సువర్ణ పుష్పార్చన.. ఊంజల్‌ సేవోత్సవం

ABN , First Publish Date - 2021-06-19T07:07:57+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని నృసింహుడికి సువర్ణ పుష్పా ర్చన..ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవా పర్వాలు ఆస్థాన పరంగా నిర్వహించారు.

సువర్ణ పుష్పార్చన.. ఊంజల్‌ సేవోత్సవం
ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, జూన్‌18: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని నృసింహుడికి సువర్ణ పుష్పా ర్చన..ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవా పర్వాలు ఆస్థాన పరంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన అర్చక స్వాములు బాలాలయ కవచమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. మండపంలో ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీ దళాలు, కుంకుమలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవాన్ని ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఆన్‌లైన్‌ ద్వారా సేవోత్సవాలను నమోదు చేసుకున్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించారు. కొండపైన ఉపాలయంలో కొలువుదీరిన చరమూర్తులకు నిత్యోత్సవాలను శైవాగమ శాస్త్రరీతిలో చేశారు. కొవిడ్‌ నిబం ధలను అర్చకులు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు.

 ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం

యాదాద్రీశుడి సన్నిధిలో కొలుదీరిన ఆండాళ్‌ అమ్మవారిని ఆరాధిస్తూ సాయంత్రం వేళ అర్చకబృందం పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభర ణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఊంజల్‌ సేవలో నిర్వహించారు. బాలాలయ కల్యాణమండపంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని  అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌ సేవోత్సవాన్ని ఆస్థాన ప రంగా వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన స్వయంభువులను సువర్ణ పుష్పాలతో అర్చించిన పూజారులు సాయంత్రం వేళ ఆండాళ్‌ అమ్మవారిని ఆరాధిస్తూ ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు.

శరవేగంగా  రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు

ఫ కొనసాగుతున్న పాత భవనాల కూల్చివేతలు

యాదాద్రి టౌన్‌: యాదాద్రికొండ కింద ప్రధాన రహదారిలో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైకుంఠద్వారం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో ఇళ్లను తొలగించిన ప్రాంతంలో రహదారికి ఇరు వైపులా రిటైనింగ్‌ వాల్‌ను ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో నిర్మిస్తు న్నారు.  రహదారి విస్తరణ కోసంప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పాత భవనాలను వైటీడీఏ తీసుకున్న సంగతి తెలిసిందే. భూసేకరణ పూర్తి కావడంతో రహదారి విస్తరణను అధికారులు వేగవంతం చేశారు. ఇందు కోసం ఆ ప్రాంతంలోని పాత భవనాల తొలగింపు పనులను ఎక్స్‌కవేటర్‌ సాయంతో నిర్వహిస్తున్నారు. త్వరలోనే పాత భవనాల తొలగింపు ప్రకియ పూర్తి చేసి రహదారి నిర్మాణం పూర్తి చేయ నున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కొండపైన బాలాలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వకుండా డ్రైన్‌ లైన్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాలాలయ ఎదురుగా ఉన్న ఉపాలయం నుంచి కొండ దిగువకు వర్షపు నీరు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో డ్రైన్‌ లైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయ నున్నట్టు అధికారులు తెలిపారు.





Updated Date - 2021-06-19T07:07:57+05:30 IST