తిప్పేసిన పూనమ్‌

ABN , First Publish Date - 2020-02-22T10:37:38+05:30 IST

మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ అదిరిపోయే బోణీ చేసింది. శుక్రవారం గ్రూప్‌-ఎలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్లతో కూడిన ఆస్ట్రేలియాపై

తిప్పేసిన పూనమ్‌

ఆరంభ మ్యాచ్‌లోనే  ప్రత్యర్థి డిఫెండింగ్‌ చాంపియన్‌.. ఇటీవలి ట్రైసిరీస్‌ ఫైనల్లోనూ ఆ జట్టు చేతిలో ఓటమి ఇంకా మెదులుతూనే ఉంది.. ఇక ఎప్పటిలాగే బ్యాట్స్‌వుమెన్‌ విఫలం కాగా భారత్‌ చేసింది 132 పరుగులే. ఇంకేముంది.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఈ స్వల్పస్కోరును ఉఫ్‌మని ఊదేస్తుందనుకున్నారంతా. కానీ, సిడ్నీ మైదానంలో మన బౌలర్లు అద్భుతమే చేశారు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ మ్యాజిక్‌ బంతులతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. ఆమె ధాటికి పరుగులు కాదు కదా వికెట్లను ఎలా కాపాడుకోవాలో కూడా ఆ నెంబర్‌వన్‌ జట్టు బ్యాటర్లకు అర్థం కాలేకపోయింది. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌కు షాకిచ్చి భారత్‌ ఘనమైన బోణీ కొట్టింది. 


విలవిల్లాడిన ఆసీస్‌ 

డిఫెండింగ్‌ చాంప్‌నకు భారత్‌ షాక్‌ 

టీ20 మహిళల ప్రపంచకప్‌


సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ అదిరిపోయే బోణీ చేసింది. శుక్రవారం గ్రూప్‌-ఎలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్లతో కూడిన ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (4/19), పేసర్‌ శిఖా పాండే (3/14) పట్టు వదలని పోరాటం ఆసీ్‌సను వణికించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ (49 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌లోనూ 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి కట్టడి చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (15 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. ఆ త ర్వాత ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ హీలీ (35 బంతుల్లో 51), గార్డ్‌నర్‌ (34) మాత్రమే రాణించగా మిగతా తొమ్మిది మంది రెండంకెల స్కోర్లు కూడా దాటకపోగా అంతా కలిసి చేసింది 28 పరుగులే. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా పూనమ్‌ యాదవ్‌ నిలిచింది. భారత్‌ రెండో మ్యాచ్‌ను ఈనెల 24న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. 


టపటపా వికెట్లు

స్వల్ప ఛేదనలో ఓపెనర్‌ ఆలీసా హీలీ ధాటికి ఆసీ్‌సకు చక్కటి ఆరంభమే లభించింది. ఓవైపు వికెట్లు పడుతున్నా తను మాత్రం బౌండరీలతో చెలరేగి 34 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు బౌలర్ల జోరుకు బెత్‌ మూనీ (6), మెగ్‌ లానింగ్‌ (5) త్వరగానే పెవిలియన్‌కు చేరారు. కానీ హీలీ దూకుడు చూస్తే మ్యాచ్‌ ఆసీస్‌ వైపే ఉందనిపించింది. అయితే, ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో పూనమ్‌ లెంగ్త్‌ బాల్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వడంతో హీలీ కథ ముగిసింది. ఇదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత తన మరుసటి ఓవర్‌లోనే పూనమ్‌ వరుస బంతుల్లో రాచెల్‌ హేన్స్‌ (6), ఎలిస్‌ పెర్రీ (0)లను అవుట్‌ చేసింది. అయితే మూడో బంతికి జొనాసెన్‌ క్యాచ్‌ ఇచ్చినా కీపర్‌ భాటియా వదిలేయడంతో హ్యాట్రిక్‌ మిస్‌ అయ్యింది. ఈ దశలో మిడిలార్డర్‌లో గార్డ్‌నర్‌ నిలకడను ప్రదర్శించి తుదికంటా నిలిచే ప్రయత్నం చేసినా మరో ఎండ్‌ నుంచి ఆమెకు మద్దతు లభించింది. ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి ఉండగా శిఖా పాండే ఐదు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయగా భారత్‌కు సూపర్‌ విజయం దక్కింది. ఒత్తిడికి లోనైన ఆసీస్‌ 14 పరుగులకే చివరి నాలుగు వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది.


