ప్రజలతో మాట్లాడండి

ABN , First Publish Date - 2020-07-03T10:21:26+05:30 IST

బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై, అధికారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. పరిశీలకులు, నిపుణులు, కేంద్రబృందం సభ్యులు, న్యాయస్థానాలు పదే పదే చెబుతున్నా, పరీక్షల సంఖ్యను తగినంతగా పెంచడానికి ప్రభుత్వం

ప్రజలతో మాట్లాడండి

వేగంగా వ్యాపిస్తున్న ఒక సాంక్రమిక వ్యాధిగా మాత్రమే కాక, హృదయవిదారకమైన మానవీయ విషాదాన్ని సృష్టిస్తున్న శక్తిగా కూడా కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. అన్ని దేశాలూ ఈ ఉత్పాతంలో ఒకే దశలో, ఒకే నష్టస్థాయిలో లేవు. కొన్ని దేశాలు ముందే జబ్బు బారిన పడి కోలుకున్నాయి, కొన్ని మన దేశం కంటె ముందే విజృంభణ స్థాయికి వెళ్లి, ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నాయి. మరి కొన్ని దేశాలు వ్యాప్తి నెమ్మదిస్తున్న స్థితిలో ఉన్నాయి. అతి కొద్ది దేశాలు మాత్రం, వాటికి ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల వల్ల, ఇతర నిర్దిష్టతల వల్ల, వాటితో పాటు అక్కడి ప్రభుత్వ నాయకత్వం అనుసరించిన వివేకవంతమైన విధానాలు, వ్యూహం వల్ల అతి తక్కువ నష్టంతో బయటపడ్డాయి లేదా, అతి స్వల్ప వ్యాప్తి దశలోనే నియంత్రించగలుగుతున్నాయి. ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకోవచ్చు. అనుసరించిన వ్యూహాలను ఇచ్చిపుచ్చుకోవచ్చు. కానీ అలా జరగలేదు. వ్యాధి త్వరలో ఉపశమిస్తుందిలే అన్న ధీమా, టీకా లేదా మందు వచ్చి తీరుతుందన్న ఆశ, ఇంతటి ఉత్పాత సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేని అసమర్థత, అలక్ష్యం- వీటన్నిటి కారణంగా, ఎవరికి వారే యమునాతీరే లాగా ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నారు. ఇటువంటి స్థితిని ఎదుర్కొనడంలో అనుభవం ఉండే అవకాశం లేని కారణంగా కూడా, ప్రభుత్వాధినేతలు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో విఫలమవుతున్నారు. ఆయా ప్రభుత్వాలు ప్రజలతో వ్యవహరించే విషయంలో అనుసరిస్తూ వస్తున్న విలువలు, పద్ధతులు- కూడా వాటి వైఖరులను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు పడుతున్న కష్టాన్ని ప్రజలు సానుభూతితోనే గమనిస్తూ ఉంటారు, అదే సమయంలో మానవీయ సంక్షోభం కదా, ఆవేశకావేశాలు, నిరాశా నిస్పృహలు, అసంతృప్తులు ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. సహజం. 


వైద్యుల మీద, ఆరోగ్య సిబ్బంది మీద రోగులకు, వారి కుటుంబ సభ్యులకు కోపతాపాలేమీ ఉండవు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వైద్యం కునారిల్లి, ప్రైవేటు వైద్యం ఖరీదై, వైద్యుడికి-రోగికి మధ్య సంబంధంలో ధనాంశ పెరిగిపోవడంతో కొంత అపనమ్మకం ఉన్న మాట నిజమే కానీ, ప్రాణాలు రక్షిస్తుందనే విశ్వాసమే వైద్య రంగం మీద ఉంటుంది. ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద, ఆరోగ్యనిర్వహణా యంత్రాంగం మీద ఉండే విమర్శలు వేరు. వైద్యసిబ్బంది ఒక్కోసారి రోగులకు సంతృప్తికరమైన సేవలు అందించలేకపోతే, అందుకు కూడా ప్రభుత్వ విధానాలే కారణం కావచ్చు. సిబ్బంది కొరత, ఉపకరణాల కొరత, బడ్జెట్ కొరత- ఇటువంటివన్నీ వైద్యుల మీద, వారి సహాయకుల మీద ఒత్తిడి తెస్తాయి. ‘‘నాకు ఊపిరాడడం లేదు, ఇక్కడ ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు’’ - అంటూ ఒక రోగి తన తండ్రికి విడియో సందేశం పంపించి, ఆ వెంటనే చనిపోయినప్పుడు - అది నిస్సందేహంగా ఒక దారుణమైన మానవీయ విషాదమే. ఆ రోగి తనను పట్టించుకోవలసిన ఫలానా ఫలానా సిబ్బంది మీద పెట్టిన అభియోగం కాదది, మొత్తంగా ఆరోగ్యవ్యవస్థ మీదనే గురిపెట్టిన బాణం అది. అటువంటి మరణవాంగ్మూలాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించవచ్చును కానీ, చనిపోయేవారు కూడా తమ బాధను చెప్పుకోగూడదంటే ఎట్లా? అటువంటి విడియో సందేశాలు ప్రజలలో భయాందోళనలను కలిగిస్తాయని ఆందోళన చెందేవారు, ఆ భయాందోళనలకు ఆస్కారం లేని పారదర్శకమైన వైద్యసేవల మీద దృష్టి పెట్టాలి తప్ప రోగుల దగ్గర సెల్ ఫోనులు అనుమతించకపోవడడం పరిష్కారం కాదు. ఇటువంటి సంఘటనలను మీడియా ప్రసారం చేయాలా వద్దా, పత్రికలు ప్రచురించాలా వద్దా? కరోనాను ధైర్యంగా ఎదుర్కొని మృత్యుంజయులైన వారి అనుభవాలనూ ప్రచురించాలి, భయాందోళనలను కలిగించే ఉదంతాలనూ ప్రచురించాలి. సమాజంలో భీతావహం సృష్టించాలని మీడియాకు ఎందుకు ఉంటుంది? కరోనా మీద యుద్ధంలో ముందుపీటీన నిలబడిన శ్రేణులలో ఒకరైన పాత్రికేయులు, స్వయంగా వ్యాధికి బాధితులు, ప్రభుత్వ లోపాలకు కూడా బాధితులు. అప్రియమైన వాటిని తివాచీ కిందికి తోసేస్తే, పరిస్థితి మెరుగుపడేది ఎట్లా? 


బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై, అధికారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. పరిశీలకులు, నిపుణులు, కేంద్రబృందం సభ్యులు, న్యాయస్థానాలు పదే పదే చెబుతున్నా, పరీక్షల సంఖ్యను తగినంతగా పెంచడానికి ప్రభుత్వం వెనుకాడుతున్నది, లేదా ప్రభుత్వం దగ్గర వసతుల లోపమేదో ఉన్నది. మూడు నెలలుగా నెలకొని ఉన్న ఒక స్థితి, రాను రాను తీవ్రమవుతుందన్న అవగాహన కూడా ఉన్న దశలో- ఎందుకు ఈ అసంసిద్ధత- అన్న సందేహం కలుగుతున్నది. ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. వ్యాధి ప్రారంభదశలో ఉన్న రోజులలో ప్రజల ముందుకు రావడానికి నాయకులకు ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు వారు కనిపించడమే లేదు. నాయకులే అక్కరలేదు, బాధ్యత కలిగిన, నిపుణులైన అధికారి ఒకరు ప్రతిరోజూ ప్రజలకు వివరాలు చెప్పవచ్చు, సందేహాలు నివృత్తి చేయవచ్చు. కరోనా వ్యాధి సోకిన వారిని అత్యధికులను సమాజంలోకే తిరిగి పంపుతున్నారు. అది అవసరమే కావచ్చు కానీ, సమాజం అందుకు సిద్ధంగా ఉన్నదా, వ్యాప్తిని నిరోధిస్తూ వారు ఏకాంతంలో ఉండగలరా, చుట్టుపక్కల కమ్యూనిటీలు ఆ స్థితిని ఎట్లా చూస్తున్నాయి -వంటి అంశాలనేమీ పరిగణనలోకి తీసుకోకుండా, ప్రజలకు తగిన వివరణలు ఇవ్వకుండా కంటెయిన్మెంట్ జోన్లను రద్దు చేసి, కేవలం రోగి ఉన్న ఇంటిని మాత్రమే ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. ఆ గుర్తింపునకు కూడా విలువ ఏమీ లేదు. అక్కడికి వైద్యులు, అధికారులు ఎవరూ రారు, పరీక్షలు, సమీక్షలు జరపరు.


శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో, స్థానిక ప్రభుత్వాన్ని కాదని కేంద్రం రంగప్రవేశం చేసింది. ఎందుకు అట్లా చేశారయ్యా అని అడిగితే, జులై నెలాఖరుకు ఐదున్నర లక్షల కేసులు ఢిల్లీలో వస్తాయని, ఆస్పత్రులు, వైద్యులు, వసతులు ఏవీ సరిపోక దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని ఉపముఖ్యమంత్రి సిసోడియా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజలలో భరోసా కలిగించడానికి తాము రంగ ప్రవేశం చేశామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంతా చేసి ఐదున్నర లక్షల లెక్క కేంద్రప్రభుత్వానిదే. ఒక అంచనా లెక్క వేసినప్పుడు, అందుకు తగ్గ వసతులు ఉన్నాయా లేవా అని బేరీజు వేసుకోకుండా నాయకులు ఎట్లా ఉంటారు? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఒకటి రెండు మాసాలలో వ్యాధి వ్యాప్తి ఏ తీరుగా ఉంటుందో, మన వ్యవస్థల సంసిద్ధత ఎట్లా ఉన్నదో చర్చించుకోవలసిందే. ఏర్పడబోయే ప్రత్యేక, కల్లోల పరిస్థితులను ప్రభుత్వ యంత్రాంగం, వైద్యసిబ్బంది మాత్రమే ఎదుర్కొనలేరని గుర్తించి, సమాజం నుంచి మద్దతును ఏ రూపంలో తీసుకోవాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. భేషజాలకు పోకుండా, కార్యకర్తలను, వైద్యనిపుణులను, ఆరోగ్యసిబ్బందిని స్వచ్ఛంద ప్రాతిపదికన, గౌరవవేతనాలతో పెద్దసంఖ్యలో నియమించుకోవాలి. పరిస్థితుల అంచనా కోసం, భవిష్యత్ కార్యాచరణ యోచన కోసం సమాజంలోని అన్ని రంగాల మేధావులను, ప్రజారంగంలోని నాయకులను సంప్రదించి, వ్యాధిపై పోరాటాన్ని ఒక సామాజిక ఉద్యమంగా మలచడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ఎన్నిసార్లు లాక్‌డౌన్‌లు విధించడానికి అయినా, అన్‌లాక్‌ను మరింత సరళం చేయడానికైనా ప్రజల సహకారం లభిస్తుంది. 

Updated Date - 2020-07-03T10:21:26+05:30 IST