వరదలతో సహజీవనం!

ABN , First Publish Date - 2020-07-28T06:15:17+05:30 IST

నదులపై ఆనకట్టలు అత్యధికంగా నిర్మించిన దేశం చైనా. అయినప్పటికీ, గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఇప్పుడు పెను వరదలను ఎదుర్కొంటోంది...

వరదలతో సహజీవనం!

నదులు జలవాహినులే కాకుండా అవక్షేపాల వాహకాలు కూడా అనే వాస్తవాన్ని మనం విస్మరిస్తున్నాం. ఇదే ఈ విపత్కర పరిస్థితికి కారణం. డ్యాంలు, బ్యారేజ్‌లను తొలగించి, ప్రతి ఐదు నుంచి పదేళ్ళకు ఒకసారి వచ్చే మహావరదలకు తమ సామర్థ్యాన్ని పునరుద్ధరించుకునే అవకాశాన్ని నదులకు కల్పించాలి.


నదులపై ఆనకట్టలు అత్యధికంగా నిర్మించిన దేశం చైనా. అయినప్పటికీ, గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఇప్పుడు పెను వరదలను ఎదుర్కొంటోంది. మన బిహార్‌లోనూ ఎన్నో నదులు ‘బిహార్ దుఃఖప్రదాయినీ’లుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా గంగానది, దాని ఉపనదుల వరద జలాలను తెహ్రీ డ్యాం జలాశయంలో నిలిపివేసినప్పటికీ బిహార్‌కు వరదల తాకిడి తగ్గనేలేదు. కారణం ఏమిటి? నదులు జలవాహినులే కాకుండా అవక్షేపాల వాహకాలు కూడా అనే వాస్తవాన్ని మనం విస్మరించడం వల్లేకాదూ? హరిద్వార్ నుంచి కోల్‌కతా దాకా ఉన్న స్థల ఖండం (ల్యాండ్ మాస్) గంగా నదీజలాలు తీసుకునివచ్చిన అవక్షేపాలతో ఏర్పడినదేనన్న భౌతిక సత్యాన్ని మనం మరచిపోయాము. వేల సంవత్సరాలుగా గంగానది తన పరివాహక ప్రాంతమంతటా విస్తృత స్థాయిలో అవక్షేపాలను నిక్షేపం చేస్తున్నది. ఈ అవక్షేపాల నిక్షేపణాలే నేటి ఉత్తర ప్రదేశ్, బిహార్, బెంగాల్ ప్రాంతాలు. అయినప్పటికీ ఆ రాష్ట్రాలలో నివసిస్తున్న ప్రజలను గంగ, దాని ఉపనదుల వరదలు ఎనలేని యాతనలకు గురిచేస్తున్నాయి. ఈ దుష్కర పరిస్థితులతో ఎలా వ్యవహరించాలి అన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.


ప్రపంచపు ప్రధాన నదులలో అవక్షేపాలను భారీ పరిమాణంలో తీసుకువెళ్ళే నదీమతల్లి మన గంగమ్మే. ఏటా ఆమె జల మార్గంలో ఎన్నో అవక్షేపాలు నిక్షేపమవుతుంటాయి. ఐదు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా వరదల ఉధృతికి ఆ అవక్షేపాలు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. నది జలమార్గం ఇదివరకటి మహా లోతును మళ్ళీ సంతరించుకుని, నీటిని భారీ పరిమాణంలో తీసుకు వెళ్ళగల సామర్థ్యాన్ని పునరుద్ధరించుకుంటుంది. అయితే నదిపై తెహ్రీ డ్యాం మొదలైన భారీ ఆనకట్టలు కట్టడం ద్వారా పెను వరదలను నివారిస్తున్నాం. హరిద్వార్, నరోరా బ్యారేజీల నుంచి నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నాము. ఫలితంగా గంగానది నీటి మార్గంలో ఏటా నిక్షేపమవుతున్న అవక్షేపాలు నదీ తలంపై అలానే వుండిపోతున్నాయి గానీ, సముద్రంలోకి కొట్టుకు పోవడం లేదు. గంగమ్మ జల మార్గం మట్టం క్రమంగా పెరుగుతోంది. వరద జలాలను తీసుకువెళ్ళగల ఉరవడి, సామర్థ్యం తగ్గిపోతోంది. ఇప్పుడు అతి స్వల్పస్థాయిలో సంభవిస్తున్న వరదకు కూడా నది ఆ ఒడ్డు, ఈ ఒడ్డు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోతున్నాయి.


దీనివల్ల వాటిల్లుతున్న భారీ నష్టం బిహార్ రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతున్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే తెహ్రీ డ్యామ్ నిర్మాణం ద్వారా వరదల ఉధృతిని మనకు మనమే తీవ్రతరం చేశాము! ఈ సమస్యను బిహార్ ఇంజనీర్లు ఎలా పరిష్కరించారు? నదికి ఆ ఒడ్డున, ఈ ఒడ్డున గట్లు పెద్ద సంఖ్యలో నిర్మించారు. నదీ ప్రవాహాన్ని నదీ జల మార్గానికే పరిమితం చేయడం ద్వారా వరద జలాలు అడ్డు అదుపులేకుండా విస్తరించి ఉపద్రవాలు సృష్టించకుండా నిరోధించాలని వారు భావించారు. తద్వారా ప్రజలకు వరదల నుంచి ఉపశమనం లభించిందనడంలో సందేహం లేదు. అయితే ఎంత కాలం? నదీ జలాలు తీసుకువచ్చిన అవక్షేపాలు ఆ ఒడ్డు, ఈ ఓడ్డు గట్ల మధ్య నిక్షేపమవ్వడం వల్ల నదీతలం స్థాయి అనివార్యంగా పెరిగింది. పెరిగిన నదీ ప్రవాహ మట్టానికి సమాంతరంగా గట్ల ఎత్తును పెంచారు. దీని వల్ల నదీ తలం చుట్టు పక్కల స్థలం ఎత్తును మించిపోయింది. ఫలితంగా నదీ జలాలు, మెట్రో రైలులా, భూతలం కంటే పై స్థాయిలో ప్రవహించసాగాయి. ఇటువంటి పరిస్థితిలో నదికి ఇరువైపులా నిర్మించిన గట్లు తెగిపోకుండా ఎలా ఉంటాయి? వరద నీటి వెల్లువ నది పరివాహక ప్రదేశాన్ని పూర్తిగా ముంచెత్తాయి. వాటి ప్రవాహ మార్గాలను నదీ పరివాహక ప్రాంతాలు అడ్డుకోవడం వల్ల అవి సముద్రానికి వెళ్ళే పరిస్థితి లేదు. 


