ఆచితూచి అడుగు

ABN , First Publish Date - 2020-05-01T06:18:24+05:30 IST

రెండోవిడత లాక్‌డౌన్‌ ముగింపు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, సడలింపుల ప్రస్తావన పెరిగిపోతున్నది. కొన్ని రకాల సడలింపులు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాలు కూడా స్వయంగా గ్రామీణ ప్రాంతాలలో ఉత్పాదక, పారిశ్రామిక కార్యక్రమాలకు...

ఆచితూచి అడుగు

రెండోవిడత లాక్‌డౌన్‌ ముగింపు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, సడలింపుల ప్రస్తావన పెరిగిపోతున్నది. కొన్ని రకాల సడలింపులు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాలు కూడా స్వయంగా గ్రామీణ ప్రాంతాలలో ఉత్పాదక, పారిశ్రామిక కార్యక్రమాలకు అనుమతించడం– వాతావరణంలో ఒక మార్పును సూచిస్తున్నది. దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 వ్యాధిగ్రస్తుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నా, ఎల్లకాలం లాక్‌డౌన్‌ కొనసాగించడం సాధ్యం కాదనే నిర్ధారణకేదో కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తున్నది. వ్యాధులు, మరణాల రేటు, మన దేశంలో ప్రమాదకరంగా లేదని, అనేక జిల్లాలు వ్యాధిరహితంగా మారిపోతున్నాయని, గ్రీన్‌జోన్లు పెరిగిపోతుండడంతో, పాక్షికంగా జనజీవనాన్ని యథాస్థితికి తేవడమే సమంజసమని కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ అవగాహనతో ఏకీభవిస్తున్నట్టు కనిపించడం లేదు. కొందరు ఈ పాటికే లాక్‌డౌన్‌ గడువును పొడిగించారు. అనేక రాష్ట్రాలలో పరిస్థితి లాక్‌డౌన్‌ను ఏమాత్రం సడలించగలిగే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. వ్యాధి వ్యాప్తి నియంత్రణలో ఉన్నా, కొన్ని ముందుజాగ్రత్తలను కోరుకుంటున్నాయి. వ్యాధివ్యాప్తి తీవ్రంగా కనిపిస్తున్నా మరి కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇప్పటికే మంజూరు చేశాయి. 


వ్యాధి వ్యాప్తి గురించి, లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణ వ్యూహం గురించి కేంద్రమైనా, రాష్ట్రాలైనా పారదర్శకతను పాటించడం అవసరం. ప్రజలకు మొత్తం విషయాలు తెలియాలి. వారికి అవగతమయ్యేట్టు చెప్పాలి తప్ప, దాపరికాలు కూడదు. లాక్‌డౌన్‌ ఒక ఆవశ్యకమైన చర్య అని ప్రజలు నమ్మినప్పుడు, దానిని ముగించడాన్ని కూడా ప్రజలు నమ్మాలి. లాక్‌డౌన్‌ వల్ల ఉత్పన్నమయిన పరిస్థితి అసంఖ్యాకులకు కష్టనష్టాలతో కూడుకున్నది. అల్పాదాయ వర్గాల వారికి, ఏ రోజుకారోజు సంపాదించుకునేవారికి ఈ లాక్‌డౌన్‌ నరకం. జనజీవనం అంతా స్తంభించడంతో, రవాణా సదుపాయాలు లేక, వైద్యసదుపాయాలు అందక– కలుగుతున్న ఇబ్బందులు సరే సరి. దేశమంతా స్తంభించిపోతే, ఇంత పెద్దసంఖ్యలో వలసకార్మికులు ఇళ్లదారి పడతారని, అదొక పెనుసమస్య అవుతుందని, ఇంతకుముందు మనకు తెలియదు.


