పీఎం కిసాన్ సమ్మాన్ పట్టదా?: మమతకు గవర్నర్ లేఖ

ABN , First Publish Date - 2020-08-10T23:06:38+05:30 IST

పశ్చిమబెంగాల్ రైతులు కోల్పోతున్న ప్రయోజనాలను వారికి కల్పించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ..

పీఎం కిసాన్ సమ్మాన్ పట్టదా?: మమతకు గవర్నర్ లేఖ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రైతులు కోల్పోతున్న ప్రయోజనాలను వారికి కల్పించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాశారు.


'పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు 70 లక్షల మంది రైతులకు అందకుండా పోవడం బాధాకరం. రాష్ట్రంలోని రైతులు ఇప్పటి వరకూ తమకుదక్కాల్సిన రూ.8,400 కోట్లు కోల్పోయారు' అని ఆ లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం, ప్రతిఘటనా వైఖరి కారణంగా రైతులు తమకు దక్కాల్సిన ప్రయోజనాలను పొందలేకపోతున్నారని అన్నారు. పీఎం కిసాన్ పథకం కేంద్ర పథకమని, 100 శాతం నిధులు భారత ప్రభుత్వమే ఇస్తుందని, 2018 నుంచి డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులైన రైతుల అకౌంట్లకు నేరుగా డబ్బులు జమ అవుతాయని అన్నారు.


'రాష్ట ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఎందుకు కాలహరణ చేస్తోందో నాకు అర్ధం కావడం లేదు. ప్రజలకు, ముఖ్యంగా రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలు వారికి దక్కకపోవడం చారిత్రక అన్యాయమే అవుతుంది' అని గవర్నర్ ఆ లేఖలో స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు ఇంతవరకూ రూ.92,000 కోట్లు అందుకున్నారని, మన (బెంగాల్) రాష్ట్రానికి మాత్రం ఇంతవరకూ ఎలాంటి సొమ్ములు రాలేదని, ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని తగిన సవరణలు చేపట్టాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూడాలని గవర్నర్ ఆ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

Updated Date - 2020-08-10T23:06:38+05:30 IST