తగ్గేదేలే...

ABN , First Publish Date - 2022-01-29T06:21:14+05:30 IST

ఆంక్షల అయోమయం నుంచి అన్నదాతలు యాసంగి సాగు బాట పట్టారు. ఈ సారి దొడ్డు బియ్యం కొనుగోలు ఉండదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వరి వద్దని ప్రచారం చేసింది. పంట మార్పిడిపై ఊరురా అవగాహన సదస్సులు నిర్వహించింది.

తగ్గేదేలే...

 - వద్దన్నా వరిసాగు 

- యాసంగిలో అన్నదాతలు బిజీబిజీ 

- లక్ష ఎకరాల్లో వరినాట్లు

- ఇప్పటికే 52,259 ఎకరాల్లో పూర్తి 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆంక్షల అయోమయం నుంచి అన్నదాతలు యాసంగి సాగు బాట పట్టారు.  ఈ సారి  దొడ్డు బియ్యం కొనుగోలు ఉండదని కేంద్ర ప్రభుత్వం   ఆంక్షలు విధించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వరి వద్దని ప్రచారం చేసింది. పంట మార్పిడిపై ఊరురా అవగాహన సదస్సులు  నిర్వహించింది. మరోవైపు కేంద్రం తీరుపై అధికార పక్షం ఆందోళనల మధ్య రైతులు యాసంగి సాగును కొంత ఆలస్యంగా మొదలు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంక్షలు దాటి వరి సాగువైపే మొగ్గు చూపారు. ప్రభుత్వం వద్దంటూ యాసంగిలో వడ్లు కొనబోమని స్పష్టంగా చెప్పినా జిల్లా రైతులు మాత్రం వరి జోరునే పెంచారు. కొద్దిమేరకు మాత్రమే తగ్గించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత యాసంగిలో 1.73 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అందులో వరి 1.67 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ సారి 1.10 లక్షల ఎకరాల వరకు వరి సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్ష ఎకరాల వరకు నారుమడులు సిద్ధం చేసుకొని నాట్లు ప్రారంభించారు. ఇతర పంటలు కలిపి లక్ష 30 వేల వరకు సాగు చేస్తారని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 55,814 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. అందులో 52,259 ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి చివరి వరకు వరి లక్ష ఎకరాలు దాటుతుందని అంచనా వేశారు. ఇందులో గంభీరావుపేట మండలంలో 3250 ఎకరాలు, ఇల్లంతకుంట 4350 ముస్తాబాద్‌ 5500, సిరిస్లిల 750, తంగళ్లపల్లి 6100, వీర్నపల్లి 3100, ఎల్లారెడ్డిపేట 5500, బోయినపల్లి,  7300, చందుర్తి 1250, కోనరావుపేట 9159, రుద్రంగి 200, వేములవాడ 1800, వేములవాడ రూరల్‌ 4వేల  ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మరో 50 వేల ఎకరాలకు నారుమడులు సిద్ధంగా ఉన్నాయి. పొలాల్లో నాట్లు వేస్తుండడంతో జిల్లా మళ్లీ పచ్చగా కళకళలాడుతోంది. జిల్లాలో సమృద్ధిగా ఉన్న జలాలకు తోడు భారీ వర్షాల కారణంగా భూములు బురదగా మారడంతోనే ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లడం లేదని రైతులు చెబుతున్నారు.ప్రభుత్వం పంట కొనుగోలు చేయకుంటే  ఎలా అనే సందిగ్ధంలో ఉన్నారు. 

ఆరుతడి నామమాత్రమే 

జిల్లా రైతులను యాసంగిలో పంట మార్పిడి వైపు మళ్లించాలని వ్యవసాయ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినా రైతులు మాత్రం ఆరుతడి పంటల వైపు నామమాత్రంగానే స్పందించారు.  జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 3255 ఎకరాల్లో మాత్రమే అరుతడి పంటలు వేసుకున్నారు. కొద్దిమేరకే ఫిబ్రవరిలో పంటలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

జిల్లాలో అరుతడి పంటల్లో జొన్న 208.14 ఎకరాలు, మొక్కజొన్న 765.11,  గోధుమలు 80.35, శనగలు 610.04, పెసర్లు 249.01, మినుములు 291.17, వేరుశనగ 319.17, నువ్వులు 212.31, పొద్దు తిరుగుడు 537.21, కుసుమలు 42.29, ఆవాలు 51.09, చెరుకు 68.18, బబ్బెర్లు 82.23, ఇతర పంటలు 39.46 ఎకరాల్లో సాగు చేశారు. మరోవైపు యాసంగి పనుల్లో బిజీగా ఉన్న రైతులను వాతావరణంలోని మార్పులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చలిగాలులతో సాగు పనుల్లో అవస్థలు పడుతున్నారు. 


Updated Date - 2022-01-29T06:21:14+05:30 IST