వారిని వెనువెంటనే స్వస్థలాలకు పంపే నిర్ణయం తీసుకుని ఉంటే, ఈ మానవీయ సంక్షోభం తగ్గి ఉండేది. ఆలస్యంగా అయినా మేల్కొన్నారు సంతోషమే కానీ, ప్రభుత్వం కరోనా నేపథ్యంలో అన్నీ సరిఅయిన, వివేకవంతమయిన నిర్ణయాలే తీసుకోవడం లేదన్న సత్యాన్ని వలసకార్మికుల సమస్య తెలియజెప్పింది. కాబట్టి, ప్రస్తుత విపత్కర పరిస్థితి, దాని పరిష్కారాల విషయమై బహిరంగ చర్చ, విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ రంగాల ప్రతినిధుల, నిపుణుల, మేధావులతో సంప్రదింపులు అవసరం. కేవలం రాజకీయ నాయకత్వం సందేశాలివ్వడం, బ్యూరోక్రాట్లు, పోలీసులు అమలుచేయడం వల్ల ప్రజాభాగస్వామ్యం పూర్తిస్థాయిలో సమకూరదు. లాక్‌డౌన్‌ సమయంలో కంటె, సడలింపుల సమయంలో ప్రజల సహకారం అధికంగా అవసరమవుతుందన్నది గుర్తించాలి. కేంద్రప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, దృశ్య ప్రసార సాధనాల నుంచి సమయాన్ని తీసుకుని ప్రజలతో నిత్యం సంభాషించడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదో అర్థం కాదు. సంభాషణ అంటే ప్రధానులు, ముఖ్యమంత్రులు చేసేది మాత్రమే కాదు. వైద్యులు, నిపుణులు, విధాన నిర్ణేతలు, అధికారులు అందరూ నిత్యం అందుబాటులో ఉండాలి. 


సడలింపులు అవసరమే. లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా వైదొలగవలసిందే. ఈ క్రమంలో ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న శ్రేణుల ప్రయోజనాలు, బలహీనులు, వయోధికుల అవసరాలు ప్రాధాన్యం పొందాలి. చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వినోదాలు అన్నీ అవసరమే. కానీ వాటిని ప్రాధాన్యక్రమంలో స్పృశించాలి. ఈ వ్యూహం– జీవనోపాధి సంక్షోభం, కనీసావసరాల లోపం జరగకుండా జాగ్రత్త వహిస్తూ, వ్యాధివ్యాప్తిని నిరోధించేలా, తిరగబెట్టే అవకాశం లేకుండా ఉండాలి. ఈ అవగాహన, వివేకం కేంద్రప్రభుత్వానికే ఉండాలని ఎందుకు భావించాలంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీ నుంచి పర్యవేక్షణ సాగుతున్నది. దిశానిర్దేశం ఇవ్వడం మాత్రమే కాదు, నిఘాలు, సమీక్షలు, నిర్ధారణలు కూడా కేంద్రం నుంచి సాగుతున్నాయి. ఇటువంటి సందర్భాలలో కేంద్రీకృత నిర్వహణ అవసరం కావచ్చును కానీ, జరగవలసిన పని అంతా క్షేత్రస్థాయిలోనే కదా? స్థూల మార్గదర్శనం, సూక్ష్మస్థాయి ఆచరణ రెండూ కలగలిస్తేనే ఇంత పెద్ద దేశంలో లాక్‌డౌన్‌ కానీ, దాని నిష్క్రమణ కానీ ప్రమాదరహితంగా అమలుజరుగుతాయి.


మొదటి నుంచి కేంద్రప్రభుత్వం ఉచిత సలహాలు, ఉద్వేగప్రసంగాలు, కొవ్వొత్తులు, గంటలపిలుపులే తప్ప, రాష్ట్రాలకు ఆర్థికంగా ఎటువంటి చేయూతలు ఇవ్వడం లేదు. చివరకు వలసకూలీల స్వస్థలప్రయాణ వ్యయం కూడా రాష్ట్రాలే భరించాలి. ఇప్పుడు ఉన్నట్టుండి, ఇక సాధారణజీవనానికి త్వరత్వరగా వెడదామని కేంద్రం ఏకపక్షంగా భావిస్తే కనుక, దాని వెనుక ఉన్న తర్కమేమిటో ప్రజలకు తెలియాలి. అమెరికాలో ట్రంప్‌ భావిస్తున్నట్టు, ఆరోగ్యం కంటె ఆర్థికమే ముఖ్యమా? పోయేవాళ్లు పోతారు, ఉన్నవాళ్ల గురించి ఆలోచించాలన్న దృక్పథమా? భారతదేశంలో కరోనాపై నిర్ణయాత్మకమైన నియంత్రణ సాధించకుండా సడలింపులపై అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే అది మరో ఉపద్రవానికి దారితీయవచ్చు. కాబట్టి, ఆలోచించి అడుగు వేయాలి. జనజీవనాన్ని ఎంతో కాలం స్తంభించి ఉంచలేము. 

ఈ స్తంభనను ఉపసంహరించడం అర్థవంతంగా, సురక్షితంగా జరగాలి. ప్రాధాన్యం బడుగులకు, బీదలకు, అసహాయులకు దొరకాలి.

Updated Date - 2020-05-01T06:18:24+05:30 IST