Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాదాద్రీశుడికి ఘనంగా స్వాతి పూజలు

 ఆలయ విస్తరణ పనులపై సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్ష

యాదాద్రిటౌన్‌, డిసెంబరు 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలు, సాయంత్రం పల్లకి సేవ శాస్త్రోకంగా నిర్వహించారు. స్వయంభువులను ఆస్థానపరంగా ఆరాధించి కవచమూర్తులను హారతి కొలిచారు. బాలాలయ కల్యాణమండపంలో 108 కలశాలు ఏర్పాటుచేసి హోమ పూజలు నిర్వహించారు. అనంతరం పంచసూక్తాలు, దశ శాంతులు, శాంతిమంత్ర పఠనాలతో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను 108 సువర్ణపుష్పాలతో అర్చించారు. మండపంలో నిత్య కల్యాణోత్సవం, ప్రతి ష్ఠా అలంకారమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన, సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండకింద పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రతమండపంలో వ్రత పూజలు, శివాలయంలో రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు నిర్వహించారు. యాదాద్రీశుడి సన్నిధిలో సుమారు 677 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. వ్రతపూజల ద్వారా రూ.3.38లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.6.19లక్షల ఆదాయం సమకూరింది. వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.18,73,428 ఆదాయం వచ్చింది. కాగా, స్వామివారి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్య లో గిరిప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఈప్రదక్షిణలో స్వామీజీలు అతిదేశ్వరానంద, ఆత్మారాం స్వామీజీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సైతం స్వాతి పూజలు కొనసాగాయి. ఇదిలా ఉండగా, యాదాద్రీశుడి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం వైటీడీఏ సాంకేతిక కమిటీ సభ్యుడు బీఎల్‌ఎన్‌.రెడ్డి రూ.1.80లక్షల విరాళాన్ని గురువారం అందజేశారు.


సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్ష

యాదాద్రి ఆలయ విస్తరణ పనులపై సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సమీక్షించారు. ఆలయ ఉద్ఘాటన సమయం సమీపిస్తున్న నేపథ్యంలో వైటీడీఏ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విస్తరణ పనుల పురోగతి, నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ పర్యటన సమయంలో అధికారులకు సూచించిన పనుల తీరుపై ఆరా తీశారు. కొండకింద రింగురోడ్డు విస్తరణ, రెండు ఫ్లైఓవర్‌ నిర్మాణాలు, కొండచుట్టూ గ్రీనరీ, యాదాద్రిలో మూడంచెల భద్రత తదితర అంశాలతో పాటు మహా సుదర్శన యాగ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. సమీక్షలో వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, దేవస్థాన ఈవో గీతారెడ్డి, ఆర్‌ఆండ్‌బీ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement