కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మోస్ట్ పాపులర్ సింగర్

ABN , First Publish Date - 2021-10-23T01:32:58+05:30 IST

స్వీడన్‌లోనే అతిపెద్ద ఆర్టిస్టుగా పేరుగాంచిన అవార్డు విన్నింగ్ ర్యాపర్ ఐనార్‌ కాల్పుల్లో

కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మోస్ట్ పాపులర్ సింగర్

స్టాక్‌హోమ్: స్వీడన్‌లోనే అతిపెద్ద ఆర్టిస్టుగా పేరుగాంచిన అవార్డు విన్నింగ్ ర్యాపర్ ఐనార్‌ కాల్పుల్లో మృతి చెందాడు. అనుమానితుల కోసం వెంటాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. పలుమార్లు అతడిని కాల్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. 19 ఏళ్ల ఐనార్ 2019లో స్పోటిఫై అత్యంత ఎక్కువగా స్ట్రీమ్ చేసిన ఆర్టిస్టుగా గుర్తింపు పొందాడు. గురువారం రాత్రి పొద్దుపోయాక 11 గంటల సమయంలో ఓ అపార్ట్‌మెంట్ బయట జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఐనార్ ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  


ఇది ఎలా జరిగిందో, దీని వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. బాధితుడిని పోలీసులు ఇప్పటి వరకు గుర్తించనప్పటి ప్రధాన మీడియా మాత్రం అతడిని ఐనార్‌గా పేర్కొంది. అతడి పూర్తిపేరు నీల్స్ కర్ట్ ఐరిక్ ఐనార్ గ్రోన్‌బెర్గ్. ఐనార్ పాటలు చాలా వరకు నేర జీవితం, డ్రగ్స్, ఆయుధాల గురించే ఉంటాయి. ప్రత్యర్థి కళాకారుడైన యాసిన్‌తో అతడికి బహిరంగంగానే విభేదాలు ఉన్నాయి. 2020లో ఐనార్‌ కిడ్నాప్‌కు ప్లాన్ చేసినందుకు యాసిన్ 10 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.  


కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టినప్పటికీ ఐనార్ ఆ తర్వాత యాసిన్ ప్రమేయం లేకుండానే అపహరణకు గురయ్యాడు. అతడిని కొట్టి దోచుకున్నారు. అసభ్యకరంగా ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ కూడా చేశారు. 30 మంది అనుమానితులతో కూడిన క్రిమినల్ నెట్‌వర్క్ ఈ కిడ్నాప్‌నకు పాల్పడింది. అనుమానితుల్లో హవాల్ ఖలీల్ అనే మరో ర్యాపర్ కూడా ఉన్నాడు. కిడ్నాప్‌కు సహకరించినందుకు గాను జులైలో అతడికి రెండున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఐనార్‌తో అతడు పలుమార్లు బహిరంగంగానే గొడవలకు దిగాడు. 


ఐనార్ మృతిపై స్వీడన్ ప్రదాని స్టెఫాన్ లాఫ్‌వెన్ విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఏడాది అక్టోబరు 15 వరకు దేశంలో 273 కాల్పులు జరగ్గా 400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. 2020లో 366 కాల్పుల ఘటనలు జరగ్గా 47 మంది మరణించారు. 

Updated Date - 2021-10-23T01:32:58+05:30 IST