సెక్యూరిటీ తీసేసి రా... ఒకే దెబ్బ!

ABN , First Publish Date - 2021-11-26T09:12:58+05:30 IST

సెక్యూరిటీ తీసేసి రా... ఒకే దెబ్బ!

సెక్యూరిటీ తీసేసి రా... ఒకే దెబ్బ!

నిన్ను తొక్కుకుంటూ విజయవాడ వెళతా

చచ్చిన శవానివి.. జడ్‌ కేటగిరీ ఎందుకు?

పబ్లిసిటీ కోసం భార్యనూ రోడ్డుపైకి..

రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు

వరద పర్యటనల్లోనూ నీ ఏడుపేనా?

జూనియర్‌ ఎన్టీఆర్‌ చెబితే వింటామా?

మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు


అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘నా సెక్యూరిటీ ఈకముక్కతో సమానం. ఇప్పుడే తీసేస్తా. చంద్రబాబును జెడ్‌ కేటగిరి సెక్యూరిటీ బ్లాక్‌ కమేండోలను తీసేసి రమ్మనండీ? చూసుకుందాం ఇద్దరం.. ఒకే ఒక దెబ్బ.. ఒక్కటే తన్ను. ఇక్కడి నుంచే చంద్రబాబు మీదుగా నడుచుకుంటూ వెళ్తా విజయవాడ’’ అంటూ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. తనకు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సెక్యూరిటీ పెంచిన అంశంపై గురువారం మాట్లాడుతూ మంత్రి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చచ్చినోడు.. ఎందుకూ పనికి రాని శవంతో లెక్కేసుకునే వ్యక్తికి జడ్‌ప్లస్‌ ఎందుకు?’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘వరదలపై సీఎం జగన్‌ వెంటనే స్పందించారు. అవసరమైన చర్యలను తీసుకుంటూ, ఇక్కడినుంచే అధికారులు, మంత్రులతో సమీక్షిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంత చేస్తున్న జగన్‌పై విమర్శలకు దిగుతున్న చంద్రబాబుకు అసలు బుద్ధి, జ్ఞానం లేవు. వయసొచ్చింది. ఎందుకు బతికున్నాడో కూడా తెలియదు.. రాజకీయ వ్యభిచారి. అసెంబ్లీ జరుగుతుంటే.. వైసీపీ శాసనసభ్యులు తన భార్యని అవమానించారంటూ ఏవేవో కుంటి, గుడ్డి సాకులు చెప్పి వెళ్లిపోయాడు. తన భార్యను ఎవరు ఏమన్నారో చెప్పడు. ఆవిడ పేరు మేం ఎత్తనే లేదని అసెంబ్లీలో చెప్పాం. ఆడు వాళ్ల ఆవిడ గురించి అల్లరి చేసుకుంటే... నేను క్షమాపణ చెప్పడమేంటి? ఎన్టీఆర్‌ కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ను(హీరో) వాడేసుకున్నాడు. చంద్రబాబు పెద్ద లోఫర్‌. ఆ విషయం ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు కూడా తెలుసు. అతను పిలిస్తే ఎవరూ పలకరు. అందుకని ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన తన భార్యని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఎన్టీఆర్‌ కుటుంబం, రాష్ట్ర ప్రజలు తనకు మద్దతిస్తారనే ఉద్దేశంతో ఓ రాజకీయ వ్యభిచారిలా వ్యవహరించాడు’’ అని విరుచుకుపడ్డారు. ‘‘లోకేశ్‌ గాడు పనికిమాలిన చవట దద్దమ్మ. తన తల్లిని అవమానించారని చెబుతున్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి భర్త దొరకడం, ఇటువంటి కొడుకు దొరకడం ఆవిడ దురదృష్టం’’ అని వ్యాఖ్యానించారు. వరద బాధితులను ఓదార్చడం, వారికి ధైర్యం చెప్పడం కాకుండా.. వారి ఎదుటా ఏడుపుముఖం పెట్టుకుని తన కుటుంబాన్ని అవమానించారని చెప్పడం ఏమిటని కొడాలి నాని ఆగ్రహించారు. జగన్‌ను వేధించిన సోనియా, లోకేశ్‌ నుంచి చంద్రబాబు దాకా అందరూ సర్వనాశనమైపోయారన్నారు. ‘‘నీకొడుకు మంగళగిరిలో ఓడిపోయి, సర్వనాశనమయ్యాడు. జగన్‌పై కేసు వేసిన ఎర్రన్నాయుడు ఏమయ్యాడో చూశాం. శంకర్రావు ఏమయ్యాడో చూశాం. జగన్‌పై దొంగ చార్జిషీట్లు పెట్టిన ఉద్యోగి (జేడీ లక్ష్మీనారాయణ) ఈ రోజు ఉద్యోగం మానేసి టీవీ చానల్‌ చుట్టూ తిరుగుతున్నాడు’’ అని అన్నారు. చనిపోయినా వైఎస్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారనీ, బతికున్నా చంద్రబాబుది కుక్క బతుకని మండిపడ్డారు. వరదలొచ్చినప్పుడు సీఎం ఆ ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదా అని ప్రశ్నించగా.. ఒక్కో సీఎం పనిపద్ధతి ఒక్కో రకంగా ఉంటుందని నాని అన్నారు. ‘‘అన్నీ కుదుటపడ్డాక వెళ్లి సీఎం పరామర్శిస్తారు. ఇవన్నీ రొటీన్‌. కానీ, చంద్రబాబుకి మాత్రం పబ్లిసిటీ పిచ్చి’’ అని పేర్కొన్నారు. ‘‘పుష్కరాల్లో గేట్లు మూసేసి, బోయపాటి శ్రీను కెమేరాలు పెట్టి, యాక్షన్‌ అంటూ గేట్లెత్తి 32మందిని చంపిన వ్యక్తి చంద్రబాబు. ఆయనపై ఏ న్యాయ విచారణ జరపాలి? ఉరెయ్యాలా లేదంటే కింద పడేసి, తొక్కి చంపాలా?’’ అని కొడాలి నాని మండిపడ్డారు.


ఎన్టీఆర్‌ చెబితే వింటామా?

తన శిష్యులైన నాని, వంశీని కట్టడి చేయాల్సిన బాధ్యత జూనియర్‌ ఎన్టీఆర్‌కు లేదా అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ... ‘‘ఎన్టీఆర్‌ చెబితే మేమెందుకు వింటాం? ఆయన ఎందుకు మమ్మల్ని కట్టడి చేస్తాడు? మేమేమైనా బాకీనా? ఆయన ప్రొడ్యూసర్లమా? డైరెక్టర్లమా? ఎలా కట్టడి చేస్తాడు? ఒకప్పుడు కలిసుంటే ఉన్నాం. విభేదాలొచ్చాయి. బయటకొచ్చాశాం. మేం జగన్‌తో, వైసీపీలో ఉన్నాం. మా నేత జగన్‌. ఆయన ఏది చెప్పినా చేస్తాం.. చెప్పకపోయినా చేస్తాం. చంద్రబాబు శిష్యులు ఆయన మాట వింటున్నారా? స్పీకర్‌, రోజా, తలసాని శ్రీనివాస్‌ ఎవరి శిష్యులు? వీడిని అమ్మనా బూతులు తిడతున్నారు కదా?’’ అని అన్నారు. వర్ల రామయ్య పంచాయతీ వార్డు మెంబర్‌గా కూడా గెలవడు’’ అని దుయ్యబట్టారు.

Updated Date - 2021-11-26T09:12:58+05:30 IST