విశ్వపోరులో విజేత ఎవరో!

ABN , First Publish Date - 2021-10-23T07:38:24+05:30 IST

రెండేళ్లకోసారి అట్టహాసంగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ ఈసారి ఐదేళ్ల విరామం తీసుకుంది. 2016లో చివరిసారి భారత్‌లో జరిగిన ఈ టోర్నీలో వెస్టిండీస్‌ విజేతగా నిలిచింది.

విశ్వపోరులో విజేత ఎవరో!

నేటి నుంచే టీ20 ప్రపంచకప్‌

రెండో టైటిల్‌పై భారత్‌ గురి

సమరోత్సాహంలో ఇతర జట్లు

ప్రైజ్‌మనీ విజేతకు: రూ.12 కోట్లు

రన్నరప్‌కు: రూ. 6 కోట్లు

సెమీస్‌లో ఓడిన జట్లకు: చెరి 3 కోట్లు


ధనాధన్‌ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. గత వారమే ముగిసిన ఐపీఎల్‌ ఎప్పటిలాగే క్రికెట్‌ ప్రేమికులను అలరించగా.. ఇప్పుడు అంతకు మించిన వినోదం పంచేందుకు ఏకంగా 12 జట్లు సిద్ధమవుతున్నాయి. ఒకటా.. రెండా.. ఐదేళ్ల తర్వాత జరగబోతున్న టీ20 ప్రపంచకప్‌ కోసం నువ్వా.. నేనా.. అనే రీతిలో సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి. ఫ్రాంచైజీ క్రికెట్‌లా కాకుండా ఆయా ఆటగాళ్లంతా తమ దేశం కోసం మెరుపులు మెరిపించాలనుకుంటున్నారు. అటు మన ఫ్యాన్స్‌ కూడా ఇప్పుడు కోహ్లీ టీమ్‌.. రోహిత్‌ టీమ్‌.. రాహుల్‌ టీమ్‌ అని కాకుండా అంతా జయహో.. టీమిండియా అనేందుకు ఆత్రుతగా ఉన్నారు. ఇక భారత్‌ ఖాతాలో రెండో టైటిల్‌ పడుతుందా? లేక వెస్టిండీస్‌ చాంపియన్‌ హోదాను నిలబెట్టుకుంటుందా? అటు ఆసీస్‌.. కివీస్‌ ఈసారైనా బోణీ కొడతాయా అనేది వేచి చూడాల్సిందే.. 


దుబాయ్‌: రెండేళ్లకోసారి అట్టహాసంగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ ఈసారి ఐదేళ్ల విరామం తీసుకుంది. 2016లో చివరిసారి భారత్‌లో జరిగిన ఈ టోర్నీలో వెస్టిండీస్‌ విజేతగా నిలిచింది. తాజా టోర్నమెంట్‌ శనివారం నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీ్‌స-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ తలపడతాయి. ఈ కప్‌ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు. ఐపీఎల్‌-14 సీజన్‌ కూడా అక్కడే జరిగిన విషయం తెలిసిందే. ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ దగ్గరే ఉన్నాయి. దుబాయ్‌, షార్జా, అబుధాబిలలో 33 మ్యాచ్‌లు జరుగుతాయి. 


టోర్నీ జరిగేది ఇలా..:

ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్‌-12 పేరిట శనివారం నుంచి జరుగుతాయి. ఇందులో ఆరేసి జట్లతో రెండు గ్రూపులుండగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-8గా నిలిచిన జట్లు ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్‌లో అర్హత మ్యాచ్‌లు జరిగాయి. వీటి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు స్కాట్లాండ్‌, నమీబియా జట్లు గ్రూప్‌ 1, గ్రూప్‌ 2లో చేరాయి. ఇక అసలు సమరంలో ఒక్కో గ్రూప్‌లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్‌-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి. ఇందులో విజేతలు టైటిల్‌ కోసం నవంబరు 14న దుబాయ్‌లో బరిలోకి దిగుతాయి.


ఫేవరెట్‌ భారత్‌:

బరిలోకి దిగేది 12 జట్లయినా టైటిల్‌ ఫేవరెట్లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్‌పను ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్‌గా టీమ్‌ను వెనకుండి నడిపించబోతున్నాడు. ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌.. రోహిత్‌, విరాట్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రాలాంటి మ్యాచ్‌ విన్నర్లతో ఊపు మీద కనిపిస్తోంది. 2016 మెగా టోర్నీ తర్వాత భారత్‌ ఈ ఫార్మాట్‌లో 72 మ్యాచ్‌లాడింది. 65.3 విజయాల శాతంతో 47 గెలుపులు, 22 ఓటములతో మెరుగ్గానే కనిపిస్తోంది. ఇక టీ20 ప్రపంచక్‌పలోనూ ఆడిన 33 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది. అదీగాకుండా కోహ్లీ ఆధ్వర్యంలో భారత జట్టు చివరి టీ20 టోర్నీ ఆడబోతోంది. ఈ కప్‌ను అతడికి కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో సహచరులున్నారు.


గట్టి పోటీ తప్పదు..:

భారత్‌తో పాటు వెస్టిండీస్‌, పాక్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌కు కూడా కప్‌ను గెలుచుకునే సత్తా ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ విండీస్‌ ఖాతాలో ఇప్పటికే రెండు కప్‌లున్నాయి. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టు కూడా ఇదే. పొట్టి ఫార్మాట్‌లో విధ్వంసకర ఆటగాళ్లు గేల్‌, పొలార్డ్‌, రస్సెల్‌, పూరన్‌, హెట్‌మయెర్‌, సిమ్మన్స్‌, బ్రావో ఇలా అంతా ఒకే జట్టులో ఉండడం ప్రత్యర్థికి వణుకు పుట్టించే విషయమే. అందుకే ఏ జట్లయినా విండీ్‌సను తక్కువగా అంచనా వేస్తే బోల్తా పడడం ఖాయం. కానీ నిలకడ లోపమే వీరికి శాపంగా మారింది. ఒకవేళ సమష్టిగా రాణిస్తే మాత్రం హ్యాట్రిక్‌ సాధించడం కరీబియన్లకు కష్టమేం కాదు. మరోవైపు ఐదు వన్డే వరల్డ్‌క్‌పలు సాధించిన ఆస్ట్రేలియాను ఈ ఽధనాధన్‌ కప్‌ మాత్రం ఊరిస్తూనే ఉంది. అలాగే న్యూజిలాండ్‌కు కూడా అదృష్టం కలిసి రాలేదు. కానీ 2009లో టైటిల్‌ సాధించిన మూడో ర్యాంకర్‌ పాకిస్థాన్‌ పటిష్టంగానే ఉంది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లో ఉండడం లాభించే అంశం. టీ20 నెంబర్‌వన్‌ జట్టు ఇంగ్లండ్‌ కూడా తమ రెండో ట్రోఫీపై కన్నేసింది.



Updated Date - 2021-10-23T07:38:24+05:30 IST