పట్టా భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-01-19T07:18:50+05:30 IST

పట్టా భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయరావు డిమాండ్‌ చేశారు.

పట్టా భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోండి
పెట్టెలో అర్జీని వేస్తున్న బాధితుడు

దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

‘స్పందన’ రద్దన్నా కలెక్టరేట్‌కొచ్చిన బాధితులు


చిత్తూరు, జనవరి 18: పట్టా భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయరావు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పెట్టెలో సోమవారం అర్జీని వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరులోని ఇరువారం దళితవాడకు చెందిన సులోచనకు సర్వే నెంబరు 323-1లో 1.64 ఎకరాల భూమి ఉందన్నారు. నీవానదిలో నీళ్లు పొలాలపై రావడంతో పంటలు వేయలేదన్నారు. దాంతో నదిలో శవాలను వేయడానికి దారి కోసం సులోచన పట్టా భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. పైగా పంటలు పెడితే తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈవిషయపై పలుమార్లు పోలీసులు, రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. విచారించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  2007లో అవసరం నిమిత్తం తమ గ్రామానికి చెందిన గురురాజ వద్ద భూమిని తాకట్టు పెట్టి రూ.1.90 లక్షలు అప్పు తీసుకున్నానని పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం తెలిపాడు. మూడేళ్ల తర్వాత అప్పు చెల్లించడానికి వెళితే.. అప్పటికే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని ఆయనపై రిజిస్టర్‌ చేసుకున్నాడని వాపోయాడు. దీనిపై గ్రామంలో పంచాయితీ పెడితే రూ.30లక్షలు ఇవ్వాలని.. ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. విచారించి, న్యాయం చేయాలని కోరాడు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు  చేసినా, పలువురు బాధితులు కలెక్టరేట్‌కొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన పెట్టెలో అర్జీలను వేసి, వెనుదిరిగారు.  

Updated Date - 2021-01-19T07:18:50+05:30 IST