లవ్ జిహాదీ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ

ABN , First Publish Date - 2020-10-21T23:17:00+05:30 IST

అయితే లవ్ జిహాదీ అని జాతీయ మహిళా కమిషన్ చైర్మెన్ మాట్లాడటం ఏంటని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమూహంలో ఉన్నా మహిళలు మహిళలే. అన్ని చోట్ల వారు ఎదుర్కొనే సమస్యలు ఒక్కటే. ఆమె మహిళా సమస్యల గురించి కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు

లవ్ జిహాదీ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో సమావేశంలో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ‘లవ్ జిహాదీ’పై ఆవేదన వ్యక్తం చేశారనే వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయితే తనపై జరిగే ట్రోల్స్‌పై స్పందించబోనని ఆమె తేల్చి చెప్పారు.


ఏం జరిగిందంటే.. బుధవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో రేఖా శర్మ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్ ద్వారా ఈ సమావేశానికి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేసింది. ‘‘మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో మా చైర్‌పర్సన్ రేఖాశర్మ బేటీ అయ్యారు. మహిళా సమస్యలపై గవర్నర్‌తో ఆమె చర్చలు జరిపారు. పనికి రాకుండా పోయిన వన్ స్టాప్ సెంటర్లు, కోవిడ్ కేంద్రాల్లో మహిళా రోగులపై అత్యాచారాలు, దాడులు, లవ్ జిహాదీ లాంటి కేసులతో రాష్ట్రంలో మహిళా భద్రత ప్రమాదంలో ఉంది’’ అని జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.


అయితే లవ్ జిహాదీ అని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడటం ఏంటని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమూహంలో ఉన్నా మహిళలు మహిళలే. అన్ని చోట్ల వారు ఎదుర్కొనే సమస్యలు ఒక్కటే. ఆమె మహిళా సమస్యల గురించి కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ ‘‘నా ట్విట్టర్ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆ విషయమై ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ట్రోల్స్ గురించి నేనేం మాట్లాను’’ అని అన్నారు.

Updated Date - 2020-10-21T23:17:00+05:30 IST