‘తాసిల్దారుగారి అమ్మాయి’కి 50 ఏళ్లు

నటభూషణ శోభన్‌బాబు 1965లో వచ్చిన ‘వీరాభిమన్యు’ చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఆయనకు సరైన బ్రేక్‌ ఇచ్చింది మాత్రం 1971వ సంవత్సరమే అని చెప్పాలి. ఆ ఏడాది ఆయన హీరోగా నటించిన 16 చిత్రాలు విడుదల కావడం విశేషం. ఇవన్నీ విభిన్న కథాంశాలతో రూపుదిద్దుకొన్న చిత్రాలే.  వీటిల్లో ‘కల్యాణ మండపం’, ‘తాసిల్దారుగారి అమ్మాయి’, ‘చెల్లెలి కాపురం’  వంటి చిత్రాలు నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. మరీ ముఖ్యంగా ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. 2021 నవంబర్‌ 12 కు ఈ చిత్రం విడుదలై 50 ఏళ్లు. హీరోగా ఎదుగుతున్న తరుణంలో విడుదలైన ఈ చిత్రంలో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా వైవిధ్యం కలిగిన ఆ రెండు పాత్రలను అద్భుతంగా పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు ‘పొట్టి ప్లీడరు’ చిత్రంలో ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసినా ఆ రెండు పాత్రలకు అంత ప్రాధాన్యం లేదని చెప్పాలి. ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రంలో నటించే నాటికి ఆయన వయసు 34 ఏళ్లు. శోభన్‌బాబు ఆ రెండు పాత్రలు చెయ్యగలడా అనే సందేహం చాలామంది వ్యక్తం చేసినప్పటికీ పట్టుదల వహించి, ఎంతో హోంవర్క్‌ చేసి ఆ పాత్రలకు న్యాయం చేకూర్చి నటుడిగా తనకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని నిరూపించుకున్నారు. అంతేకాదు ఆ ఏడాది ఫిలింఫేర్‌ ఉత్తమ నటుడిగా కూడా ఆయన అవార్డు అందుకున్నారు.

సత్యచిత్ర తొలి చిత్రం 

కావిలిపాటి విజయలక్ష్మి రచించిన ‘విధివిన్యాసాలు’ నవల ఈ సినిమాకు మూలం. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ఈ నవల ఎంతోమంది పాఠకులను ఆకట్టుకుంది. వాళ్లలో సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ కూడా ఉన్నారు. అయితే వాళ్లు అప్పటికి చిత్ర రంగప్రవేశం చేయలేదు. సినిమా తీయాలనే ఆలోచన కూడా వాళ్లకి ఆ సమయంలో లేదు. పరిశ్రమలోకి అడుగుపెట్టకపోయినప్పటికీ వీళ్ల మిత్రులు చాలామంది వివిధ శాఖల్లో ఉన్నారు. కావిలిపాటి విజయలక్ష్మి దగ్గర హక్కులు కొన్న సత్యనారాయణ, సూర్యనారాయణ సినిమా తీయాలనే ఆలోచనతో పరిశ్రమలో ఉన్న తమ మిత్రుడు గిరిబాబు (ఆర్టిస్టు కాదు) ద్వారా దర్శకుడు కె.ఎస్‌. ప్రకాశరావుని సంప్రదించారు. ఆయన వీరి ప్రయత్నాన్ని అభినందించి, సినిమా చేయడానికి అంగీకరించారు. కథ బాగా నచ్చడంతో ట్రీట్‌మెంట్‌ తయారు చేయడానికి ఆయన చాలా సమయం తీసుకున్నారు. ఈ చిత్రానికి డైలాగ్‌ రైటర్‌గా ఎన్‌.ఆర్‌. నంది పేరు వేసినా ఎక్కువ భాగం డైలాగులు ప్రకాశరావే రాశారు.


