Abn logo
Oct 17 2021 @ 02:32AM

ధనాధన్‌ సమరం

నేటినుంచే టీ20 వరల్డ్‌కప్‌ అర్హత మ్యాచ్‌లు

23 నుంచి ప్రధాన టోర్నమెంట్‌

దుబాయ్‌: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధనాధన్‌ క్రికెట్‌ రానే వచ్చింది. ఆదివారం నుంచి జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లతో టీ20 వరల్డ్‌కప్‌కు తెర లేవనుంది. నవంబరు 14న ఫైనల్‌ ఫైట్‌ జరగనుంది. మొత్తం 16 జట్లు పాల్గొనే పొట్టి వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఒమన్‌లో ఈనెల 17 నుంచి జరగనున్నాయి. రెండు గ్రూప్‌లుగా తలపడే 8 జట్లలో ప్రతి గ్రూప్‌ నుంచి టాప్‌-2గా నిలిచిన జట్లు 23 నుంచి జరిగే సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. అంటే ప్రధాన టోర్నమెంట్‌ ‘సూపర్‌ పోరు’తో మొదలవనుంది. సూపర్‌-12 ఫైట్‌ ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో ఆరంభం కానుంది. 


బంగ్లాతో స్కాట్లాండ్‌.. న్యూగినియాతో ఒమన్‌

క్వాలిఫయర్‌ టోర్నీలో భాగంగా గ్రూప్‌-బిలో ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో ఒమన్‌తో పపువా న్యూగినియా (పీఎన్‌జీ) జట్టు ఆడనుంది. ఇదే గ్రూప్‌లో జరిగే మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్‌ తలపడనుంది. ఇటీవలి కాలంలో పసికూనలనే ముద్రను చెరిపేసుకుంటున్న బంగ్లా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కాగా, కరోనాతో వణికిపోతున్న దేశ ప్రజల్లో సంతోషం తీసుకురావాలనే ఉద్దేశంతో న్యూగినియా ఈ టోర్నీలో పోటీపడుతోంది. అయితే, సొంతగడ్డపై సంచలనం సృష్టించాలని ఒమన్‌ పట్టుదలతో ఉంది. 


టాప్‌-8 జట్ల వామప్‌ మ్యాచ్‌లు రేపటినుంచి.. 

అగ్రశ్రేణి జట్ల వామప్‌ మ్యాచ్‌లు ఈ నెల 18, 20న జరగనున్నాయి. సోమవారం జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌.. బుధవారం ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడనుంది.