సర్వేలో 20వేల మందికి లక్షణాలు

ABN , First Publish Date - 2021-05-08T08:43:05+05:30 IST

‘‘కొవిడ్‌ సర్వే సత్ఫలితాలనిస్తోంది. దేశంలోనే ఇది బృహత్తర కార్యక్రమం. జీహెచ్‌ఎంసీలో ఐదు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం..

సర్వేలో 20వేల మందికి లక్షణాలు

  • ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది
  • దేశంలోనే ఇది బృహత్తర కార్యక్రమం
  • లక్షణాలున్న వారే ‘కొవిడ్‌ కిట్లు’ తీసుకోవాలి
  • ఆక్సిజన్‌, మందులు ముందే సమకూర్చుకోవద్దు


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ‘‘కొవిడ్‌ సర్వే సత్ఫలితాలనిస్తోంది. దేశంలోనే ఇది బృహత్తర కార్యక్రమం. జీహెచ్‌ఎంసీలో ఐదు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం.. దశల వారీగా అన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 21 వేల కొవిడ్‌ సర్వే బృందాలు 11.22 లక్షల ఇళ్లను చుట్టివచ్చాయి. జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న 1.42 లక్షల మందిని పరీక్షించాయి. వారిలో 19,999 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించాయి’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు వెల్లడించారు. ‘ట్రీట్‌మెంట్‌ ఫస్ట్‌’ అన్న నినాదంతో ప్రారంభించిన ఈ సర్వే వల్ల కొవిడ్‌ను ముందుగానే గుర్తించి, సరైన సమయంలో వైద్యం అందజేయవచ్చన్నారు. శుక్రవారం ఆయన వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలున్న వారికి ‘కొవిడ్‌ కిట్లు’ అందజేస్తున్నామని తెలిపారు. ‘‘సకాలంలో వ్యాధిని గుర్తించి, తగిన ఔషధాలను అందించడం వల్ల రోగులను ప్రాణాపాయం నుంచి బయటకు తెస్తున్నాం. కరోనా లక్షణాలు బయటపడ్డాక.. నిర్లక్ష్యం చేస్తే.. వ్యాధి ముదిరి.. ప్రాణాలపైకి వస్తుంది. ఈ సర్వే వల్ల.. లక్షణాలున్నవారిని గుర్తించి, హోంఐసోలేషన్‌ చికిత్సతో కరోనాను నియంత్రిస్తున్నాం. 


వారితో ఎవరూ కాంటాక్ట్‌ అవ్వొద్దని చెబుతున్నాం. ఫలితంగా వ్యాప్తికి అడ్డుకట్ట పడడంతోపాటు.. ఆస్పత్రులపై రోగుల భారం తగ్గుతోంది. దీనివల్ల ఆస్పత్రుల్లో ఉండే ఇతర సీరియస్‌ రోగులకు వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయి. బాధితులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,247 ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్‌కు ఓపీ సేవలను ప్రారంభించాం. ఇంటింటి సర్వే, ఓపీ సేవలతో కరోనా సోకిన వారిలో వైరస్‌ ముదరకుండా ముందుగానే నియంత్రించే అవకాశాలున్నాయి’’ అని వివరించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే ‘కొవిడ్‌ కిట్లు’ తీసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘రాబోయే రోజుల్లో కరోనా వస్తుందేమోనని కొందరు ముందే కిట్లు కావాలని అడుగుతున్నారు. అది సరికాదు. ప్రభుత్వం దగ్గర లక్షల కిట్లు ఉన్నాయి. ఇంకొందరు ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమ్‌డెసివిర్‌ మందులను నిల్వచేసుకుంటున్నారు. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది’’ అని ఆయన వివరించారు. హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, తమ బృందాలు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను వాకబు చేస్తాయన్నారు. అవసరమైతే కొవిడ్‌ సర్వే బృందాలు వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తాయని భరోసా ఇచ్చారు. 


పాజిటివిటీ తగ్గుతోంది

రాష్ట్రంలో రెండు వారాలుగా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతున్నాయని గడల శ్రీనివాసరావు వివరించారు. మరో రెండు మూడు వారాల్లో మరింత తగ్గే అవకాశముందన్నారు. ప్రజలు కూడా మాస్కుల ధారణ, భౌతిక దూరం వంటి కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. డబుల్‌ మాస్కులను ధరిస్తూ.. సమూహాలకు దూరంగా ఉంటే కొవిడ్‌ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. రికవరీ రేటు 85ు ఉందన్నారు. మరణాల దేశంలో మరణాల రేటు 1.1ు ఉండగా.. తెలంగాణలో 0.54శాతంగా ఉందని వివరించారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మరో 2,300 ఆక్సిజన్‌ బెడ్లను పెంచుతామని, దాంతో ఆక్సిజన్‌ పడకల సంఖ్య 15 వేలకు చేరుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 51 ఆక్సిజన్‌ జనరేటర్లను కేటాయించిందని, వీటిని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని వివరించారు. నెలరోజుల్లో ఇవి సిద్ధమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వచ్చే కొవిడ్‌ పేషెంట్లకు ప్రవేశ ద్వారాల వద్ద ఆక్సిజన్‌ అందజేసేందుకు ట్రయాజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇవి ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యుల కమిటీ సూచిస్తేనే.. టొసిలిజుమాబ్‌ ఇంజెక్షన్లను ఇవ్వాలని, వీటివల్ల ప్రాణాంతక ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Updated Date - 2021-05-08T08:43:05+05:30 IST