Abn logo
May 11 2021 @ 01:10AM

సిండికేట్‌ గోల్‌మాల్‌

నిర్మల్‌ మండలం చిట్యాల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కుప్పలు తెప్పలుగా వచ్చిన వరి

కొనుగోలు కేంద్రాల్లో భారీగా గోల్‌మాల్‌ 

సెంటర్‌ నిర్వాహకులు, రైస్‌మిల్లర్ల మిలాఖత్‌ 

తప్ప, తాలు పేరిట పెద్ద ఎత్తున కోతలు 

జిల్లాలోని అన్నదాతకు అడుగడుగునా నష్టాలు 

ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా చర్యలు కరువు

నిర్మల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : ఓ వైపు ప్రకృతి వైఫరీత్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు మాయదారి సిండికేటు గోల్‌మాల్‌ చేస్తోంది. ప్రభుత్వం రైతులకు చేయూతను అందించేందుకోసం మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఆ కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైస్‌మిల్లర్లు మిలాఖతై రైతుకు శఠగోపం పెడుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి జిల్లా వ్యా ప్తంగా 133 వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే 70 శాతానికి పైగా దిగుబడులు రావడంతో రైతులు ధాన్యాన్ని కొను గోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ నిర్వాహకుల సూ చనల మేరకు ఆరబెట్టి తప్ప, తాలి తొలగిస్తున్నారు. ఆ తరువాత  ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. ఈ సమయంలోనే నిర్వాహకులు తేమను సైతం ప్రత్యేక పరికరం ద్వారా నిర్ధారించి ధాన్యం గ్రేడ్‌ను ఖరారు చేస్తున్నారు. ఈ గ్రేడ్‌కు అనుగుణంగా రైతులకు మద్దతుధరను చెల్లించాల్సి ఉన్నప్పటికీ నిర్వహకులు అందుకు భిన్నంగా వ్యవహారిస్తుండడం ఫిర్యాదులకు తావిస్తోంది. అలాగే ఇదే సమయంలో 40 కిలోల బస్తాను తూకం వేసే పేరిటా 42 కిలోల ధాన్యాన్ని తూకం వేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి 40 కిలోల ధాన్యానికి రెండు కిలోల చొప్పును కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కాజేస్తున్నారంటున్నారు. నాణ్యత పేరిట రెండు కిలోల ధాన్యాన్ని వారు తరుగు రూపంలో చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ఇక్కడ తూకం ప్రక్రియ పూర్తి కాగానే నిర్వహకులు ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలోని రైస్‌మిల్లులతో పాటు కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపెల్లి, జమ్మికుంట తదితర ప్రాంతాల రైస్‌మిల్లులకు జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం పంపుతున్నారు. అయితే ఇక్కడి రైస్‌మిల్లులు మరో తిరకాసు సృష్టించి రైతు నెత్తిన శఠగోపం పెడుతున్నారు. రైతులు విక్రయించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే తక్కువ బియ్యం వస్తున్నాయంటూ దీనికి కారణంగా నాణ్యత లేకపోవడమేనని మిల్లు యాజమాన్యాలు తప్పుదారి పట్టిస్తున్నాయంటున్నారు. దీనికి కూడా సదరు రైతులనే బాధ్యులను చేస్తున్నారు. పది సంచుల ధాన్యానికి మూడు సంచుల ధాన్యాన్ని రైస్‌మిల్లులు తరు గు రూపంలో చూపుతూ పౌరసరఫరాల శాఖ జారీ చేసిన ట్రక్‌షీట్‌లను సైతం తారుమారు చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు రైస్‌మిల్లులు యాజమాన్యాలు ఇదే పద్దతిలో రైతులను నిలువుదోపీడి చేస్తున్నాయంటున్నారు. ఆరుగాలం శ్రమించి ప్రకృతితో పోరాడుతూ పండించిన ధాన్యం పంట రైతులకు లాభం చేకూర్చడం దేవుడేరుగు గాని అటు అటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్‌మిల్లుల యాజమాన్యాలకు మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 25వేల మెట్రిక్‌ టన్ను ల వరిధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ ఈ ధాన్యం నుంచి పెద్దమొత్తంలోనే తరుగు పేరిట గండి కొట్టారంటున్నారు. జిల్లాలో మొత్తం 133 కొనుగోలు కేంద్రాల్లో ఇదే తరహాతంతు సాగుతోందంటున్నారు. ఖానాపూర్‌తో పాటు మరికొన్ని మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అక్కడి నిర్వహక్కులను రైతులు నిలదీస్తున్నప్పటికీ వీరి నిలదీతలను బేఖాతరు చేసి యథేచ్ఛగా దోపీడికి పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంబంధిత ఉన్న తాధికారులంతా ప్రతిరోజూ పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్ధితులను పరిశీలిస్తున్నప్పటికీ రైతుల ఆరోపణలపై మాత్రం వారి స్పందన కనిపించడం లేదంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్ల ఒత్తిడులకు కొంతమంది అధికారులు తలొగ్గుతున్నందునే ఈ అక్రమాల తంతు దర్జాగా సాగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

