బెట్టింగ్‌కు సై

ABN , First Publish Date - 2021-10-05T08:32:42+05:30 IST

ఎలాంటి కష్టం లేకుండా కేవలం ఒక ఫోన్‌కాల్‌తో ఈజీగా లక్షలు సంపాదించవచ్చుననే ఆశతో చాలామంది క్రికెట్‌ పందెలకు పాల్పడుతున్నారు. ఈ బలహీనతలను తమకు అనుకూలంగా చేసుకుని క్రికెట్‌ బుకీలు వారితో బెట్టింగ్‌ చేయిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.

బెట్టింగ్‌కు సై

కొత్త బుకీల జోరు

రూ.లక్షల్లో బెట్టింగ్‌ లావాదేవీలు

నిఘా పెట్టిన పోలీసు అధికారులు


కరోనాతో క్రికెట్‌ మ్యాచ్‌లు లేక ఇంతకాలం దూరంగా ఉన్న బుకీలు ఇపుడు ఐపీఎల్‌ మ్యాచలలో బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పాత బుకీలపై పోలీసులు నిఘా పెట్టడంతో వారు స్తబ్ధుగా ఉన్నా, కొత్త వారు బుకీలుగా మారి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది ఈజీ మనీ కోసం క్రికెట్‌ పందేలకు అలవాటు పడుతుంటే, వీరి వీక్‌నె్‌సను అసరా చేసుకున్న క్రికెట్‌ బుకీలు పెద్ద ఎత్తున క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇపుడు బెట్టింగ్‌లోకి కొత్త వ్యక్తులు ప్రవేశించి, తమదైన శైలిలో బెట్టింగ్‌ లావాదేవీలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టణంలో రెండు అంకెల్లో ఉండే క్రికెట్‌ బుకీలు మూడంకెల స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌కు చెక్‌ పెట్టే దిశగా ఎస్పీ అన్బురాజన చర్యలతో ఇక్కడి బడా బుకీలు క్రికెట్‌ బెట్టింగ్‌కు విరామం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మ్యాచ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు బుకీలను పోలీ్‌సస్టేషన్లల్లో ఉంచడం, వారిపై నిఘా ఉంచడమే కారణమని తెలుస్తోంది. 


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 4: ఎలాంటి కష్టం లేకుండా కేవలం ఒక ఫోన్‌కాల్‌తో ఈజీగా లక్షలు సంపాదించవచ్చుననే ఆశతో చాలామంది క్రికెట్‌ పందెలకు పాల్పడుతున్నారు. ఈ బలహీనతలను తమకు అనుకూలంగా చేసుకుని క్రికెట్‌ బుకీలు వారితో బెట్టింగ్‌ చేయిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. అవసరమైతే వారే అప్పులు కూడా ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడి పోలీసు అధికారులు గతంలో తమ పరిధిలో బెట్టింగ్‌ కేసులు ఉన్న వారిపైనే నిఘా ఉంచడం, తరచూ పోలీ్‌సస్టేషన్‌లలో ఉంచడం తదితర కారణాలతో కొంత వరకు పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జూదం తగ్గినట్లే కన్పించింది. అయితే బెట్టింగ్‌ సంద్రంలోకి కొత్తనీరు ప్రవేశించడం, వీరిపై ఇంతవరకు పోలీసు కేసులు లేకపోవడం క్రికెట్‌ బెట్టింగ్‌కు కలిసి వచ్చింది. దీంతో క్రికెట్‌ బెట్టింగ్‌ మళ్లీ పుంజుకుంది. ఈ విషయం ఇటీవల కొత్త వ్యక్తులు క్రికెట్‌ బెట్టింగ్‌ కేసుల్లో పట్టుబడటంతో వెలుగులోకి వచ్చింది. దీంతో బెట్టింగ్‌ జూదంలోకి కొత్త వ్యక్తుల ప్రవేశంపై పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసు దాడులు, నిఘా నేపధ్యంలో కొందరు బుకీలు తమ మకాంను ఇతర నగరాలకు మార్చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే తమ అనుచరుల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతూ, నగదు లావాదేవీలను జరుపుతున్నట్లు సమాచారం. నవంబరు మొదటి వారం వరకు మ్యాచ్‌లు ఉండటంతో ఇంకా పెద్దఎత్తున క్రికెట్‌ బెట్టింగ్‌ జరిగే అవకాశం ఉంది. క్రికెట్‌ బెట్టింగ్‌ వల్ల ఎందరో జీవితాలు నాశనం అయ్యాయని, ఈ క్రికెట్‌ బెట్టింగ్‌కు చరమగీతం పాడాలని ఇక్కడి ప్రజలు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


క్రికెట్‌ బెట్టింగ్‌కు చెక్‌ పెట్టాం

- డీఎస్పీ వై.ప్రసాదరావు

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ జరుగుతున్న నేపధ్యంలో పాత బుకీలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచి చెక్‌ పెట్టాం. పోలీసు దాడులకు, కేసులకు భయపడి వారంతా బెట్టింగ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే కొత్త వ్యక్తులు క్రికెట్‌ బెట్టింగ్‌లోకి వచ్చారనే సమాచారంతో ఆ దిశగా దృష్టి పెట్టాం. క్రికెట్‌ బెట్టింగ్‌ను నివారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నగరాల్లోని బుకీల స్థావరాలపై సమాచారం రాబడుతున్నాం. ప్రత్యేక బృందాలను అక్కడికి పంపి బుకీలను పట్టుకునే ప్రణాళికతో ముందుకు పోతున్నాం. 

Updated Date - 2021-10-05T08:32:42+05:30 IST