ఒకే సమయంలో ‘ప్రేమ్‌నగర్‌’, ‘తాసిల్దారుగారి అమ్మాయి’

అక్కినేని నటించిన ‘ప్రేమనగర్‌’ షూటింగ్‌, శోభన్‌బాబు నటించిన ‘తాసిల్దారుగారి అమ్మాయి’ షూటింగ్ ఒకే సమయంలో.. ఒకదాని తరువాత ఒకటి జరిగేవి. ‘ప్రేమ్‌నగర్‌’ భారీ తారాగణంతో, రంగుల హంగులతో రూపుదిద్దుకుంటే, ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం సాదాసీదాగా ఎలాంటి హంగులు ఆర్భాటం లేకుండా తయారైంది. అది పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా అనే తేడా లేకుండా రెండింటి విషయంలోనూ దర్శకుడు కె.ఎస్‌.ప్రకాశరావు   ప్రత్యేక శ్రద్ధ వహించారు కనుకే రెండూ విజయం సాధించాయి. ‘తాసిల్దారుగారి అమ్మాయి’ సినిమాకి ఆయన తనయుడు కె. రాఘవేంద్రరావు అసోసియేట్‌గా పనిచేయడం గమనార్హం. 


టైటిల్‌ పాత్రలో జమున 

ఈ సినిమాలో టైటిల్‌ పాత్రను జమున పోషించారు. అప్పటికే ఆమె అగ్ర కథానాయిక. శోభన్‌బాబు సరసన నటించడం అదే ప్రథమం. నిర్మాతలు కొత్త వారయినప్పటికీ కె.ఎస్‌.ప్రకాశరావు అడగటంతో ఆమె కాదని చెప్పలేకపోయారు. 1971 మార్చి నెలలో జరిగిన ప్రారంభోత్సవానికి నాగిరెడ్డి, చక్రపాణి సహా పలువురు ప్రముఖులు హాజరుకావడంతో జమున ఆశ్చర్యపోయారట... కొత్త నిర్మాతలకు ఇంత సర్కిల్‌ ఉందా అని. ఈ సినిమాలో  మరో కథానాయికగా చంద్రకళ నటించారు. నాగభూషణం, రాజబాబు, నిర్మల, పుష్పకుమారి, వరలక్ష్మి (జూ), ఝాన్సీ, సాక్షి రంగారావు ఇతర ముఖ్య పాత్రధారులు.

 

ఆరు కేంద్రాల్లో వంద రోజులు 

‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం నిర్మాణంలో ఉన్న సమయానికి కలర్‌ చిత్రాలు రాజ్యం ఏలుతున్నాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి సన్నగిల్లుతున్న తరుణం అది. అటువంటి పరిస్థితుల్లో ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తయారై ప్రేక్షకుల ఆదరణ పొందడం విశేషం. కండెక్టర్‌ కొడుకు కలెక్టర్‌ కావడం, భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, ఏళ్ల విరామం అనంతరం వాళ్లు తిరిగి కలుసుకోవడం... ఇటువంటి కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. హైదరాబాద్‌ శాంతి థియేటర్‌లో 75 రోజులు, సాగర్‌ థియేటర్‌లో 25 రోజులు సింగిల్‌ షిఫ్ట్‌ మీద వంద రోజులు ఆడింది. ఈ సినిమా విజయం మరికొన్ని సినిమాలకు స్పూర్తినిచ్చిందంటే అతిశయోక్తి కాదు.

అక్కినేని ప్రశంస

రాజమండ్రిలో జరిగిన ఈ చిత్ర శతదినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు.. శోభన్‌బాబు నటనని ప్రత్యేకంగా అభినందించి ‘ఫ్యూచర్‌ హోప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ’ అని కితాబు ఇచ్చారు. అనుకోకుండా చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ, సూర్యనారాయణ నాలుగేళ్లు విరామం తీసుకుని మళ్లీ శోభన్‌బాబే హీరోగా ‘ప్రేమబంధం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ హీరోగా వీళ్లు నిర్మించిన ‘అడవిరాముడు’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ అయింది.

- వినాయకరావు 

Advertisement
Advertisement