స్విచ్ఛాఫ్‌.. అవుటాఫ్‌ ఆర్డర్‌!

ABN , First Publish Date - 2021-04-25T06:18:17+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటం, లక్షణాలు సోకిన వారు తీవ్ర ఆందోళనతో ఆస్పత్రుల్లో చేరేందుకు ఆరాటపడుతున్న నేపథ్యంలో కొవిడ్‌ పడకలకు డిమాండు పెరుగుతోంది.

స్విచ్ఛాఫ్‌.. అవుటాఫ్‌ ఆర్డర్‌!

కొన్ని ఆస్పత్రులకు తప్పుల తడకగా ఫోన్‌ నంబర్లు

మరికొన్ని చోట్ల ఫోన్‌ ఎత్తితే ఒట్టు

డ్యాష్‌బోర్డులో పడకల ఖాళీ చూపినా.. లేవంటున్న సిబ్బంది 

ఛార్జీలు భారీగా చెబుతున్న ప్రైవేటు యాజమాన్యాలు 

‘ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు


(తిరుపతి, ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటం, లక్షణాలు సోకిన వారు తీవ్ర ఆందోళనతో ఆస్పత్రుల్లో చేరేందుకు ఆరాటపడుతున్న నేపథ్యంలో కొవిడ్‌ పడకలకు డిమాండు పెరుగుతోంది. ఆ క్రమంలో డ్యాష్‌బోర్డులో ప్రభుత్వం పెడుతున్న సమాచారం వాస్తవమేనా? ఆస్పత్రి వర్గాలు స్పందించి సరైన సమాచారం అందిస్తున్నాయా? అని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి నెట్‌వర్కు’ శనివారం అన్ని ఆస్పత్రులకూ ఫోన్లు చేయగా చిత్రవిచిత్రమైన పరిస్థితులు వెల్లడయ్యాయి. డ్యాష్‌బోర్డులో మొత్తం 32 ఆస్పత్రుల పేర్లుండగా వాటిలో ఎనిమిదికి కొవిడ్‌ పడకల సంఖ్య చూపలేదు.


అది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ డ్యాష్‌బోర్డు. అందులో ప్రభుత్వ అనుమతితో కొవిడ్‌ వైద్య సేవలందించే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల జాబితా ఉంటుంది. ప్రతి ఆస్పత్రి ఎదుట ఫోన్‌ నెంబరు, కొవిడ్‌ పడకల సంఖ్య, అందులో ఎన్ని భర్తీ అయ్యాయి? మరెన్ని ఖాళీగా ఉన్నాయనే వివరాలు ఉంటాయి. రియల్‌ టైమ్‌ ప్రాతిపదికన నడిచే డాష్‌ బోర్డు కావడంతో తాజా సమాచారమే ఉండాలి.. ఉంటుంది కూడా. కానీ, ఈ డాష్‌ బోర్డు చూసి జిల్లాలోని ఆస్పత్రులకు ఫోన్‌ చేస్తే బాధితులకు దిమ్మ దిరగడం ఖాయం. ఎందుకంటే చాలా ఫోన్‌ నెంబర్లు తప్పుల తడకగా ఉన్నాయి. కొన్నింటికి కరెక్టు నెంబర్లే ఉన్నా, స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి. మరికొన్ని అవుటాఫ్‌ ఆర్డర్‌. చాలా ఆస్పత్రుల్లో ఫోన్లు తీసేవారే లేరు. డాష్‌ బోర్డులో పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్న పలు ఆస్పత్రుల్లో.. అసలు ఖాళీ లేవన్న సమాధానం వస్తోంది. కొన్ని ఆస్పత్రుల్లో పడకల సమాచారంతో పాటు ఛార్జీల వివరాలూ చెప్పారు. ఒకట్రెండు ఆస్పత్రుల్లో నేరుగా వచ్చి మాట్లాడమంటూ ఫోన్‌ పెట్టేస్తున్నారు. ఓ ఆస్పత్రి సిబ్బంది తమ వద్ద పడకలున్నాయి కానీ రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ లేదని, బయటనుంచి తెచ్చుకుంటే అడ్మిషన్‌ ఇస్తామంటూ సమాధానమిచ్చారు. 


ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదీ పరిస్థితి 


ఆరు ఆస్పత్రులకు ఎన్నిసార్లు ఫోను చేసినా తీయలేదు. వీటికి సంబంధించి మూడింట్లో 84 పడకలు ఖాళీ ఉన్నట్లు డ్యాష్‌బోర్డులో చూపారు.

