స్లీపింగ్‌.. స్వీపింగ్‌

ABN , First Publish Date - 2021-01-10T06:04:58+05:30 IST

తాండూరు మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేందుకు రూ.38లక్షలు ఖర్చు చేసి స్వీపింగ్‌

స్లీపింగ్‌.. స్వీపింగ్‌
కొత్త మున్సిపల్‌ భవనంలో నిరుపయోగంగా ఉన్న యంత్రం

  • రూ.38లక్షలతో స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు
  • నిరుపయోగంగా యంత్రం


తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేందుకు రూ.38లక్షలు ఖర్చు చేసి స్వీపింగ్‌ యంత్రాన్ని కొనుగోలు చేశారు. 7నెలలు కావస్తున్నా దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా కొత్త మున్సిపల్‌ భవనం వద్ద నిరుపయోగంగా పెట్టారు. 29 నవంబర్‌ 2019లో ప్రత్యేక అధికారి పాలనలో చేసిన తీర్మానంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో స్వీపింగ్‌ యంత్రాన్ని కొనుగోలు చేశారు. కార్పొరేషన్‌లో ఉపయోగించే ఈ స్వీపింగ్‌ మిషన్‌ తాండూరు మున్సిపాలిటీలో మెయిన్‌ రోడ్లు క్లీనింగ్‌ కోసం కొనుగోలు చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ను మూలనపడేశారు. ఈ మిషన్‌ వల్ల కొందరు లబ్ధిపొంది మిషన్‌ను మాత్రం ఉపయోగించడం లేదు. 

మామూలుగా స్వీపింగ్‌ మిషన్‌ను గుంతలు లేని బీటీ, సీసీ రోడ్ల మీద చెత్తను క్లీన్‌ చేయడానికి ఉపయోగిస్తారు. ఏ చిన్నపాటి గుంత ఏర్పడినా ఈ మిషన్‌ పనిచేయదు. కానీ తాండూరు పట్టణంలోని రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. ఇలాంటి రోడ్లపై ఈ మిషన్‌ను ఉపయోగించడం కష్టం. అదేవిధంగా ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్లు మున్సిపల్‌ పరిధిలోకి ఇంకా రాకపోవడం, మెయిన్‌రోడ్లలో చాలాచోట్ల సీసీలు, బీటీరోడ్లు లేకపోవడంతో స్వీపింగ్‌ మిషన్‌ నిరుపయోగంగా మారింది. పట్టణంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా అధ్యయనం చేయకుండా హడావిడిగా తీర్మానం చేసి మిషన్‌ కొనుగోలు చేశారు. ఇప్పటికే పట్టణంలో 260మంది వరకు పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వారిలో కొంతమందిని పాలకులు వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకుంటున్నప్పటికీ రాత్రివేళలో పట్టణంలోని రోడ్లను క్లీనింగ్‌ చేస్తున్నారు. 

ప్రజా పన్నుల ద్వారా వసూలైన నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ నిర్ణయాన్ని అప్పట్లో విపక్ష కౌన్సిలర్లు వ్యతిరేకించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్‌ బిల్లుల చెల్లింపులకే సరిపోనుండగా, ఏకంగా ఆ నిధులను దారి మళ్లించి స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేయించారు. ఈ మిషన్‌ కొనుగోళ్లు, టెండర్ల విషయం మున్సిపల్‌ ఉన్నతాధికారుల ఒత్తిళ్ల మేరకే జరిగిందన్న విమర్శలున్నాయి. ఇప్పటివరకూ ఈ మిషన్‌కు సంబంధించి శానిటరీ సిబ్బందికి శిక్షణ ఇవ్వలేదు. తాండూరులో కేవలం విలియంమూన్‌ చౌరస్తా నుంచి ఇందిరాచౌక్‌ వరకు మాత్రమే గుంతలు లేకుండా సీసీ రోడ్డు ఉంది. దీంతో ఈ మిషన్‌ మొత్తం పట్టణానికి ప్రయోజనం లేకుండా ఉంది. 


లక్షలు వెచ్చించి నిరుపయోగం

తాండూరు పట్టణంలో ఉన్న రోడ్లకు ఎలాంటి ప్రయోజనం లేని స్వీపింగ్‌ మిషన్‌ను లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. మిషన్‌కు సంబంధించి కౌన్సిల్‌కు తెలియకుండానే బిల్లులు చెల్లించారు. ఇప్పటివరకు మిషన్‌కు సంబంధించి ఆపరేటర్‌ను కూడా నియమించలేదు. దీనిని ఎవరి ప్రయోజనాలు ఆశించి కొనుగోలు చేశారో అర్థం కావడం లేదు. ఈ విషయమై బీజేపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది.

- సింధూజ, బీజేపీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌, తాండూరు మున్సిపాలిటీ

Updated Date - 2021-01-10T06:04:58+05:30 IST