చివరి అవకాశం

ABN , First Publish Date - 2021-10-20T07:54:55+05:30 IST

చిరకాల శత్రువు పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి ముందు భారత జట్టు తమ అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు ఇదే చివరి అవకాశం.

చివరి అవకాశం

బ్యాటింగ్‌ ఆర్డర్‌పై దృష్టి 

నేడు ఆసీస్‌తో భారత్‌ వామప్‌ మ్యాచ్‌

దుబాయ్‌: చిరకాల శత్రువు పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి ముందు భారత జట్టు తమ అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు ఇదే చివరి అవకాశం. టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా నేడు తమ రెండో వామప్‌ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడబోతోంది. ఈనెల 24న పాకిస్థాన్‌తో పోరుతో టీమిండియా ఈ మెగా టోర్నీని ఆరంభించనుంది. అయితే దానికన్నా ముందు కోహ్లీ సేనకు ఇది చివరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌. ఈ నేపథ్యంలో తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎలా ఉండాలనే విషయంపై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఎందుకంటే మెగా టోర్నీకి తుది జట్టును ఖరారు చేసే విషయంలో ఈ మ్యాచే కీలకం కానుంది. 


జోష్‌లో బ్యాటర్స్‌:

సోమవారం జరిగిన తొలి వామ్‌పలో ఇంగ్లండ్‌పై భారత బ్యాటర్స్‌ అదరగొట్టడం సానుకూలాంశం. కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఐపీఎల్‌లో అద్భుతంగా సాగిన వీరి జోరు ఇక్కడా కొనసాగించడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను సంతోషంలో ముంచెత్తింది. కెప్టెన్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక మెగా ఈవెంట్‌లో  రోహిత్‌తో కలిసి రాహుల్‌ ఓపెనర్‌గా వస్తాడని చెప్పడంద్వారా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పటికే స్పష్టతనిచ్చాడు.


వన్‌డౌన్‌లో తానే వస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు. ఇక ఇంగ్లండ్‌పై ఇషాన్‌ కిషన్‌ 70 పరుగుల తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని  కూడా తుది జట్టులో ఆడించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అదే జరిగితే సూర్యకుమార్‌ను బెంచీకి పరిమితం చేయాల్సి వస్తుందేమో. ఇక తొలి వామ్‌పకు దూరంగా ఉన్న రోహిత్‌ను ఆసీ్‌సపై బరిలోకి దించనున్నారు. బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌ పాండ్యాను కేవలం బ్యాటర్‌గానే పరిగణిస్తారా? అనేది చూడాల్సిందే. అదే జరిగితే ఆరో బౌలర్‌ సేవలను జట్టు కోల్పోయినట్టే. మరోవైపు బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, షమి ఆకట్టుకోగా, పేసర్‌ భువనేశ్వర్‌, స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ తేలిపోయారు. వీరి బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ ధారాళంగా పరుగులు రాబట్టారు. అందుకే ఆసీ్‌సతో మ్యాచ్‌లో జడేజా, వరుణ్‌ చక్రవర్తి, శార్దూల్‌ ఠాకూర్‌లను పరీక్షించనున్నారు.


మిడిలార్డర్‌ మెరుగైతేనే..

ఆస్ట్రేలియా కూడా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తమ తొలి వామప్‌ మ్యాచ్‌లో కివీ్‌సపై చివరి ఓవర్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది. అయితే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేలవ ఫామ్‌ ఇక్కడా కొనసాగి డకౌటయ్యాడు. అటు మిడిలార్డర్‌ కూడా విఫలమైంది. టెయిలెండర్లు అగర్‌, స్టార్క్‌, ఇంగ్లిస్‌ వేగం కారణంగానే చివర్లో గట్టెక్కింది. అయితే బౌలింగ్‌లో ఆడమ్‌ జంపా, రిచర్డ్‌సన్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. 

Updated Date - 2021-10-20T07:54:55+05:30 IST