Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమిష్టిగా సాధించారు...!

మంచిర్యాల మున్సిపాలిటీకి 7వ ర్యాంకు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో బల్దియా జోరు

సౌత్‌ జోన్‌ ర్యాంకింగ్‌లో 25వ స్థానం

మంచిర్యాల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో మంచిర్యాల మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకును కైవసం చేసుకుంది. గతంలో ఉన్న 30వ ర్యాంకు నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. సౌత్‌జోన్‌ స్థాయిలో 25వ ర్యాంకును సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో  ర్యాంకులు ఇస్తోంది. ఇందులో ప్రధానంగా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తుండగా పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మల మూత్ర విసర్జన నిర్మూలన, ప్లాస్టిక్‌ నిషేధం, నివాస గృహాల నుంచి సేకరించే చెత్తను తడి, పొడిగా వేరుచేసి ఎరువుగా మార్చడం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.  జూలై 2020 నుంచి మార్చి 2021 వరకు సాధించిన పురోగతిలో భాగంగా ఈ నెల 20న స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సౌత్‌జోన్‌ పరిధిలో 25వ ర్యాంకును సాధించింది. గత ఏడాది 916 ఉన్న ర్యాంకును అధిగమించి ఈ సంవత్సరం 25ను కైవసం చేసుకోవడం విశేషం. పాలకవర్గం, అధికారుల సమష్టి కృషి కారణంగా మెరుగైన ర్యాంకులు మున్సిపాలిటీని వరించాయి.  

ఓడీఎఫ్‌ ప్లస్‌లో ర్యాంకు కైవసం

మున్సిపాలిటీకి రాష్ట్రం, సౌత్‌జోన్‌ స్థాయిల్లో ఓడీఎఫ్‌ (బహిరంగ మల, మూత విసర్జన) నిర్మూలనలో ర్యాంకులు వచ్చాయి. ఓడీఎఫ్‌ ప్లస్‌లో బల్దియా ర్యాంకులు కైవసం చేసుకుంది. బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలనకు మున్సిపాలిటీ పరిధి ఏడాది కాలంలో వివిధ కూడళ్లలో  16 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించారు. వీటితోపాటు రెండు ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేశారు. వీటిలో ప్రత్యేకంగా మహిళల కోసం బయో టాయి లెట్లను ఏర్పాటు చేసి, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచు తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మంచిర్యాలకు నిత్యం రాకపోకలు సాగించే ప్రజల సంఖ్య అధికంగా ఉండటంతో పై ఏర్పాట్లు చేశారు. వీటికి తోడు ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పారిశుధ్య పరిరక్షణలో భాగంగా ఇంటింటా సేకరించిన చెత్తను పట్టణంలోని అండాళమ్మ కాలనీలో గల డంప్‌ యార్డులో తడి, పొడిగా వేరు చేసే ప్రక్రియను చేపడుతున్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పారిశుధ్యం మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న వివిధ చర్యలు ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు దోహదం చేశాయి. 

ర్యాంకుల కేటాయింపు ఇలా

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్రధానంగా మూడు అంశాల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పాయింట్లను కేటాయించింది. సేవా ఆధారిత అభివృద్ధి, సిటిజన్‌ వాయిస్‌, సర్టిఫికేషన్‌ విభాగంలో మొత్తం 6వేల పాయింట్లు కేటాయించగా వాటిలో మున్సిపాలిటీ 2580 పాయింట్లు కైవసం చేసుకుంది. ఇందులో సేవా ఆధారిత అభివృద్ధి విభాగంలో 2400 పాయింట్లకుగాను 1240 కైవసం చేసుకోగా, సర్టిఫికేషన్‌ విభాగంలో 1800కు గాను 300 పాయింట్లు, ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ విషయంలో 1800 పాయింట్లకుగాను 1040 పాయింట్లను స్వాధీనం చేసుకుంది. ఆయా విభాగాలకు సంబంధించి మున్సిపాలిటీ సాధించిన పురోగతిపై స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు ప్రతీనెల 5వ తేదీన అధికారులు నివేదిక పంపించారు. కేంద్ర బృందం మార్చిలో పర్యటించి, నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. మున్సిపాలిటీ రిపోర్టుకు అనుగుణంగా ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడంతో ర్యాంకుల సాధనకు తోడ్పడింది. 

Advertisement
Advertisement