గుజరాత్ మంత్రుల ప్రమాణస్వీకారం ఒకరోజు వాయిదా

ABN , First Publish Date - 2021-09-16T01:09:11+05:30 IST

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సారథ్యంలోని కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో..

గుజరాత్ మంత్రుల ప్రమాణస్వీకారం ఒకరోజు వాయిదా

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సారథ్యంలోని కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో జాప్యం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో బుధవారం ప్రమాణస్వీకారం ఉంటుందని బీజేపీ ఇంతకుముందు ప్రకటించినప్పటికీ తాజాగా ఆ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు వాయిదా పడింది. మంత్రివర్గ కూర్పుపై నాయకుల మధ్య మల్లగుల్లాల కారణంగానే ప్రమాణస్వీకారం వాయిదా పడినట్టు తెలుస్తోంది.


పటేల్ క్యాబినెట్‌లో 21 నుచి 22 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. అయితే, గత ప్రభుత్వంలోని మెజారిటీ సభ్యులను 90 శాతం వరకూ తప్పించే అవకాశాలున్నాయని, కొందరు మహిళా ఎమ్మెల్యేలతో సహా కొత్త ముఖాలకే మంత్రివర్గంలో ప్రధానంగా చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత మంత్రివర్గంలోని పలువురు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని ఆయన నివాసంలో కలుసుకున్నట్టు చెబుతున్నారు. కొందరు ఆశావహులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పటేల్ మంగళవారంనాడు పిలిపించి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది.


కాగా, విజయ్ రూపానీ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్‌కే కొత్త సీఎంగా పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు కూడా మొదట్లో వినిపించాయి. ఆ ఊహాగానాలకు భిన్నంగా భూపేంద్ర పటేల్ పేరును లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ క్రమంలో నితిన్ పటేల్‌ను కొత్త క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదా అనే ఉత్సుకత పార్టీ వర్గాల్లో నెలకొంది. రూపానీ క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రులైన భూపేంద్రసిన్హ్, ఆర్‌సీ ఫల్డు, కౌశిక్ పటేల్‌ను మాత్రం కొత్త మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Updated Date - 2021-09-16T01:09:11+05:30 IST