వారం రోజుల్లోనే 50 ఎకరాలు స్వాహా

ABN , First Publish Date - 2021-08-31T07:43:26+05:30 IST

ఏకంగా గుట్టలనే మింగేస్తున్నారు. చదును చేసి, చెట్లు నాటేసి ‘అంతా మాదే’ అని ప్రకటిస్తున్నారు.

వారం రోజుల్లోనే 50 ఎకరాలు స్వాహా
పచ్చని గుట్ట ఇలా మారుతోంది

గంగాధరనెల్లూరులో ఒక నాయకుడి అనుచరుల లీలలు

గుట్టలు మింగేస్తున్నారు!


చిత్తూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నోరు తెరిస్తే ఆయన నీతివాక్యాలు వల్లిస్తాడు. అవినీతి మచ్చ తనలో వెతికినా కనబడదని చెబుతాడు. విపక్షాలకు సవాళ్లు విసురుతాడు.స్వచ్ఛపాలనకే కట్టుబడ్డామని నమ్మబలుకుతాడు. ‘లంచం అడిగారో..ఖబడ్దార్‌!’ అని అధికారులను పదేపదే హెచ్చరిస్తాడు. అయితే, ఆయన అనుచరగణం మాత్రం ఆయన మాటలకు భిన్నంగా చెలరేగిపోతున్నారు. ఏకంగా గుట్టలనే మింగేస్తున్నారు. చదును చేసి, చెట్లు నాటేసి ‘అంతా మాదే’ అని ప్రకటిస్తున్నారు.గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల భాగోతం ఇది.. గంగాధరనెల్లూరు మండలం కొండేపల్లె రెవెన్యూ గ్రామంలోని గుట్టలు ఒకటొకటీ కరిగిపోతున్నాయి. పోలినాయుడుపల్లె నుంచి చింతారెడ్డిపల్లెకు వెళ్లే దారిలో పక్కనున్న కుక్కలోడి గుట్టను వారం రోజులుగా నాలుగు పొక్లయిన్లతో చదును చేస్తున్నారు. సర్వే నెంబరు 268లో 200 ఎకరాల గుట్ట పోరంబోకు స్థలం ఉంది. ఈ గుట్ట మీద కొందరి కన్ను పడింది. అధికారంలో ఉన్నాం అడ్డేముంది అనుకున్నట్టున్నారు. ఒక పెద్ద నాయకుడికి అత్యంత దగ్గరి అనుచరుడిగా ఉండే ఒకరు ముందు నిలిచారు. ఇంకేముంది..అంతా కలిసి పొక్లయిన్లు పెట్టి చదును చేస్తున్నారు. ఇప్పటికే 50 ఎకరాలు చదును చేసి, మామిడి మొక్కలు నాటేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.  మిగిలిన గుట్టనూ మింగేయడానికి సిద్ధమవుతున్నారు. వారం రోజులుగా గుట్టలు కూలుస్తున్నా అధికారులు పట్టిం చుకున్న దాఖలాలు లేవు. ఈ ఆక్రమణల గురించి తహసీల్దారు ఇన్బనాధన్‌ను వివరణ కోరగా,  విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


బస్టాప్‌ దగ్గర రూ.కోట్ల స్థలం ఆక్రమణ

చిత్తూరు- పుత్తూరు ప్రధాన రహదారిలోని  కొండేపల్లె పంచాయతీలో  పద్మాపురం బస్టాప్‌ దగ్గర ఆర్‌అండ్‌బీకి  చెందిన ఎకరా స్థలాన్ని కూడా కొందరు ఇప్పటికే  ఆక్రమించుకున్నారు. రూ. రెండు కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని పొక్లయిన్‌తో శుభ్రం చేసి వాణిజ్య సముదాయాలను నిర్మించేందుకు సిమెంటు రాళ్లు కూడా తోలుకున్నారు. ఈ ఆక్రమణలపై స్థానికంగా విమర్శలు రావడంతో, సోమవారం సాయంత్రం కొండేపల్లెలో, కొండేపల్లె దళితవాడల్లో వీఆర్వో లక్ష్మీపతి ఆధ్వర్యంలో దండోరా వేయించారు. ప్రభుత్వ స్థలాల్లోకి రావద్దు.. ఆక్రమించవద్దు.. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





Updated Date - 2021-08-31T07:43:26+05:30 IST