పోరాడినా.. పోయింది!

ABN , First Publish Date - 2021-10-10T07:30:39+05:30 IST

స్వల్ప స్కోరును కాపాడుకోవడానికి భారత బౌలర్లు తుదికంటా ప్రయత్నించినా.. తీవ్ర ఉత్కంఠ మధ్య ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ తహ్లియా మెక్‌గ్రాత్‌ (42 నాటౌట్‌) సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టింది.

పోరాడినా.. పోయింది!

రెండో టీ20లో భారత్‌ ఓటమి

4 వికెట్లతో ఆసీస్‌ గెలుపు

గోల్డ్‌ కోస్ట్‌: స్వల్ప స్కోరును కాపాడుకోవడానికి భారత బౌలర్లు తుదికంటా ప్రయత్నించినా.. తీవ్ర ఉత్కంఠ మధ్య ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ తహ్లియా మెక్‌గ్రాత్‌ (42 నాటౌట్‌) సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టింది. దీంతో శనివారం జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 4 వికె ట్ల తేడాతో నెగ్గింది. 119 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజేశ్వరి గైక్వాడ్‌ (3/21) మూడు వికెట్లు పడగొట్టింది. ఆఖరి, మూడో టీ20 ఆదివారం జరగనుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 118/9 పరుగులు చేసింది.


ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (3), జెమీమా రోడ్రిక్స్‌ (7) వికెట్లను చేజార్చుకొన్న టీమిండియా 24/3తో ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (28) ఫర్వాలేదనిపించినా.. యువ క్రికెటర్లు యాస్తిక (8), రిచా ఘోష్‌ (2) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. దీంతో 17 ఓవర్లలో 81/9తో నిలిచిన భారత్‌కు.. పూజా వస్త్రాకర్‌ (37 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తో గౌరవప్రద స్కోరును అందించింది. ఛేదనలో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీ్‌సకు వెన్నులో వణుకు పుట్టించారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ అలిస్సా హీలే (4)ను శిఖా పాండే బౌల్డ్‌ చేసింది. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (34), కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (15)ను రాజేశ్వరీ గైక్వాడ్‌ అవుట్‌ చేసి షాకిచ్చింది. అయితే, తహ్లియా జాగ్రత్తగా ఆడి మరో 5 బంతులు మిగిలుండగానే ఆసీ్‌సను గెలిపించింది. 


శిఖా.. వండర్‌ బాల్‌

పేసర్‌ శిఖా పాండే.. ఓ అద్భుతమైన డెలివరీతో క్రికెట్‌ ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండ్రీకి తరలించిన అలిస్సా హీలేను రెండో బంతికే శిఖా క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. ఫుల్‌ లెంగ్త్‌లో పడిన బంతి అనూహ్య రీతిలో కట్‌ అయి.. హీలే డిఫెన్స్‌ను ఛేదిస్తూ వికెట్లను గిరాటేసింది. ఈ అనూహ్య పరిణామానికి హీలే విస్తుబోయింది. ఎక్కడో పిచ్‌ అయిన బంతి.. ఒక్కసారిగా లోపలికి రావడంతో ఎలా ఆడాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ట్విటర్‌లో కూడా ఈ వీడియో క్లిప్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది.


సంక్షిప్త స్కోర్లు

 భారత్‌: 20 ఓవర్లలో 118/9 (పూజా వస్త్రాకర్‌ 37 నాటౌట్‌, హర్మన్‌ప్రీత్‌ 28; మోలినెక్స్‌ 2/11, టైలా వాలెమ్నిక్‌ 2/18); ఆస్ట్రేలియా: 19.1 ఓవర్లలో 119/6 (తహ్లియా 42 నాటౌట్‌, బెత్‌ మూనీ 34; రాజేశ్వరి 3/21). 

Updated Date - 2021-10-10T07:30:39+05:30 IST