ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల బలవంతపు పెళ్లిళ్లు

ABN , First Publish Date - 2021-08-13T20:14:08+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రాబల్యం పెంచుకుంటున్న తాలిబన్ల అరాచకాలు తీవ్రమవుతున్నాయి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల బలవంతపు పెళ్లిళ్లు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రాబల్యం పెంచుకుంటున్న తాలిబన్ల అరాచకాలు తీవ్రమవుతున్నాయి. సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడటంతోపాటు అవివాహిత మహిళలను ఉగ్రవాదులకు ‘భార్యలు’గా మారాలని నిర్బంధిస్తున్నారని అమెరికన్ మీడియా తెలిపింది. లొంగిపోయిన ప్రభుత్వ దళాల సైనికులను హింసించి, చంపుతున్నారని పేర్కొంది. 


ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో చాలా వరకు తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్ళాయి. దీంతో తమ ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని తాలిబన్లు నిర్బంధిస్తున్నారని అమెరికన్ మీడియా తెలిపింది. తాలిబన్లు పట్టుకున్న, వారికి లొంగిపోయిన సైనికులను హింసించి, చంపుతున్నారని, సామాన్య ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని తెలిపింది. 


తాలిబన్ల దురాగతాలను తట్టుకోలేని చాలా మంది ఆఫ్ఘన్లు కాబూల్‌‌కు తరలివస్తున్నట్లు తెలిపింది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లోనివారు, కాబూల్‌కు తరలిపోతున్నవారు చెప్పిన వివరాల ప్రకారం, తాలిబన్లు విచక్షణ లేకుండా దాడులు చేయడంతోపాటు అవివాహిత మహిళలను తమ భార్యలుగా మారాలని బలవంతపెడుతున్నారని తెలుస్తోంది. నిర్బంధంగా పెళ్లి చేసుకోవడం లైంగిక హింస క్రిందకు వస్తుందని మానవ హక్కుల సంఘాలు చెప్తున్నాయి. 


తాము విజయం సాధిస్తామని, ప్రభుత్వాధికారులు, సైన్యం, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తాలిబన్లు బహిరంగంగా ప్రకటించారని, అయితే ప్రస్తుత పరిణామాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అమెరికన్ మీడియా తెలిపింది. 


కాబూల్‌లోని అమెరికన్ ఎంబసీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో తాలిబన్లను తప్పుబట్టింది. లొంగిపోయిన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ దళాల సైనికులను ఉరి తీసి చంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొంది. ఈ పరిణామాలు చాలా ఆందోళనకరమని, యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని తెలిపింది. 


Updated Date - 2021-08-13T20:14:08+05:30 IST