కొండ.. గుల్ల!

ABN , First Publish Date - 2021-12-03T23:55:34+05:30 IST

ప్రకృతి సంపద అక్రమార్కుల చేతిలో హరించుకుపోతోంది.

కొండ.. గుల్ల!
.గ్రావెల్‌ తవ్వకాలతో కనుమరుగైపోతున్న లాం కొండ

లాం కొండ.. హాం ఫట్‌!

యథేచ్ఛగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు

పర్మిషన్ల పేరుతో కొల్లగొడుతున్నారు.. 

రాత్రి వేళలో కొండకు ఇరు వైపులా తవ్వి తరలింపు

ప్రకృతి సంపదను కాపాడాలంటున్న స్థానికులు


తాడికొండ, డిసెంబరు 2: ప్రకృతి సంపద అక్రమార్కుల చేతిలో హరించుకుపోతోంది. పర్మిషన్ల పేరుతో ప్రకృతి సంపదను అప్పనంగా దోచుకుని రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్‌ సంపదకు తాడికొండ మండలం లాం ప్రాంతం కేంద్రం. ఇది రాజధాని ప్రాంతానికి కూతవేటు ఉంది. దీంతో తాడికొండ మండలం సహా గుంటూరు నగరంలో ప్రైవేటు వెంచర్ల అభివృద్ధికి ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రావెల్‌ను తవ్వి తరలించడాన్ని కొందరు పెద్ద ఆదాయవనరుగా మలుచుకున్నారు. దీనికి తోడు అధికారపార్టీ నేత అండదండలతో గ్రావెల్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకునే వారే లేకపోవడంతో ఇష్టానుసారం కొండను కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. ఇప్పటికే వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను తవ్వుతున్నారు. 

 ఈ గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి ఓ ప్రజాప్రతినిధి నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వాటాలు వెళుతున్నట్లు సమాచారం. ట్రాక్టర్‌కు సీనరేజ్‌ రూ.1,300, టిప్పర్‌కు రూ.2,600, పెద్ద టిప్పర్‌కు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. లాం- తాతారెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండపై ఉన్న గ్రావెల్‌ను గుల్ల చేస్తున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మైనింగ్‌ అధికారులు కంటితుడుపుగా తనిఖీలు చేపడుతున్నారు. దాడులు నిర్వహించిన తనిఖీలు చేపడుతున్నారు. రోజుల తరబడి కొండపై ఉన్న గ్రావెల్‌ను తవ్వతుంటే పచ్చదనం అంతా కనుమరుగైపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రావెల్‌ తవ్వకాలను నిలుపదల చేసి ప్రకృతి సంపదను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Updated Date - 2021-12-03T23:55:34+05:30 IST