స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలీనా... పార్లమెంటు ఆమోదం...

ABN , First Publish Date - 2021-11-24T23:26:39+05:30 IST

స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలీనా ఆండర్సన్‌ను

స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలీనా... పార్లమెంటు ఆమోదం...

కోపెన్‌హాగన్ : స్వీడన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలీనా ఆండర్సన్‌ను నియమించేందుకు ఆ దేశ పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. ఆమె ఇటీవలే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులను వదులుకున్న స్టెఫాన్ లోఫ్‌వెన్ స్థానంలో ఆమెను ఎంపిక చేశారు. మగ్దలీనా ప్రధాన మంత్రి పదవికి ఎంపిక కావడం స్వీడన్ చరిత్రలో ఓ మైలురాయి వంటిది. 


స్త్రీ, పురుష సమానత్వం విషయంలో ప్రగతిపథంలో ఉన్న యూరోపు దేశాల్లో స్వీడన్ ఒకటని చెబుతారు. అటువంటి దేశానికి ప్రధానిగా ఓ మహిళ ఎన్నికవడం ఇదే తొలిసారి. స్టెఫాన్ లోఫ్‌వెన్ ప్రభుత్వం తనను తాను ‘‘ఫెమినిస్ట్’’గా చెప్పుకునేది. 


స్వీడన్ పార్లమెంటులో 349 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన ఓటింగ్‌లో మగ్దలీనా ఆండర్సన్‌కు అనుకూలంగా 117 ఓట్లు లభించాయి. ఆమెకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేశారు. 57 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒకరు గైర్హాజరయ్యారు. అయితే స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం కనీసం 175 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉంటేనే ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగవలసి ఉంటుంది. ప్రస్తుతం మగ్దలీనాకు వ్యతిరేకంగా 174 మంది మాత్రమే ఓటు వేసినందువల్ల ఆమెను ప్రధాన మంత్రి పదవిలో నియమించేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. 


సోషల్ డెమొక్రాటిక్ పార్టీ, గ్రీన్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని మగ్దలీనా శుక్రవారం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీ, సెంటర్ పార్టీల మద్దతును కూడా ఆమె కోరే అవకాశం కనిపిస్తోంది. 


Updated Date - 2021-11-24T23:26:39+05:30 IST