పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు : తాలిబన్ మంత్రి

ABN , First Publish Date - 2021-09-08T22:01:47+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంలో

పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు : తాలిబన్ మంత్రి

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలకు విలువ లేదని చెప్పారు. తాలిబన్లకు అలాంటివేవీ లేకపోయినా నేడు అత్యున్నత స్థాయిలో ఉన్నారన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వంలోని విద్యా శాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లా మునిర్ మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది. ‘‘నేడు మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీలకు వేటికీ విలువ లేదు. ముల్లాలు, అధికారంలో ఉన్న తాలిబన్లకు అటువంటి పీహెచ్‌డీలు, ఎంఏలు, కనీసం హైస్కూల్ డిగ్రీలైనా లేవు, అయినా వాళ్ళు అందరికన్నా గొప్పవాళ్లు’’ అని మునిర్ అన్నారు. 


దీంతో మునిర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ట్విటరాటీ తీవ్ర ఆగ్రహంతో, ‘‘ఈ వ్యక్తి చదువు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు?’’ అని మండిపడ్డారు. మరో యూజర్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఉన్నత విద్యకు విలువ లేదని ఉన్నత విద్యా శాఖ మంత్రి చెప్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 


‘‘చదువు గురించి ఇలాంటి సిగ్గుమాలిన భావాలుగలవారు అధికారంలో ఉండటం ముఖ్యంగా యువతకు, బాలలకు పెను విపత్తు’’ అని మరొక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-09-08T22:01:47+05:30 IST