Abn logo
Sep 25 2021 @ 02:41AM

చేతులు నరికే శిక్షలుంటాయి

మా దేశం.. మా చట్టాలు.. మా ఇష్టం..

స్పష్టం చేసిన తాలిబాన్ల అగ్రనేత తురాబీ

కాబూల్‌, సెప్టెంబరు 24: అఫ్ఘానిస్థాన్‌ మళ్లీ రాక్షస పాలన వైపు అడుగులు వేస్తోంది. తాము మారామని చెబుతూనే తాలిబాన్లు క్రూరమైన శిక్షలు విధిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తాలిబాన్ల ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే.. ముస్లింలలోనే తమకు పడని కమ్యూనిటీకి చెందిన ఆరుగురి చర్మం వలిచి.. దారుణంగా హతమార్చారు. తాజాగా షరియత్‌ ప్రకారం శిక్షలు అమలు చేస్తామంటూ తాలిబాన్ల సహ వ్యవస్థాపకుడు ముల్లా నూరుద్దీన్‌ తురాబీ స్పష్టం చేశారు. ‘‘చేతులు నరకడంలాంటి క్రూరమైన శిక్షలను అమలు చేస్తాం. దీనిపై విధివిధానాలను రూపొందిస్తున్నాం. అయితే.. గతంలో మాదిరిగా బహిరంగంగా శిక్షలను అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి చట్టాలు వారివే. మా చట్టాలు ఖుర్‌ఆన్‌, ఇస్లాంకు అనుగుణంగా ఉంటాయి. మా అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూదు. మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనవసరం లేదు’’ అని ఆయన అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇతర దేశాల చట్టాలను తాము విమర్శిస్తున్నామా అని ప్రశ్నించారు. కాగా, ఉదయాన్నే లేవడం.. ఇంటిపనులు చేసుకుని, కునుకు తీయడం.. మళ్లీ తినడం.. రాత్రి పడుకోవడం.. ఈ వ్యవహారం తనకు నచ్చడంలేదని, మహిళా విద్యతోనే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుందంటూ ఓ బాలిక వీడియో సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. తమ హక్కులను కాలరాజేందుకు ఈ తాలిబాన్లు ఎవరు అని ప్రశ్నించింది.