కొనుగోలు కేంద్రాల్లో మొదట మోసం

ప్రభుత్వం ఐకెపీ, డీసీయంయస్‌, పీఏసీఎస్‌ల ఆధ్వ ర్యంలో జిల్లావ్యాప్తంగా 133 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసింది. అవసరం అయితే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో మొత్తం 196 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ప్రయోజనం చేకూర్చాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం క్వింటాల్‌కు కొంతమేర కమీషన్‌ రూపంలో కూడా చెల్లిస్తున్నది. అయితే అవినీతికి అలవాటు పడిన చాలా కేంద్రాల్లో అక్కడి నిర్వహకులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ రైతుకు నష్టం చేకూరుస్తున్నారు. నాణ్యతను పూర్తిగా పరిశీలించి తప్పా, తాలు లేదని నిర్ధారించుకున్న తరువాతనే తూకం వేస్తున్నారు. ప్రతీసంచికి 40 కిలోల చొప్పున తూకం వే యాల్సి ఉండగా నాణ్యత పేరిట మళ్లీ తిరకాసు పెట్టి అద నంగా రెండుకిలోలను తూకం వేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 కిలోల సంచికి గాను 42 కిలోల సంచిని తూకంవేసి రైతులను పంపుతున్నారు. అయితే రైతు అమ్మిన ధాన్యానికి సంబంధించి వారికి తగిన రసీదును అందిస్తున్నారు. ఆ తరువాత ఈ ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇలా 25వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. 

తిరకాసు పెడుతున్న రైస్‌మిల్లర్లు

ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నాణ్యత, తూకంను ఖ రారు చేసి ఆ తరువాత రైస్‌మిల్లులకు ఆ ధాన్యాన్ని తరలిస్తున్నారు. అయితే రైస్‌మిల్లుల యాజమాన్యాలు తమ కున్న పలుకుబడి, పరపతితో పాటు సంబంధిత అధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలను అనుకూలంగా మ లుచుకొని మిల్లింగ్‌ సమయంలో మెలికలు పెడుతున్నారు. రైతులు విక్రయించిన ధాన్యంలో నాణ్యత ఉండడం లేదని మిల్లింగ్‌ చేసిన తరువాత బియ్యం తక్కువగా వస్తున్నాయన్న సాకుతో ఆ ధాన్యాన్ని తక్కువ చేసి లెక్క చూపుతున్నారంటున్నారు. 

అధికారుల తీరుపై అనుమానాలు

కాగా వరిధాన్యం కొనుగోలు నిర్వాహకులు అలాగే రైస్‌మిల్లుల యాజమాన్యాలు బహిరంగంగా తరుగు పేరిట మోసాలకు పాల్పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రైస్‌మిల్లు యాజమాన్యాలు సృష్టిస్తు న్న తిరకాసుల కారణంగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులను నేరుగా రైస్‌మిల్లులకు తీసుకువచ్చి సమస్యను సృష్టిస్తున్నారంటున్నారు. మిల్లు యాజమాన్యాలు రై తుల ధాన్యాన్ని చూపి ఈ ధాన్యం మిల్లింగ్‌కు పనికి రాద ని అవసరం అయితే వెనక్కి తీసుకువెళ్లండి అని దబాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో రైతులు బెంబెలేత్తిపోయి తరుగుకు అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నాణ్యత, తూకం లాంటి అన్ని అంశాలు నిర్ధారణ కావాల్సి ఉంది. ఆ తరువాత రైస్‌మిల్లులకు గాని గోదాములకు గాని తరలించి ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచే విషయంలో రైతులకు ఎ లాంటి ప్రమేయం ఉండదంటున్నారు. అయినప్పటికీ రైస్‌మిల్లు యాజమాన్యాలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమ చేతివాటం ప్రదర్శించి ఈ అక్రమాల తంతను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా అధికారులందరు ఉండే మండల , పట్టణ ప్రాంతాలకు సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లో సైతం ఈ అక్రమాల తంతు కొనసాగుతుండడం రైతుల ఆరోపణలకు బలం చేకూరుస్తోందంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఇటువైపు దృష్టి సారించి అక్రమాలకు పాల్పడుతు న్న వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా రైతులు నష్ట పోకుండా చూడాలని కోరుతున్నారు. 

రైస్‌మిల్లర్ల ఆగడాలను అరికట్టాలి

 ఎండనక వాననక కష్టపడి పండించిన పంటలను రైస్‌మిల్లుల చేతిలో నష్టపోవాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రా ల్లో నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేసినప్పటికీ రైస్‌మిల్లుకు తీసుకువెళ్లిన తరువాత సంచికి రెండు కిలోల చొప్పున దోచుకుంటున్నారు. 

Advertisement
Advertisement