ఎస్వీయూ తెలుగు విశ్రాంత ప్రొఫెసర్‌ కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-17T06:37:42+05:30 IST

ఎస్వీయూ తెలుగు విభాగ విశ్రాంత ప్రొఫెసర్‌ గల్లా చలపతి (72) కరోనాతో మృతి చెందారు.

ఎస్వీయూ తెలుగు విశ్రాంత ప్రొఫెసర్‌ కరోనాతో మృతి
గల్లా చలపతి (ఫైల్‌ ఫొటో)

పలువురు సాహిత్యవేత్తల సంతాపం


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 16: ఎస్వీయూ తెలుగు విభాగ విశ్రాంత ప్రొఫెసర్‌ గల్లా చలపతి (72) కరోనాతో మృతి చెందారు. వారం రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మృతి చెందారు. కడప జిల్లా కోడూరుకు చెందిన ఈయన 1972లో ఎంఏ తెలుగు, ఆ తర్వాత సంస్కృతం, హిస్టరీలోనూ పీజీ కోర్సులు పూర్తి చేశారు. తెలుగు విభాగంలోనే ప్రొఫెసర్‌ మద్దూరు సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ‘సంకుసాల నృసింహకవి రాసిన కవికర్ణ రసాయనం’ అనే ప్రబంధంపై 1984లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1989లో తెలుగు విభాగంలో అధ్యాపకుడిగా చేరారు. బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీవోఎస్‌) చైర్మన్‌గానూ పని చేశారు. 2002-04 మధ్య కాలంలో తెలుగు విభాగాధిపతిగా వ్యవహరించారు. వీరి పర్యవేక్షణలో 18 పీహెచ్‌డీలు, 15 ఎంఫిల్‌లు పూర్తయ్యాయి. ప్రేమ - తాత్త్విక పరిశీలన, సారంగపాణి పదాలు, వివేకానంద సాహిత్య సర్వస్వం (అనువాదం), కరపత్రాలు - చరిత్ర శకలాలు, తరతరాల తెలుగు వారి మతాచార విశేషాలు, వ్యాస భండారం, మహా భారతేతివృత్త సినిమాలపై జానపద సాహిత్య ప్రభావం, సాహిత్య సురభి (సంపాదకత్వం), పద సాహిత్య వైభవం, వింశతి (సాహిత్య వ్యాస సంపుటి), అన్నమాచార్య చరిత్ర వ్యాఖ్యానం వంటి పుస్తకాలు రాశారు. 2009లో ఆయన పదవీ విరమణ సందర్భంలో ‘కవిత్రయ భారతం - ప్రతిపర్వ వివేచనం’ అనే పేరుతో అభినందన సంచిక విడుదలైంది. అంత్యక్రియలు సోమవారం రాజంపేటలో నిర్వహిస్తారు. ఈయన మృతి పట్ల తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఆర్‌.రాజేశ్వరమ్మ, అధ్యాపకులు ప్రొఫెసర్‌ మేడిపల్లి రవికుమార్‌, ఎస్‌.రాజేశ్వరి, కె.వెంకటరమణ, రిటైర్డు ప్రొఫెసర్లు గార్లపాటి దామోదరనాయుడు, కోసూరి దామోదరనాయుడు, పేట శ్రీనివాసులు రెడ్డి, సప్తగిరి పత్రిక ఉప సంపాదకుడు డాక్టర్‌ కంపల్లె రవిచంద్రన్‌, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-17T06:37:42+05:30 IST