గుంతలు పూడ్చే పనుల్లో కాంట్రాక్టర్ల సిండికేట్‌

ABN , First Publish Date - 2020-10-16T06:03:09+05:30 IST

వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడం, ఆ తర్వాత వచ్చే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగ ఏర్పాట్లలో భాగంగా

గుంతలు పూడ్చే పనుల్లో కాంట్రాక్టర్ల సిండికేట్‌

ఒక్కొక్కరికి రెండేసి పనులు 

రూ.50 లక్షల పనులకు టెండర్లు  

ఖజానాకు రూ.10 లక్షల మేరకు గండి 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 15: వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినడం, ఆ తర్వాత వచ్చే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగ ఏర్పాట్లలో భాగంగా వాటిని మరమ్మతులు చేయడం, అందుకోసం బల్దియా సాధారణ నిధుల నుంచి లక్షల్లో కేటాయించడం, ఆ టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేట్‌ కావడం, హడావుడిగా పైపైనే పనులు చేసి బిల్లులు తీసుకోవడం కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఆనవాయితీగా వసున్నది.  నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చాలా చోట్ల సీసీ, బీటీ రోడ్లు, మట్టి రోడ్లు దెబ్బతిని గుంతల మయంగా మారాయి. దీనితో వాటిని మరమ్మత్తు చేసేందుకు నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి 50 లక్షలను కేటాయించారు. 60 డివిజన్లలోని సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌లతోపాటు మట్టి రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చడం, జేసీబీతో రోడ్లను లెవలింగ్‌ చేయడం కోసం 50 లక్షల అంచనాలతో 82 పనులను చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు టెండర్లు పిలిచారు.


ఈనెల 15వ తేదీ టెండర్‌ షెడ్యూళ్ళ దరఖాస్తుకు చివరిరోజుగా పేర్కొన్నారు. నగరపాలక సంస్థలో 130 మంది వరకు రిజిస్టర్‌ కాంట్రాక్టర్లు ఉండగా వారిలో దాదాపు 50 మంది కాంట్రాక్టర్లు షెడ్యూళ్లను కొనుగోలు చేసి టెండర్లలో పాల్గొన్నారు. పోటీపడి అంచనా రేట్ల కంటే ఎక్కువతో కోట్‌ చేసి పనులు చేస్తే పెద్దగా లాభం ఉండదని, గతంలో చేసిన పనుల బిల్లులే ఇప్పటి వరకు ఇవ్వలేదని, దీనితో పనులు చేసి ఇబ్బందులు పడే బదులుగా పనులను పంచుకుందామనే ప్రతిపాదనతో కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు. ఒకరిద్దరు సిండికేట్‌ను వ్యతిరేకించినప్పటికి మెజార్టీ కాంట్రాక్టర్లు పోటీపడితే లాభం ఉండదని, పనులు పంచుకుందామనే నిర్ణయానికి వచ్చారు.


కాంట్రాక్టర్‌ సంక్షేమ సంఘం ప్రతినిధులు కొందరు ముందుపడి షెడ్యూళ్ళనిటిని తెప్పించుకొని కాంట్రాక్టర్లు కోరిన డివిజన్లకు సంబంధించిన పనులను ఒక్కొక్కరికి రెండు నుంచి నాలుగు పనులను పంచుకొని వాటికి సంబంధించిన షెడ్యూళ్ళను అందజేశారు.   ఆర్థిక స్థోమత లేని కారణంగా కొంత మంది కాంట్రాక్టర్లు ఇచ్చిన కాడికి పగిడీలను తీసుకుని వారు కొనుగోలు చేసిన షెడ్యూళ్ళను వారికి ఇచ్చి సిండికేట్‌కు సహకరించడంతో రింగ్‌ సక్సెస్‌ అయినట్లు తెలిసింది. అంచనా రేట్లతో కొన్ని మరికొన్ని అంచనా రేట్ల కంటే కొద్దిగా ఎక్కువతో, మరికొన్ని ఒకటి, రెండుశాతం లెస్‌తో పనులు చేసి డబ్బులు సంపాదించుకునేందుకు కాంట్రాక్టర్లు సిండికేట్‌ అయినట్లు తెలిసింది. అయితే కాంట్రాక్టర్ల సిండికేట్‌తో బల్దియా ఖజానాకు దాదాపు 5 నుంచి 10 లక్షల మేరకు గండి పడినట్లేనని చెబుతున్నారు. ఒక్కో పనికి నలుగురైదుగురు కాంట్రాక్టర్లు షెడ్యూల్స్‌ను దాఖలు చేయడంతో సిండికేట్‌గా భావించలేమని అధికారులు వాటిని అంగీకరించడం జరుగుతుంది.


టెండర్లలో సిండికేట్‌ కావడం ఒకటైతే మరొకటి పండుగల వరకు టెండర్లను ఖరారు చేసి వర్క్‌ ఆర్డర్లను ఇవ్వక పోవడంతో పండుగ సమయంలోనే హడావుడిగా పనులు మీదమీద చేయడంతో సగానికి సగం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనితో ప్రతి సంవత్సరం లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని, ఈసారి పైపైన పనులు చేయకుండా,  పనులైనా పూర్తిగా జరిగేలా చూసి ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా మేయర్‌ కమిషనర్లు ప్రత్యేక దృష్టిసారించాలని, మరమ్మత్తుల పేరిట లక్షలు వెచ్చించే బదులుగా శాశ్వతంగా పనులు చేపడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-10-16T06:03:09+05:30 IST