రికార్డుకు చేరువలో...

ABN , First Publish Date - 2021-10-18T07:59:33+05:30 IST

టీ20 వరల్డ్‌ కప్‌ ఆదివారం మొదలైనా..అసలు సిసలు సమరానికి ఈనెల 23 నుంచి జరిగే సూపర్‌ 12తో తెరలేవనుంది.

రికార్డుకు చేరువలో...

టీ20 వరల్డ్‌ కప్‌ ఆదివారం మొదలైనా..అసలు సిసలు సమరానికి ఈనెల 23 నుంచి జరిగే సూపర్‌ 12తో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రికార్డులు బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో, వాటిని ఎవరు చేరుకుంటారో ఓ లుక్కేద్దాం.

విరాట్‌ కోహ్లీ: టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ ప్రపంచ కప్‌లో అత్యధిక రన్స్‌ చేసిన క్రికెటర్‌ రికార్డును అందుకొనేందుకు కేవలం 240 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 16 మ్యాచ్‌ల్లో 86.33 సగటుతో 133.04 స్ట్రయిక్‌ రేట్‌తో విరాట్‌ 777 పరుగులు చేశాడు. ఇక అత్యధిక పరుగులు చేసిన రికార్డు శ్రీలంక మాజీ సారథి మహేల జయవర్ధనే (1016) పేరిట నమోదై ఉంది.

రోహిత్‌ శర్మ: హిట్‌మ్యాన్‌ మరో 10 సిక్సర్లు కొడితే ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డును సొంతం చేసుకుంటాడు. రోహిత్‌ శర్మ ఇప్పటిదాకా 28 మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు దంచాడు. యువరాజ్‌ సింగ్‌ (31 మ్యాచ్‌ల్లో 33) టాప్‌లో ఉన్నాడు. 

షకీబల్‌ హసన్‌: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ 8 వికెట్లు సాధిస్తే వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డును అందుకుంటాడు. 26 మ్యాచ్‌ల ద్వారా 32 వికెట్లు ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్నాయి. పాక్‌ మాజీ కెప్టెన్‌ అఫ్రీది (34 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) టాప్‌లో ఉన్నాడు. 

డ్వేన్‌ బ్రావో: ఈసారి టోర్నీలో బ్రావో ఏడు మ్యాచ్‌లు ఆడితే..పొట్టి ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ వెస్టిండియన్‌ 29 మ్యాచ్‌లు ఆడగా..శ్రీలంక బ్యాటర్‌ తిలకరత్నే దిల్షాన్‌ (35 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. 

మార్టిన్‌ గప్టిల్‌: న్యూజిలాండ్‌ ప్లేయర్‌ గప్టిల్‌ (102 మ్యాచ్‌ల్లో 2939 పరుగులు) మరో 61 రన్స్‌ చేస్తే టీ20లలో 3000 పరుగులు చేసిన రెండో అవుతాడు. కోహ్లీ (90 మ్యాచ్‌ల్లో 3159 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.

టిమ్‌ సౌథీ: న్యూజిలాండ్‌ పేస్‌ బౌలర్‌ మరొక్క వికెట్‌ పడగొడితే టీ20లలో 100 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌ అవుతాడు. షకీబల్‌ (108), మలింగ (107) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

Updated Date - 2021-10-18T07:59:33+05:30 IST