Sep 22 2021 @ 00:59AM

‘రౌడీ బాయ్స్‌’కు మరొకర్ని తీసుకుంటే ధర్నా చేసేవాణ్ణి!

‘‘ఆశిష్‌ చిత్రానికి సంగీతమందించడం నా బాధ్యత. మరొక సంగీత దర్శకుణ్ణి తీసుకుని ఉండుంటే... వాళ్లింటి ముందు ధర్నా చేసేవాణ్ణి. ఐదేళ్లకో, పదేళ్లకో యువతరం సినిమా వచ్చి సంచలనం సృష్టిస్తుంది. అలాంటి చిత్రమిది. తొలి చిత్రానికే ఆశిష్‌ గొప్పగా నటించాడు. విక్రమ్‌ పోటాపోటీగా చేశాడు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా హర్ష సినిమా తీశాడు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. ‘దిల్‌’ రాజు సోదరుని(శిరీష్‌) తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మాతలు. సోమవారం టీజర్‌ విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ ‘‘కథ విన్నాక దేవిశ్రీ ప్రసాద్‌ ఏ సందర్భంలో పాట ఉండాలి? ఎలా ఉండాలి? అని పలు జాగ్రత్తలు తీసుకుని సంగీతం అందించాడు. యువతకు కావాల్సిన అంశాలన్నీ చిత్రంలో ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యాక పక్కింటి కుర్రాడిలా ఉన్నాడని, పాట విడుదలయ్యాక డ్యాన్సులు బాగా చేశాడని ఆశిష్‌ను ప్రశంసించారు. తను, విక్రమ్‌ బాగా చేశారు. దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘సినిమాలో తొమ్మిది పాటలకు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి’’ అని హర్ష అన్నారు. ‘‘నా లుక్‌ విషయంలో మా అక్క హన్షిత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తనకు థ్యాంక్స్‌. ‘దిల్‌’ రాజు, దేవిశ్రీ ప్రసాద్‌ వల్ల సినిమాకు క్రేజ్‌ వస్తోంది’’ అని ఆశిష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షిత్‌రెడ్డి, విక్రమ్‌ లగడపాటి తదితరులు పాల్గొన్నారు.