సరిహద్దుల్లో సూసైడ్ బాంబర్ల స్పెషల్ బెటాలియన్: తాలిబన్లు

ABN , First Publish Date - 2021-10-03T02:51:03+05:30 IST

ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని అధికారంలోకి వచ్చిన తాలిబన్ల రాక్షస పాలనకు ఇది పరాకాష్ట. ఇప్పటికే

సరిహద్దుల్లో సూసైడ్ బాంబర్ల స్పెషల్ బెటాలియన్: తాలిబన్లు

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని అధికారంలోకి వచ్చిన తాలిబన్ల రాక్షస పాలనకు ఇది పరాకాష్ట. ఇప్పటికే బహిరంగ మరణశిక్షలు, శత్రువులను వేటాడి చంపడం వంటి పనులకు పాల్పడుతున్న తాలిబన్లు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను మోహరిస్తున్నట్టు ప్రకటించింది. మరీ ముఖ్యంగా బదఖ్షన్ ప్రావిన్స్‌లో ఈ ప్రత్యేక ఆత్మాహుతి బెటాలియన్‌ను మోహరిస్తున్నట్టు తెలిపింది. 


 బదఖ్షన్ ప్రావిన్స్ తజకిస్థాన్, చైనాతో సరిహద్దులు పంచుకుంటోంది. ఈ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్ అహ్మది మీడియాతో మాట్లాడుతూ.. సూసైడ్ స్పెషల్ బెటాలియన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ బెటాలియన్‌కు లష్కర్-ఇ-మన్సూరి (మన్సూరి ఆర్మీ)గా నామకరణం చేశారు. ఈ బెటాలియన్‌ను దేశ సరిహద్దుల్లో మోహరించనున్నట్టు నిసార్‌ను ఉటంకిస్తూ ఖామా ప్రెస్ పేర్కొంది. ఈ బెటాలియన్ అచ్చం ఆత్మాహుతి దళాలను పోలి ఉంటుంది. గత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్న చందంగానే ఉంటుందని నిసార్ అహ్మద్ చెప్పినట్టు తెలిపింది. 


ఈ బెటాలియన్ కనుక లేకపోయి ఉంటే అమెరికా ఓటమి సాధ్యమయ్యేది కాదని నిసార్ తెలిపారు. అత్యంత ధైర్యవంతులైన ఈ బెటాలియన్ వ్యక్తులు పేలుడు పదార్థాలు నిండిన కోట్లు ధరిస్తారని పేర్కొన్నారు. వీరందరూ అల్లా సమ్మతి కోసం తమను తాము అర్పించుకునే భయం లేని వ్యక్తులన్నారు. కాగా, తాలిబన్లకు లష్కర్-ఇ-మన్సూరితోపాటు ‘బద్రి 313’ బెటాలియన్ కూడా ఉంది.  కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోహరించిన అత్యాధునిక మిలటరీ గ్రూపుల్లో ఇది కూడా ఒకటి. బద్రి 313 సూసైడ్ బాంబర్లతో నిండి ఉంటుందని ‘ఖామా ప్రెస్’ తెలిపింది.

Updated Date - 2021-10-03T02:51:03+05:30 IST