షఫాలీ జోరు.. దీప్తి నిలకడ

4 ఓవర్లు.. 40 పరుగులు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో ప్రదర్శించిన దూకుడిది. 16 ఏళ్ల టీనేజర్‌ షఫాలీ వర్మ ఆసీస్‌ బౌలర్లను ఊచకోత కోయడంతో రన్‌రేట్‌ ఏకంగా పదితో పరుగులెత్తింది. కానీ మిగతా వారి నుంచి అలాంటి జోరు ఏమాత్రం కనిపించలేదు. స్టార్‌ ఓపెనర్‌ మంధాన (10) ఐదో ఓవర్‌లోనే వెనుదిరగగా, తర్వాతి ఓవర్‌లోనే షఫాలీ కూడా అవుట్‌ కావడంతో స్కోరు నెమ్మదించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (2) తన పేలవ ఫామ్‌ను కొనసాగించగా, అటు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. జెమీమా (26)తో కలిసి నాలుగో వికెట్‌కు 53 రన్స్‌ జోడించింది. అయితే బ్యాటింగ్‌ కష్టమైన ఈ పిచ్‌పై చివరి 16 ఓవర్లలో భారత్‌ మూడు ఫోర్లు మాత్రమే సాధించడం తుది స్కోరుపై ప్రభావం చూపింది. 


1  ఆసీస్‌ గడ్డపై ఓ మహిళల క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు రికార్డు స్థాయిలో (13,432) ప్రేక్షకులు హాజరవడం ఇదే తొలిసారి.


నెంబర్‌ వన్‌ బౌలర్‌నూ బాదేసింది..

16 ఏళ్ల టీనేజర్‌ షఫాలీ వర్మ బ్యాటింగ్‌ చూస్తే మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తుకు రాకమానడు. బౌలర్‌ ఎవరైతే నాకేంటి.. తెలిసిందల్లా బంతిని బౌండరీగా బాదడమే నా పని అన్నట్టుగా వీరిద్దరి ఆటతీరు ఉంటుంది. ఈ తరహా బ్యాటింగ్‌ ఆసీ్‌సతో జరిగిన మ్యాచ్‌లోనూ షఫాలీ ప్రదర్శించింది. ఏకంగా టీ20ల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ బౌలర్‌ మెగాన్‌ షట్‌కే చుక్కలు చూపించింది. ఆమె వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో ఈ చిచ్చరపిడుగు ఏకంగా నాలుగు ఫోర్లతో 16 పరుగులు రాబట్టి అదుర్స్‌ అనిపించుకుంది.  


స్కోరుబోర్డు

భారత్‌: షఫాలీ (సి) సదర్లాండ్‌ (బి) పెర్రీ 29; మంధాన (ఎల్బీ) జొనాసెన్‌ 10; రోడ్రిగ్స్‌ (ఎల్బీ) కిమ్మిన్స్‌ 26; హర్మన్‌ప్రీత్‌ (స్టంప్డ్‌) హీలీ (బి) జొనాసెన్‌ 2; దీప్తి శర్మ (నాటౌట్‌) 49; వేద (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 132/4. వికెట్ల పతనం: 1-41, 2-43, 3-47, 4-100. బౌలింగ్‌: స్ట్రానో 2-0-15-0; పెర్రీ 3-0-15-1; షట్‌ 4-0-35-0; జొనాసెన్‌ 4-0-24-2; కిమ్మిన్స్‌ 4-0-24-1; గార్డ్‌నర్‌ 3-0-19-0.


ఆస్ర్టేలియా: హీలీ (సి అండ్‌ బి) పూనమ్‌ యాదవ్‌ 51; మూనీ (సి) గైక్వాడ్‌ (బి) శిఖా పాండే 6; లానింగ్‌ (సి) భాటియా (బి) గైక్వాడ్‌ 5; హేన్స్‌ (స్టంప్‌) భాటియా (బి) పూనమ్‌ యాదవ్‌ 6; గార్డ్‌నర్‌ (సి అండ్‌ బి) శిఖా పాండే 34; పెర్రీ (బి) పూనమ్‌ యాదవ్‌ 0; జొనాసెన్‌ (సి) భాటియా (బి) పూనమ్‌ 2;  సదర్లాండ్‌ (స్టంప్డ్‌) భాటియా (బి) శిఖా పాండే 2; కిమ్మిన్స్‌ (రనౌట్‌) 4; స్ట్రానో (రనౌట్‌) 2; షట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19.5 ఓవర్లలో 115 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-32, 2-55, 3-67, 4-76, 5-76, 6-82, 7-101, 8-108, 9-113, 10-115. బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-17-0; రాజేశ్వరి గైక్వాడ్‌ 4-0-31-1; శిఖా పాండే 3.5-0-14-3; అరుంధతి 4-0-33-0; పూనమ్‌ యాదవ్‌ 4-0-19-4.

Updated Date - 2020-02-22T10:37:38+05:30 IST