వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ నేతలు
పామూరు, ఏప్రిల్ 8: పామూరులో వామపక్ష అభ్యర్థులకు ముందుగా కేటాయించిన గుర్తుల వరస, బ్యాలెట్ పత్రంలోని గుర్తుల వరకు మధ్య తేడా ఉండడంతో ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పట్టణంలోని 2వ ఎంపీటీసీకి సీపీఐ అభ్యర్థిగా సయ్యద్ మౌలాలి పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం మొదటి గుర్తుగా కంకి కొడవలి కేటాయించింది. వైసీపీ అభ్యర్థికి వరసక్రమంలో 2వ గుర్తుగా ఫ్యాన్‌ను కేటాయించింది. అభ్యర్థులు ఆ మేరకు నమూనా బ్యాలెట్లతో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లపై సీపీఐ అభ్యర్థికి కేటాయించిన గుర్తును వరసక్రమంలో రెండవ స్థానంలో ఉంచారు. మొదటి స్థానంలో ఫ్యాను గుర్తును ఉంచారు. ఇది గమనించిన సీపీఐ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ముందుగా కేటాయించిన గుర్తులను ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఎంపీటీసీ అభ్యర్థి ఎస్డీ మౌలాలీలు ఆర్ఓ ఎంవీ రమణ, ఎంపీడీఓ రంగసుబ్బరాయుడులను నిలదీశారు. గుర్తు సరిచేసి రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీన్ని పట్టించుకోని ఎన్నికల అధికారులు పోలింగ్‌ను కొనసాగించడంతో సీపీఐ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ యాదవ్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఆకుల మోహన్‌రావులను, ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో సీపీఐ ఎన్నికను బహిష్కరింది. ఈ క్రమంలో 2వ ప్రాదేశికంతో పోలింగ్ ఏకపక్షంగా సాగింది. కాగా 4వ ప్రాదేశికంలో కూడా సీపీఎం అభ్యర్థి గుర్తు అయిన సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తును ముందుగా వరసక్రమంలో మొదట స్థానంలో కేటాయించారు. బ్యాలెట్లో రెండవ గుర్తుగా చూపించారు. అయితే 5వ ఎంపీటీసీలో సీపీఎం అభ్యర్థికి మాత్రం మొదటి గుర్తును పార్టీ గుర్తుగా యథాతథంగానే కొనసాగించారు. అయితే 2, 4 స్థానాల్లో గుర్తుల వరస మారడంపై వామపక్ష అభ్యర్థులు అభ్యతరం తెలుపుతూ నిరసన చేపట్టారు. 2 ఎంపీటీసీ స్థానంలో సీపీఐ ఎన్నికలను బహిష్కరించింది. గుర్తుల వరస మారడాన్ని నిరసిస్తూ మండల రిటర్నింగ్ అధికారి ఈవి రమణకు గురువారం సీపీఐ, సీపీఎం శ్రేణులు లిఖితపూర్వకమైన వినతిపత్రాన్ని అందజేశారు. అయితే గుర్తుల మార్పుపై అధికారుల నుంచి స్పష్టమైన సమాదానం రాలేదు.
ఎన్నిక రద్దుకు డిమాండ్
మండల ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీకి తొత్తులుగా మారి గుర్తులను తారుమారు చేశారని పామూరు 2వ ఎంపీటీసీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించాలని సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంపీటీసీ-2 సీపీఐ అభ్యర్ధి ఎస్డీ మౌలాలి డిమాండ్ చేశారు. అదేవిధంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఆకుల మోహన్‌రావులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ స్థానిక జీవైఆర్ భవన్లో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ను తక్షణమే నిలిపివేసి రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వజ్రాల సుబ్బారావు, పాలపర్తి మస్తాన్‌రావు, ఇర్రి వెంకటరెడ్డి, కె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.