తాలిబన్లకు మద్దతుగా పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్య

ABN , First Publish Date - 2021-08-16T22:01:09+05:30 IST

తాలిబన్లకు తొలి నుంచీ మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మాత్రం అఫ్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛ లంభించిందని చెప్పే ప్రయత్నం చేశారు.

తాలిబన్లకు మద్దతుగా పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్య

ఇస్లామాబాద్: అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో.. అక్కడి మహిళలు తమకు బానిసత్వం తప్పదని భయపడిపోతున్నారు. తమ భవిష్యత్తు చీకటిమయం అయిందని భావించిన అనేక మంది దేశం విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాలిబన్లు దేశసరిహద్దులను మూసివేయడంతో..వారు కాబూల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకుని, విమానాలు పట్టుకుని వేళాడుతూ అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కళ్లముందు జరుగుతున్న ఘటనలు. ఈ విషాదకర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!  


అయితే.. తాలిబన్లకు తొలి నుంచీ మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మాత్రం అఫ్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పే ప్రయత్నం చేశారు. అఫ్ఘాన్ ప్రజల బానిస సంకెళ్లను తాలిబన్లు తెంచేశారని తాజాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, పాశ్చాత్య సంస్కృతికి తలొగ్గడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇతరుల సంస్కృతికి అలవాటు పడిన వారు మానసికంగా ఆ సంస్కృతికి తలొగ్గుతారు. ఇది బానిసత్వం కంటే దారుణమైదని మనం గుర్తించాలి. సాంస్కృతిక బానిసత్వ బంధనాలను తెంచడం మరింత కష్టం. అయితే.. అఫ్ఘానిస్థాన్‌లో ఈ సంకెళ్లు తెగిపోవడం మనం ప్రస్తుతం చూస్తున్నాం’’ అని ఇమ్రాన్ ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-16T22:01:09+05:30 IST