చోరీపై సందేహాలెన్నో!

ABN , First Publish Date - 2020-09-23T14:42:40+05:30 IST

దుర్గమ్మ వెండి ఉత్సవ రథంపై మూడు సింహం ప్రతిమల మాయం..

చోరీపై సందేహాలెన్నో!

అధికారుల తీరు ఆదినుంచీ అనుమానాస్పదమే

కనకదుర్గమ్మ వెండి రథం భద్రత ఎవరిది?

మాది కాదంటే.. మాది కాదంటున్న అధికారులు

దర్యాప్తు బృందాలకు సహకరించని వైనం

ఇంటిదొంగలను రక్షించేందుకేనా?


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గమ్మ వెండి ఉత్సవ రథంపై మూడు సింహం ప్రతిమల మాయం వెనుక ఇంటి దొంగల ప్రమేయం ఉందా? వారిని రక్షించేందుకే దుర్గగుడి ఉన్నతాధికారులు పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేశారా? ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు సహకరించకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అసలు రథం భద్రత బాధ్యత మాది కాదంటే.. మాది కాదంటూ ఇంద్రకీలాద్రిపై ఉన్న భద్రతా విభాగాల అధికారులు ఎందుకు తప్పించుకుంటున్నారు? ప్రతిమల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలను వేధిస్తున్న ప్రశ్నలివి. 


కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలు మాయమైన ఘటనలో దుర్గగుడి అధికారుల వ్యవహార శైలి ఆది నుంచీ సందేహాలకు తావిస్తోంది. సింహం ప్రతిమలు అపహరణకు గురైనట్టు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత రెండు రోజులకు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొన్నటి వరకు శివాలయం అభివృద్ధి పనులు చేసిన ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా తీసుకువచ్చి విచారిస్తున్నారు. అసలు చోరీ ఎప్పుడు జరిగిందో దుర్గగుడి అధికారులు చెప్పలేకపోతున్నారు. రథం భద్రత ఎవరిది? అనడిగితే మాది కాదంటే.. మాది కాదంటూ భద్రతను పర్యవేక్షిస్తున్న పలు విభాగాల అధికారులు తప్పించుకుంటున్నారు. 


కొండపై ఉన్న ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్‌) అమ్మవారి గర్భాలయంలోనూ, స్ట్రాంగ్‌ రూమ్‌లోనూ భద్రపరిచిన విలువైన వస్తువుల రక్షణ బాధ్యత తప్ప మిగిలిన ఆస్తులకు తమ బాధ్యత లేదంటోంది. కొండ పైన, కింద అంతటా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందే ఉంటారు కాబట్టి నెపాన్ని ఆ సంస్థపైకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గుడిలో వాహనాల నిర్వహణ బాధ్యత ఇంజనీరింగ్‌ విభాగమే చూస్తుంది కాబట్టి వారే బాధ్యత వహించాలనే వాదన వినిపిస్తోంది. 


అయితే వాహనాల నిర్వహణ బాధ్యత మాత్రమే తమదని, వెండి రథం రక్షణ బాధ్యత తమది కాదని ఇంజనీరింగ్‌ అధికారులు వాదిస్తున్నారు. ఉత్సవాల సమయంలో రథానికి మరమ్మతులు చేయాల్సి ఉంటే ఈవో కార్యాలయం నుంచి తమకు నోట్‌ వస్తుందని, ఆ మేరకు రథాన్ని సిద్ధం చేసి అప్పగిస్తామని అంటున్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత అమ్మవారి వెండి రథాన్నే చూడలేదంటున్నారు ఈవో సురేశ్‌బాబు.

 

ఉగాదికి ముందు ఉందంటున్న సిబ్బంది

ఈ ఏడాది మార్చి 25 నుంచి వసంత ఉత్సవాలు నిర్వహించారు. తొలిరోజు మహామండపం నుంచి వెండి రథోత్సవం నిర్వహించాల్సి ఉన్నందున రథాన్ని సిద్ధం చేయాలంటూ మార్చి 11న ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం మార్చి 13న రథంపై ముసుగు తొలగించిన పాలిషర్‌, స్తపతి, దుర్గగుడి సిబ్బంది కూడా అప్పుడు సింహం ప్రతిమలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంత వరకూ విచారించిన దర్యాప్తు బృందాలు సైతం ప్రస్తుతం రథం ఉన్న చోటనే చోరీ జరిగినట్టు భావిస్తూ, తగిన సాక్ష్యాధారాల కోసం గుడిచుట్టూ తిరుగుతున్నాయి.


దర్యాప్తుకు సహకరించకుండా తప్పించుకుంటున్న అధికారుల తీరును చూస్తే ఈ చోరీ వెనుక ఇంటి దొంగల ప్రమేయం ఉండే ఉంటుందని, వారిని రక్షించేందుకే అధికారులు దర్యాప్తు బృందాలకు సహకరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క దుర్గగుడి అధికారులు సహకరించకపోయినా వారం, పది రోజుల్లోనే ఈ కేసును ఛేదించి, దొంగలను పట్టుకుంటామని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-09-23T14:42:40+05:30 IST