కూతురి సంతోషం కోసం ఆ తండ్రి పెద్ద అబద్ధమే ఆడాడు..!

ABN , First Publish Date - 2020-02-23T01:30:43+05:30 IST

పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు. చెప్పేవి అబద్ధాలా, నిజాలా అని ఆలోచించరు..ఎందుకంటే పిల్లల ఆనందమే వారికి ముఖ్యం. ఉదాహరణ

కూతురి సంతోషం కోసం ఆ తండ్రి పెద్ద అబద్ధమే ఆడాడు..!

న్యూఢిల్లీ: పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు. చెప్పేవి అబద్ధాలా, నిజాలా అని ఆలోచించరు..ఎందుకంటే పిల్లల ఆనందమే వారికి ముఖ్యం. ఉదాహరణకు చందమామ రాదని తెలిసినా.. పిల్లలకు అన్నం తినిపించడం కోసం తల్లులు ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’ అని పాట పాడతారు. పిల్లలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని తల్లులను వేలెత్తి చూపలేం. ఎందుకంటే వారికి వారి పిల్లల కడుపు నిండటం ముఖ్యం.


అలానే ఓ తండ్రి.. తన కూతురి సంతోషం కోసం ఓ పెద్ద అబద్ధమే చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం అనుకూల దళాలు ప్రత్యర్థులపై ప్రతిరోజు వైమానిక దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ దాడుల కారణంగా గత డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు సుమారు 8లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలసలు కూడా వెళ్తున్నారు. అయితే పూర్తి భయానక పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని విడిచి.. అబ్దుల్లా కుటుంబం సిరియాలోని మరోప్రాంతానికి వెళ్లింది. అక్కడ కూడా బాంబు శబ్దాలు మారుమోగుతూనే ఉండటంతో తన నాలుగేళ్ల కూతురు సెల్వా.. భయపడొద్దనే ఉద్దేశంతో అవి ఆడుకునే బాంబులంటూ అబ్దుల్లా అబద్ధం చెప్పాడు. అంతేకాకుండా ఆ బాంబు శబ్దాలు వినిపించగానే గట్టిగా నవ్వాలంటూ సూచించాడు. దీంతో బాంబు శబ్దాలు వినిపించినప్పుడల్లా.. ఆ చిన్నారి గట్టిగా నవ్వుతోంది. సెల్వా నవ్వుతున్న దృశ్యాలను అబ్దుల్లా స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 



Updated Date - 2020-02-23T01:30:43+05:30 IST