బంగ్లా, స్కాట్లాండ్‌ సూపర్‌

ABN , First Publish Date - 2021-10-22T07:42:56+05:30 IST

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12కు బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ దూసుకెళ్లాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షకీబల్‌ (46, 4/9) ఆల్‌రౌండ్‌ షోతోపాటు కెప్టెన్‌ మహ్మదుల్లా (28 బంతుల్లో 50) ధనాధన్‌ అర్ధ శతకంతో.. టీ20 క్వాలిఫయర్స్‌ గ్రూప్‌...

బంగ్లా, స్కాట్లాండ్‌ సూపర్‌

నేటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు

స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఐర్లాండ్‌ x నమీబియా (మ.3.30)

నెదర్లాండ్స్‌ x  శ్రీలంక (రాత్రి 7.30)

షకీబల్‌ అండ్‌ కో దెబ్బకు పపువా చిత్తు

మహ్మదుల్లా అర్ధ శతకం


అల్‌ అమీరట్‌ (ఒమన్‌): టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12కు బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ దూసుకెళ్లాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షకీబల్‌ (46, 4/9) ఆల్‌రౌండ్‌ షోతోపాటు కెప్టెన్‌ మహ్మదుల్లా (28 బంతుల్లో 50) ధనాధన్‌ అర్ధ శతకంతో.. టీ20 క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-బిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 84 పరుగుల భారీ తేడాతో పసికూన పపువా న్యూ గినీ (పీఎన్‌జీ)ని చిత్తు చేసింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో పీఎన్‌జీ 19.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. షకీబల్‌ అండ్‌ కో దెబ్బకు టపటపా వికెట్లను చేజార్చుకున్న పీఎన్‌జీ.. ఒక దశలో 29/7తో టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసేలా కనిపించింది. కానీ, లోయర్‌ మిడిలార్డర్‌లో కిప్లిన్‌ డొరిగా (46 నాటౌట్‌) ఎదురుదాడి చేసి పరాభవాన్ని తప్పించాడు. 9 మంది పపువా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. సైఫుద్దీన్‌, తస్కిన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 పరుగులు చేసింది. కబువా, డామియన్‌ రవు చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. 


నయీమ్‌ విఫలం..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా లేకుండానే ఓపెనర్‌ మహ్మద్‌ నయీమ్‌ (0) వికెట్‌ కోల్పోయింది. మోరియా బౌలింగ్‌లో బవు అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌ చేరాడు. అయితే, మరో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (29), షకీబల్‌ రెండో వికెట్‌కు 50 పరుగులతో ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. గేర్‌ మార్చే ప్రయత్నం చేసిన దాస్‌ను వాలా అవుట్‌ చేయగా.. ముష్ఫికర్‌ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో బంగ్లా 72/3తో నిలిచింది. ఈ దశలో షకీబల్‌కు జత కలిసిన మహ్మదుల్లా.. పీఎన్‌జీ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే, కీలక సమయంలో షకీబల్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. కానీ, జోరు కొనసాగించిన మహ్మదుల్లా ఎడాపెడా షాట్లు బాదుతూ.. ఈ సీజన్‌లోనే వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. సైఫుద్దీన్‌ (19 నాటౌట్‌)తో  కలసి ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించిన మహ్మదుల్లాను రవు వెనక్కి పంపాడు. చివరి ఓవర్‌లో సైఫుద్దీన్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 20 పరుగులు రాబట్టడంతో.. బంగ్లా స్కోరు 180 పరుగుల మార్క్‌ దాటింది.


గ్రూప్‌-1లోకి బంగ్లా

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన స్కాట్లాండ్‌ మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. సూపర్‌-12లో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ ఉన్న గ్రూప్‌-2లో చోటు దక్కించుకుంది. రెండు మ్యాచ్‌లు నెగ్గిన బంగ్లాదేశ్‌.. మొత్తం 4 పాయింట్లతో రెండో స్థానం ఖరారు చేసుకుంది. సూపర్‌-12లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక ఉన్న గ్రూప్‌-1లో బంగ్లాదేశ్‌ బెర్త్‌ సంపాదించింది. ఒమన్‌, పపువా న్యూ గినీ టోర్నీ నుంచి అవుటయ్యాయి. 


అజేయంగా...

జోరు మీదున్న స్కాట్లాండ్‌ 8 వికెట్లతో ఒమన్‌పై గెలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన స్కాట్లాండ్‌ గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. కెప్టెన్‌ కైల్‌ కోయిట్జర్‌ (41) ధాటిగా ఆడడంతో.. 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడో వికెట్‌కు అజేయంగా 48 పరుగులు జోడించిన బేరింగ్టన్‌ (31), మాథ్యూ క్రాస్‌ (26) మరో 18 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు. ఫయాజ్‌ భట్‌, ఖవార్‌ అలీ చెరో వికెట్‌ పడగొట్టారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ జతిందర్‌ సింగ్‌ (0) తొలి ఓవర్‌లోనే రనౌట్‌ కావడంతో ఒమన్‌ పుంజుకోలేక పోయింది. మరో ఓపెనర్‌ ఆకిబ్‌ ఇలియాస్‌ (37), కెప్టెన్‌ మక్సూద్‌ (34), నదీమ్‌ (25) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జోష్‌ డేవే మూడు, లీస్క్‌, షరీఫి రెండేసి వికెట్లు పడగొట్టారు.  


సంక్షిప్త స్కోర్లు:

ఒమన్‌: 20 ఓవర్లలో 122 ఆలౌట్‌ (ఆకిబ్‌ ఇలియాస్‌ 37, మక్సూద్‌ 34; జోష్‌ డేవే 3/25, లీస్క్‌ 2/13). స్కాట్లాండ్‌: 17 ఓవర్లలో 123/2 (కైల్‌ కోయిట్జర్‌ 41, బేరింగ్టన్‌ 31 నాటౌట్‌; ఫయాజ్‌ భట్‌ 1/26). 


సంక్షిప్త స్కోర్లు

బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 181/7 (మహ్మదుల్లా 50, షకీబల్‌ హసన్‌ 46; కబువా మోరియా 2/26, డామియన్‌ రవు 2/40). 

పపువా న్యూ గినీ: 19.3 ఓవర్లలో 97 ఆలౌట్‌ (కిప్లిన్‌ డొరిగా 46 నాటౌట్‌; షకీబల్‌ 4/9, తస్కిన్‌ అహ్మద్‌ 2/12). 

Updated Date - 2021-10-22T07:42:56+05:30 IST