గంగానది అవక్షేపాలను తెహ్రీడ్యాం జలాశయంలో నిలిపివేత ప్రతికూల పర్యవసానాలలో ఒకటి బెంగాల్‌లోని సుందర్బాన్స్ మడ అరణ్యాల ప్రాంతాలకు ఆ అవక్షేపాలు గతంలో వలే చేరవు. భూ వాతావరణ అంతకంతకూ వేడెక్కిపోతున్న కారణంగా సముద్ర మట్టం పెరిగి ఇప్పటికే భారీగా నష్టపోతున్న సుందర్బాన్స్ మడ అడవులు, గంగానది అవక్షేపాలు కూడా కొరవడడం వల్ల మరింతగా క్షీణించిపోతాయి. తెహ్రీడ్యాం; హరిద్వార్, నరోరా బ్యారేజ్‌ల వల్ల సముద్రం మన పుణ్యభూమిని హరించివేసే విపత్కర పరిస్థితులు వేగవంతంగా నెలకొంటున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు. తెహ్రీ డ్యాం న్యూఢిల్లీకి తాగునీటి వసతిని; హరిద్వార్, నరోరా బ్యారేజ్‌లు గంగా మైదాన ప్రాంతాలకు సాగునీటిని సమకూరుస్తున్నాయి. అయితే దీనివల్ల మన పుణ్యభూమి సముద్రం పాలు అవుతున్నదనే కఠోర సత్యాన్ని మనం విస్మరించకూడదు. ఈ విపత్కర పరిస్థితిని అధిగమించడం ఎలా? వరదలతో సహజీవనం నెరపడాన్ని మనం నేర్చుకోవాలి. 1990 దశకంలో గోరఖ్ పూర్‌లో వరదలను నేను అధ్యయనం చేశాను. గతంలో వరదలను తాము నిశ్చింతగా స్వాగతించే వాళ్ళమని స్థానికులు చెప్పారు. నదీజలాలు తీసుకువచ్చిన అవక్షేపాల మేటలతో నిర్మితమైన ఎత్తైన స్థల ఖండాలపై గ్రామాలు ఏర్పడడం జరిగింది గనుక ప్రజలు తమ ఇళ్ళలో సురక్షితంగా ఉండే వాళ్ళు. వరద జలాలు నీటి పచ్చడంలా ప్రవహించేవి. వాటితో పునీతమైన నేల మరింతగా సారవంతమయ్యేది. గ్రామస్తులు నిర్దిష్ట రకాల వరి పైర్లనే సాగుచేసేవారు. వరద జలాల మట్టం పెరిగే కొద్దీ వరి మొక్కల ఎత్తు కూడా పెరుగుతుండేది. వరద ఉధృతి తగ్గు ముఖం పట్టిన తరువాత వరి ధాన్యంతో పాటు, రబీ పంటకు మరింత అనువైన సారవంతమైన నేల వారికి దైవమిచ్చిన కానుకగా లభ్యమయ్యేది.


‘వరదలతో సహజీవనం నెరపే’ మన పూర్వీకుల మార్గానికి మనం మళ్ళీ మరలాలి. డ్యాంలు, బ్యారేజీలను తొలగించాలి. అయినప్పటికీ ఢిల్లీ మహా నగరానికి తాగునీటి అవసరాలు పుష్కలంగా తీరుతాయి. ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు వివిధ చర్యలు చేపట్టడం ద్వారా తాగు నీటి కొరత లేకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్ భూగర్భ జలస్తరాలలో మనం 7600 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. భూగర్భ జలాల నిల్వలతో పోలిస్తే తెహ్రీ డ్యాంలో నిల్వ చేయగల 2.6 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ ఏ పాటిది? మరి ఇంజనీర్లు ఈ వివేక మార్గాన్ని అనుసరిస్తారా? సమాధానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి దృష్టి ఎంత సేపటికీ భారీ డ్యాంలు, బ్యారేజ్‌ల వైపే ఉంటుంది. ఇందుకు కారణాలు ఏమిటో స్పష్టమే. అయితే ఇంజనీర్ల మాటను వివేచనారహితంగా విశ్వసించడం వల్ల మనం మరింతగా పెను వరదల ప్రమాదాన్ని ఎదుర్కోవలసివస్తుంది. ప్రజల ఇక్కట్లకూ అంతూ పొంతూ వుండదు. భారత్, చైనాలు ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంజనీర్లు సూచించే పరిష్కార మార్గాలను ఉపేక్షించి ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. మన పుణ్య భూమిని పరిరక్షణను ప్రథమ కర్తవ్యంగా శిరసావహించాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-07-28T06:15:17+05:30 IST