స్వచ్ఛతను ఆచరించాలి

ABN , First Publish Date - 2021-01-17T05:53:31+05:30 IST

స్వచ్ఛతను ఆచరణలో చూపుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేటను అగ్రభాగంలో నిలపాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

స్వచ్ఛతను ఆచరించాలి
సిద్దిపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేటను నంబర్‌వన్‌గా నిలపాలి   

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, జనవరి 16: స్వచ్ఛతను ఆచరణలో చూపుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేటను అగ్రభాగంలో నిలపాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. టెలికాంనగర్‌లో 300 కుటుంబాలకు సరిపోయే స్టీల్‌ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ నగర్‌ వద్ద రూ.60 లక్షలతో జంక్షన్‌ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రతీ కాలనీలో వార్డు ఆఫీసర్ల ఫోన్‌ నెంబర్లను గోడలపై రాయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారిని ఆదేశించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తప్పించడానికి స్టీల్‌ బ్యాంకు ఏర్పాటు హర్షనీయమని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, ఏఏంసీ చైర్మన్‌ పాల సాయిరామ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, ఈఈ వీర ప్రతాప్‌, వివిధ వార్డులకు చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


సీఎం హామీల అమలుపై దృష్టి సారించాలి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సిద్దిపేట నియోజవర్గానికి ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చేందుకు కార్యచరణపై దృష్టి సారించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనుల పురోగతిపై కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగనాయక సాగర్‌ ప్రాజెక్ట్‌ను రూ.100 కోట్లతో పర్యాటక స్థానంగా తీర్చిదిద్దేందుకు నిపుణులచే నివేదిక సిద్ధం చేయించాలని పర్యాటక శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోహర్‌కు సూచించారు. టూరిజం హోటల్‌ను నెలాఖరులోపు ప్రారంభానికి సిద్ధం చేయాలని  అధికారులను ఆదేశించారు. కాలకుంట కాలనీ, లింగారెడ్డిపల్లి కాలనీ, పొన్నాలలో పేదకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ప్రత్యేక బృందాలచే క్షేత్ర పరిశీలన నిర్వహించాలన్నారు. కేసీఆర్‌నగర్‌లో మిగిలిన ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించాలని ఆదేశించారు. ఇష్టారీతిన చెత్త పడేయకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు పద్మాకర్‌, ముజామిల్‌ ఖాన్‌, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌ అధికారి అనంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:53:31+05:30 IST