గురుద్వారాలోకి ప్రవేశించి అపవిత్రం చేసిన తాలిబన్లు

ABN , First Publish Date - 2021-10-16T01:58:35+05:30 IST

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

గురుద్వారాలోకి ప్రవేశించి అపవిత్రం చేసిన తాలిబన్లు

కాబూల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిపై దారుణాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోటి జరిగింది. కాబూల్‌లోని కర్టే పర్వాన్‌లో ఉన్న గురుద్వారా దష్‌మేష్‌లో తాలిబన్లు బలవంతంగా ప్రవేశించారు.


ఆయుధాలతో వచ్చిన తాలిబన్లు సిక్కులను భయపెట్టారని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి కాబూల్‌లోని సిక్కు సమాజం నుంచి తమకు బోల్డన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. 


నేటి మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో ఆయుధాలు ధరించిన కొందరు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక యూనిట్‌కు చెందినవారమంటూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని పునీత్ సింగ్ తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారని పేర్కొన్నారు.


పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుద్వారా అంతా కలియదిరిగారని, దానిని అనుకున్న ఉన్న స్కూల్‌లోకీ ప్రవేశించారని వివరించారు. వారిని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుపై చేయిచేసుకున్నారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని పేర్కొన్నారు.  

Updated Date - 2021-10-16T01:58:35+05:30 IST