మరో ఆరు ఆస్పత్రుల ఫోను నెంబర్లు పనిచేయలేదు. వీటిలో నాలుగింటికి సంబంధించి 350 పడకలు ఖాళీగా ఉన్నట్లు డ్యాష్‌బోర్డులో చూపారు. 

మరో ఆస్పత్రికి ఫోను చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. 

ఇంకో ఆస్పత్రిలో మాత్రం 30 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. 

మరో ఎనిమిది ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేవు. వీటిలో ఆరు ఆస్పత్రుల్లో 159 పడకలు ఖాళీ ఉన్నట్లు చూపడం గమనార్హం. ఓ ఆస్పత్రిలో ఛార్జీల గురించి అడగ్గా నేరుగా వస్తే చెబుతామన్నారు. 

ఇంకో ఆస్పత్రిలో చూపిన పడకల ఖాళీలున్నాయి. బాధితుల పరిస్థితిని బట్టి ఛార్జీలుంటాయని, ముందుగా చెప్పలేమన్నారు. 

మరో రెండు ఆస్పత్రులకు సంబంధించి డ్యాష్‌బోర్డులో పడకలను చూపకపోయినా, ఖాళీలున్నాయి. ఒక ఆస్పత్రిలో రోజుకు రూ.20 వేల నుంచి రూ. 30 వేలు ఖర్చవుతుందని చెప్పగా, మరో ఆస్పత్రిలో అడ్మిషన్‌ సమయంలో రూ.25 వేలు అడ్వాన్సు అడగారు. 

ఇంకో ఆస్పత్రిలో పడకలు ఖాళీ ఉన్నాయి. వీరికి ఫోను చేయగా.. ఇంజెక్షన్లు, మందులు లేవు. రెమిడెసివర్‌ దొరకడం లేదు. అందుకే అడ్మిషన్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఐసీయూ బెడ్‌కు రూ.లక్షన్నర అడ్వాన్సు కట్టాలన్నారు. రోజువారీ అంతవుతుందనేది బాధితుల కండిషన్‌ బట్టి ఉంటుందన్నారు. జనరల్‌ బెడ్‌కు లక్ష అడ్వాన్సు ఇవ్వాలట. తర్వాత కండిషన్‌ను బట్టి ఇంజెక్షన్‌ తెచ్చుకుంటే చేర్చుకుంటామని చెప్పారు. ‘బెంగళూరులో రూ.20 వేలు చెబుతున్నారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో ఉన్నాయంటున్నారు. అక్కడ ట్రై చేయండి’ అని సలహా ఇచ్చారు. 


పేదలకు దిక్కైన ఆస్పత్రుల్లోనూ అలక్ష్యమే!

జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పేద వర్గాలకు చెందిన  కొవిడ్‌ బాధితులకు తిరుపతిలోని రుయా, పద్మావతి ఆస్పత్రులే దిక్కుగా ఉన్నాయి. బాధితులకు సమాచారం, సమాధానం ఇవ్వడంలో ఆయాచోట్ల తీవ్ర అలక్ష్యం కనిపిస్తోంది. కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందించడమే కాదు ఎంతో ఆత్రుతతో, ఆందోళనతో ఫోన్లు చేసే బాధితులకు సరైన సమాచారం, సమాధానం కూడా చెప్పాల్సిన అవసరముంది. 

రుయాలో సిబ్బంది ఫోన్‌ లిఫ్టు చేస్తున్నా సిగ్నల్‌ ప్రాబ్లమ్‌ అంటూ కాల్‌ కట్‌ చేస్తున్నారు తప్పితే బాధితులకు అవసరమైన సమాచారం ఇవ్వడం లేదు. 

ఇక పద్మావతి ఆస్పత్రిలో డ్యాష్‌ బోర్డు ప్రకారం 271 పకడలు ఖాళీగా ఉన్నట్లు చూపితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ఖాళీగా లేవంటూ సమాధానమిచ్చాయి. సాయంత్రం డిశ్చార్జీలు జరిగితే తర్వాత చెబుతామంటూ దాటవేశాయి. 

వీటి తర్వాత బాధితులకు కొండంత అండగా వున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఫోన్‌ చేస్తే నంబరు పనిచేయడం లేదు. 

మదనపల్లె, కుప్పం, శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రుల నుంచీ సక్రమంగా సమాధానాలు వచ్చాయి. కానీ, కుప్పంలో 5, రేణిగుంట రైల్వే ఆస్పత్రిలో 14 పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపగా, లేవనని  చెప్పారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో మాత్రం 28 ఖాళీలు చూపగా ఒకటే ఉంది. 

Updated Date - 2021-04-25T06:18:17+05:30 IST