలవానీ, హరీశ్‌ పింపుల్‌, యోగేశ్‌ సాగర్‌, జయకుమార్‌ రావల్‌, నారాయణ్‌ కూచె, రామ్‌ సత్పుత్‌, బంటీ భంగ్డీయాలను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ఏడాది కాలానికి సస్పెండ్‌ చేశారు. వీరంతా ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. జస్టిస్‌ ఖన్వీల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల బెంచ్‌ శుక్రవారం తీర్పు వెలువరించింది. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదని తేల్చిచెప్పింది. సస్పెండ్‌ అయిన సభా కాలానికీ, ఆ తర్వాత కాలానికీ శాసనసభ్యులుగా అన్నిరకాల ప్రయోజనాలు పొందేందుకు వారు అర్హులేనని తీర్పులో స్పష్టం చేసింది.


సభ గతితప్పడం భావ్యం కాదు: బెంచ్‌

పవిత్ర స్థలాలుగా భావించే చట్టసభలు గతితప్పడం సరికాదని తీర్పును ప్రకటిస్తూ బెంచ్‌ వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు విజ్ఞులుగా ఉండాలేగానీ అల్లరిచిల్లరిగా నడుచుకోరాదని హితవు పలికింది. సామాజిక మూలతత్వాన్ని సభా కార్యకలాపాలు ప్రతిఫలిస్తాయని పేర్కొంది. కానీ, నగుబాటు చేష్టలు, వ్యక్తిగత దాడులతో సభ స్తంభించినట్టు, శాసన వ్యవహారాలు సజావుగా పూర్తి చేయలేకపోతున్నట్టు కొన్ని వ్యాఖ్యలు తరచూ వినాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. 


ఠాక్రే సర్కారుకు చెంపపెట్టు: బీజేపీ

కోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. ఇది సత్యానికి లభించిన విజయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు మరింత గట్టిగా జనగళం వినిపిస్తారన్నారు. సత్వమేవ జయతే అంటూ కోర్టు తీర్పుపై మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా, నీతిబాహ్యంగా, పారదర్శకత లేకుండా అప్రజాస్వామ్యంగా సాగుతున్న ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాశ్‌ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వానికి కోర్టు తీర్పు మరో చెంపపెట్టు వంటిదని మండిపడ్డారు. ఓబీసీల సమస్యలపై సభా వేదికగా పోరాడుతున్న తమ ఎమ్మెల్యేలను నాడు కావాలనే సభ నుంచి వెళ్లగొట్టారని ఆయన ఆరోపించారు. సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేల హక్కులను పునరుద్ధరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థ పరిరక్షించిందని ఆయన కొనియాడారు.


తీర్పుపై స్పీకర్‌దే నిర్ణయం: ప్రభుత్వం 

సుప్రీంకోర్టు తీర్పు ప్రతిని పరిశీలించిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని మహా వికాశ్‌ అఘాడీ భాగస్వామ్యపక్షం ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయాలనేది ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం కాదన్నారు. తనకున్న విశేషాధికారాలతో స్పీకర్‌ ఆ ఆదేశాలు ఇచ్చారని చెప్పా రు. తిరిగి ఆయనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మాలిక్‌ అభిప్రాయపడ్డారు

Updated Date - 2022-01-29T08:26:12+05:30 IST